కింద నది.. పైన కాలువ

7 Mar, 2022 03:30 IST|Sakshi
లోయర్‌ పెన్‌గంగ ప్రాజెక్టు కాలువ లోపలి భాగం

ఆదిలాబాద్‌ జిల్లాలో కొత్త పద్ధతిలో పెన్‌గంగ కాలువ నిర్మాణం

సాక్షి, ఆదిలాబాద్‌: ఆదిలాబాద్‌ జిల్లాలో సాత్నాల నదిపై నుంచి కాలువ ప్రవహించేందుకు వీలుగా కొత్త పద్ధతిలో వంతెన నిర్మిస్తున్నారు. సాగునీటిని నదికి అవతలివైపు తరలించేందుకు ఆర్‌సీసీ షెల్ఫ్‌తో పిల్లర్లపై కాలువను కడుతున్నారు. ఈ మధ్యే నిర్మాణం పూర్తవడంతో అధికారులు, ఇంజనీర్లు కలిసి కాలువ లోపల పరిశీలించారు.

వాహనంలో తీసుకొచ్చి.. ఒక్కొక్కటిగా బిగించి.. 
ఆదిలాబాద్‌ జిల్లాలో చనాఖా–కొరాటా బ్యారేజీ కింద లోయర్‌ పెన్‌గంగ ప్రాజెక్టు మెయిన్‌ కెనాల్‌ను 42 కిలోమీటర్ల పరిధిలో రూ.207.32 కోట్లతో నిర్మిస్తున్నారు. ఇందులో భాగంగా జైనథ్, బేల మండలాలకు కాలువ నీటిని మళ్లించే మధ్యలో సాత్నాల నది ఉంది. దీంతో నదిపై 1.675 కిలోమీటర్ల మేర పిల్లర్లు నిర్మించి కాలువ కడుతున్నారు.

సిమెంట్‌ కాంక్రీట్‌తో చేసిన షెల్ఫ్‌లను (ఒక్కొక్కటి 250 టన్నుల బరువు ఉంటుంది) ఓ వాహనంలో తీసుకొచ్చి ఒక్కొక్కటిగా బిగిస్తున్నారు. పిల్లర్ల ఎత్తు 35 మీటర్ల నుంచి 40 మీటర్ల వరకు ఉంటుంది. కాలువ ద్వారా రెండు మండలాల్లోని 37 వేల ఎకరాలకు సాగునీరు అందించనున్నారు.

కాలువ లోపల నడిచి.. ఎలాగుందో చూసి..
68 పిల్లర్లపై 67 షెల్ఫ్‌లను బిగించేందుకు చేపట్టిన పనులు తుది దశకు వచ్చాయి. 24.4 మీటర్ల పొడవు, 5.2 మీటర్ల వెడల్పు, 3.2 మీటర్ల ఎత్తుతో నిర్మితమైన ఈ షెల్ఫ్‌ల ద్వారా 420 క్యూసెక్కుల సాగునీటిని తరలించవచ్చని అధికారులు చెబుతున్నారు. పనులు తుది దశకు చేరుకోవడంతో జల వనరుల శాఖాధికారులు, కాంట్రాక్టర్లు కలిసి ఈ వయాడక్ట్‌ మార్గంలో పయనించి పరిశీలించారు.

మరిన్ని వార్తలు