లోన్‌ కడతారా.. జైలుకు పోతారా? రైతులను బెంబేలెత్తిస్తున్న ఎస్‌బీఐ అధికారులు

2 Feb, 2022 02:06 IST|Sakshi

కాల్వశ్రీరాంపూర్‌ మండలంలో 164 మంది రైతులకు ఎస్‌బీఐ నోటీసులు 

క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని హెచ్చరిక 

లబోదిబోమంటున్న రైతులు 

పెద్దపల్లి: పంట కోసం బ్యాంకు నుంచి తీసుకున్న రుణాలు చెల్లించలేదని పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్‌ మండలం ఎస్‌బీఐ బ్రాంచ్‌ అధికారులు మండలంలోని 164 మంది రైతులకు లీగల్‌ నోటీసులు జారీ చేశారు. రుణాలు వడ్డీతో సహా 15 రోజుల్లో చెల్లించకుంటే సివిల్, క్రిమినల్‌ కేసులు పెడతామని నోటీసులో పేర్కొన్నారు. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ను మళ్లీ గెలిపిస్తే రూ.లక్షలోపు రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించారు. 

అధికారంలోకి వచ్చి మూడేళ్లవుతున్నా ఇప్పటివరకు చాలామంది రైతుల రుణాలు మాఫీ కాలేదు. రుణం మాఫీ అవుతుందన్న ధీమాతో చాలామంది రైతులు మూడేళ్లుగా బ్యాంకులకు వాయిదాలు చెల్లించడం నిలిపివేశారు. దీంతో వడ్డీలు పెరిగి పోతున్నాయి. రూ.లక్ష రుణం తీసుకున్న రైతులకు ప్రస్తుతం వడ్డీ రూ.25 వేల నుంచి రూ.30వేల వరకు అయింది. ఈ నేపథ్యంలో తాజాగా బ్యాంకులు రైతులకు నోటీసులు ఇస్తున్నాయి. ఈవిషయమై బ్యాంకు మేనేజర్‌ను వివరణ కోరేందుకు ప్రయత్నించగా సమాధానం చెప్పలేదు. 

మృతి చెందిన మహిళా రైతుకు నోటీసు 
ఓ మహిళా రైతు మరణించి ఏడాదైనా.. ఆమెకు కూడా బ్యాంకు అధికారులు నోటీసులు పంపారు. కాల్వ శ్రీరాంపూర్‌ మండలానికి చెందిన కొమురమ్మ రుణం తీసుకున్నప్పుడు రైతు బీమా చేసినా.. మరణించిన ఆమెకు నోటీసు ఇవ్వడం ఏమిటనే విమర్శలు వినిపిస్తున్నాయి. 

మాఫీ అయినా నోటీస్‌: రవీందర్‌ రెడ్డి, లక్ష్మీపురం, రైతు, సర్పంచ్‌ 
అప్పు మాఫీ అయింది. అయినా నాకు నోటీసులు పంపారు. బ్యాంక్‌ అధికారులు నోటీసులు పంపడం వల్ల రైతులందరూ ఆందోళన చెందుతున్నారు. రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. 

మరిన్ని వార్తలు