స్కూళ్లో అదృశ్యం.. 11 ఏళ్లకు తల్లిదండ్రుల చెంతకు!

24 Mar, 2021 18:32 IST|Sakshi
తల్లిదండ్రులను కలిసిన నోముల రవీందర్‌రెడ్డి

సాక్షి, పెద్దపల్లి: ప్రైవేటు పాఠశాలలో చదువుతూ హాస్టల్‌లో ఉంటున్న కుమారుడు ఆ రోజు తిరిగి హాస్టల్‌కు చేరలేదు. ఎక్కడికి వెళ్లాడో తెలియక తల్లిదండ్రులు ఒకటి రెండ్రోజులు కాదు.. ఏకంగా 11 ఏళ్లుగా వెతుకుతూనే ఉన్నారు. ఫోన్‌ నంబరు మార్చకపోవడం ఆ తండ్రికి అదృష్టంగా మారింది. పాత నంబరునే జ్ఞాపకం పెట్టుకున్న కుమారుడు ఫోన్‌ చేసి మంగళవారం తల్లిదండ్రుల వద్దకు చేరాడు.

ఓదెల మండలం మడక గ్రామానికి చెందిన నోముల రాంచంద్రారెడ్డి, శ్రీలత దంపతులకు ముగ్గురు కుమారులు కిషన్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, రాజు ఉన్నారు. రెండో కుమారుడు రవీందర్‌రెడ్డి 11 ఏళ్ల క్రితం కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట పట్టణంలోని ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువుతూ హాస్టల్‌లో ఉండేవాడు. ఏం జరిగిందో గానీ అదృశ్యమైపోయాడు. తల్లిదండ్రులు అన్నిచోట్ల వెతికి చివరకు జమ్మికుంట పోలీసుస్టేషన్‌లో అదృశ్యంపై ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి కొడుకు ఆచూకీ కోసం వెతుకుతూనే ఉన్నారు.

రెండు మూడు రోజులుగా రవీందర్‌రెడ్డి తండ్రికి ఫోన్‌ చేసి తన అన్న కిషన్‌రెడ్డి స్నేహితుడినని, అతనితో మాట్లాడాలని సెల్‌ నంబరు తీసుకున్నాడు. కిషన్‌రెడ్డికి ఫోన్‌ చేసి తన వివరాలు చెప్పాడు. దీంతో కిషన్‌రెడ్డి తన బావ, స్నేహితులతో కలిసి కారులో రవీందర్‌రెడ్డి ఉంటున్న వికారాబాద్‌కు వెళ్లాడు. రవీందర్‌రెడ్డిని గుర్తించిన కిషన్‌రెడ్డి అతడితో కలిసి కూకట్‌పల్లిలో ఉంటున్న తన తమ్ముడు రాజు వద్దకు చేరుకున్నారు. తల్లిదండ్రులు కూడా అక్కడే రవీందర్‌రెడ్డిని కలిసి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. వికారాబాద్‌లో ఎగ్జిబిషన్‌ వర్క్‌పై వచ్చిన రవీందర్‌రెడ్డి ఇక్కడ ఉంటున్న తన వారిని కలుసుకోవాలని ఫోన్‌ చేసినట్లు తెలుస్తోంది. మరాఠీ మాట్లాడుతుండడంతో మహారాష్ట్రలో ఇన్నాళ్లు ఉండి ఉండవచ్చని కుటుంబసభ్యులు పేర్కొంటున్నారు. 

చదవండి: 
'నాకు రిటైర్మెంట్‌ వయసు పెంపు వద్దు'
బడి పంతులుగా మారిన సర్పంచ్‌ 

మరిన్ని వార్తలు