భూ బకాసురులు! రూ.50 కోట్ల స్థలం పై కన్ను

23 May, 2022 07:38 IST|Sakshi

బంజారాహిల్స్‌ (హైదరాబాద్‌): నగరంలో భూ బకాసురులు మరోసారి రెచ్చిపోయారు. ఫోర్జరీ పత్రాలు, బోగస్‌ సర్వే నంబర్లతో బంజారాహిల్స్‌లోని రూ.50 కోట్ల విలువైన స్థలం కైంకర్యం చేయడానికి యత్నించారు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కబ్జా గుట్టురట్టు చేశారు. నలుగురిని అరెస్టు చేసి, మరికొందరి కోసం గాలిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం... ప్రవాస భారతీయుడైన న్యావనంది పూర్ణచందర్‌కు బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 13లోని సర్వే నంబర్‌ 129/40/1లో 2,538 చదరపు గజాల స్థలం ఉంది.

ఆయన అమెరికాలో ఉన్న సమయంలో ఈ స్థలంపై రేవ ఇన్‌ఫ్రా ఎండీ బాలా ప్రవీణ్‌ కన్నుపడింది. తొలుత కొన్ని ఫోర్జరీ డాక్యుమెంట్లు తయారుచేసి.. టి.ప్రతాప్‌ అనే వ్యక్తి ద్వారా నకిలీ ఆధార్‌ కార్డులు, నకిలీ కొనుగోలుదారులను సృష్టించాడు. ఖదీర్‌ బేగం అనే మహిళ నుంచి ఈ స్థలాన్ని వీళ్లు కొనుగోలు చేసినట్లుగా బోగస్‌ పత్రాలు చేశాడు. వీటితో అడ్డా కూలీలను యజయానులుగా చూపించి ఈ ప్లాట్‌ను రిజిస్ట్రేషన్‌ కూడా చేయించాడు. విషయం తెలిసిన అసలు యజమాని పూర్ణచందర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

కూలీ యజమానులకు రూ.10వేలు 
ఈ కేసులో ఖదీర్‌ బేగం, ఎండీ మొయినుద్దీన్, పరాంకుశం సురేందర్, దొంతుల సుధాకర్, బాలా ప్రవీణ్, టి.ప్రతాప్, సింగిరెడ్డి వీర హనుమరెడ్డి, బూరుగు సత్యనారాయణగౌడ్, కె.హరికృష్ణారెడ్డి, దీపక్‌ దేశ్‌ముఖ్‌ తదితరులను పోలీసులు నిందితులుగా చేర్చి అభియోగాలు నమోదు చేశారు. ఖదీర్‌ బేగం కొన్నేళ్ల క్రితమే చనిపోయినట్లు దర్యాప్తులో తేలింది. యజమానుల అవతారమెత్తిన అడ్డా కూలీలకు రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు చెల్లించారని తేలింది.

పి.సురేందర్, దొంతుల సుధాకర్, మొయినుద్దీన్, ముజాహిదీన్‌లను అరెస్ట్‌ చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న ప్రధాన సూత్రధారి బాలా ప్రవీణ్‌తోపాటు టి.ప్రతాప్‌ కోసం గాలిస్తున్నారు. పక్కా పథకం ప్రకారం ఈ వ్యవహారం నడవడం, ఈ స్థలం నకిలీ యజమానుల పేరుతో రిజిస్ట్రేషన్‌ కావడం తదితర పరిణామాల నేపథ్యంలో తెర వెనుక పెద్దలు ఉన్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.   

(చదవండి: అమ్మాయిని కాళ్లతో తన్నుతూ చిత్ర హింసలు.. రంగంలోకి దిగిన సీఎం)

మరిన్ని వార్తలు