పెన్షన్‌ పంపిణీదారుడి వల్ల 100 మందికి కరోనా

26 Aug, 2020 15:35 IST|Sakshi

సాక్షి, మహబూబ్‌నగర్‌ / వనపర్తి: రాష్ట్రంలో కరోనా రోజురోజుకు విజృంభిస్తోంది. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. జనాలు ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికి వైరస్‌ వ్యాప్తి మాత్రం ఆగడం లేదు. నేడు రాష్ట్రంలో అత్యధికంగా 3,018 కేసులు నమోదయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వనపర్తిలో వెలుగు చూసిన ఓ సంఘటన ప్రభుత్వానికి తలనొప్పిగా మారడమే కాక.. జనాలను భయాందోళనలకు గురి చేస్తోంది. ఓ పెన్షన్‌ పంపిణీదారుడి వల్ల చిన్నంబావి జోన్‌లో పది రోజుల వ్యవధిలో ఏకంగా 100 మందికి కరోనా సోకినట్లు సమాచారం. వివరాలు.. సుమారు పది రోజుల క్రితం గ్రామస్తులకు పెన్షన్‌ పంపిణీ చేయడం కోసం జిల్లా ప్రధాన కార్యాలయం నుంచి ఒక పోస్ట్‌మ్యాన్‌ గ్రామానికి వచ్చాడు. ఈ క్రమంలో అతడిని కలిసిన వారికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఆ తర్వాత వారు కలిసిన వారు వైరస్‌ బారిన పడ్డారు.(చదవండి: తెలంగాణలో కొత్తగా 3,018 కరోనా కేసులు)

ప్రస్తుతం ఈ కేసులు జిల్లా అధికారులకు తలనొప్పిగా మారాయి. పోస్ట్‌మ్యాన్‌ని కలిసిన వారిని గుర్తించి.. ఆ తర్వాత వారు కలిసిన ప్రైమరీ కాంటాక్ట్స్‌ను గుర్తించడం పెద్ద సవాలుగా మారింది. ఈ క్రమంలో ప్రస్తుతం జిల్లాలో మెగా టెస్టింగ్‌, కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ డ్రైవ్‌ ప్రారంభించారు అధికారులు. ప్రస్తుతం గ్రామస్తులంతా హోమ్‌ క్వారంటైన్‌తో పాటు లాక్‌డౌన్‌ పాటిస్తున్నారు. బుధవారం నాటికి వనపర్తిలో 21 కంటైన్‌మెంట్‌ జోన్లు ఉన్నాయి. వాటి పరిధిలో గత వారం రోజుల్లో 337 కరోనా వైరస్‌ కేసులు నమోదయ్యాయి. 

>
మరిన్ని వార్తలు