Hyderabad Metro: పాతబస్తీకి మెట్రో కలేనా..?

15 Dec, 2022 07:29 IST|Sakshi
ఎంజీబీఎస్‌ నుంచి పాతబస్తీ దారుషిఫా వైపు వేసిన మెట్రో అలైన్‌మెంట్‌ 

ఇమ్లీబన్‌ నుంచి ఫలక్‌నుమా వరకు 6 కిలోమీటర్లు

ఏళ్లు గడుస్తున్నా ముందుకు సాగని పనులు 

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు సీఎం శంకుస్థాపన  

పాతబస్తీపై రాష్ట్ర ప్రభుత్వం చిన్నచూపు

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని అన్ని ప్రాంతాల్లో మెట్రో రైలు పరుగులు తీస్తుండగా.. పాతబస్తీలో ఇంకా పనులను కూడా ప్రారంభించకపోవడంపై నిరాశకు గురవుతున్నారు. నగరంలోని అన్ని ప్రాంతాల్లో మెట్రో పనులు పూర్తయ్యి ప్రయాణికులకు అందుబాటులో ఉండగా.. పాతబస్తీలో మెట్రో రైలు పనుల ఊసే లేదు. ఇటీవల నుంచి శంషాబాద్‌ విమానాశ్రయానికి నూతనంగా నిర్మించనున్న మెట్రో పనులకు సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన సైతం చేశారు. దీంతో ఇప్పట్లో పాతబస్తీలో మెట్రో రైలు పరుగులు తీసే పరిస్థితులు కనిపించడం లేదు.

ఎంజీబీఎస్‌ నుంచి ఫలక్‌నుమా వరకు.. 
ఎంజీబీఎస్‌ నుంచి ఫలక్‌నుమా వరకు మెట్రో రైలు పనులు ప్రారంభం కావాల్సి ఉంది. ఎంజీబీఎస్‌ నుంచి దారుషిఫా, పురానీహవేలి, మీరాలంమండి, ఎతేబార్‌చౌక్, బీబీబజార్‌ చౌరస్తా, హరి»ౌలి, శాలిబండ, సయ్యద్‌ అలీ ఛబుత్రా, అలియాబాద్, షంషీర్‌గంజ్‌ ద్వారా ఫలక్‌నుమా వరకు 6 కిలో మీటర్ల పనులు జరగాల్సి ఉంది. మెట్రో రైలు పనులను ప్రారంభించడానికి ఒక దశలో ముందుకు వచ్చిన ప్రాజెక్టు అధికారులు అంచనా వ్యయం పెరిగిందని వెనక్కి తగ్గారు. ఇదిలా ఉండగా చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసి పాతబస్తీలో మెట్రో రైలు పనుల కోసం రూ.500 కోట్ల నిధులను మంజూరు చేయించామని పేర్కొంటూ వెంటనే పనులు ప్రారంభించాలని రెండు నెలల క్రితం మెట్రో రైలు ప్రాజెక్ట్‌ ఎండీని కలిసి కోరారు. అయినా.. పాతబస్తీలో మెట్రో పనులు ప్రారంభం కాలేదు.  

ట్విటర్‌లో పోస్టుచేసి మరచిన కేటీఆర్‌.. 
పాతబస్తీలో మెట్రో రైలు ప్రాజెక్ట్‌ పనులు ప్రారంభిస్తామని గతేడాది మంత్రి కేటీఆర్‌ చేసిన ట్వీట్‌ను మరిచిపోయాడని పాతబస్తీ ప్రజలు అంటున్నారు. గతంలో సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సైతం అసెంబ్లీలో పాతబస్తీ మెట్రో రైలు ప్రస్తావన తెచ్చి.. పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికల సమయంలో పాతబస్తీ ప్రజాప్రతినిధులు, అధికారులు హడావుడి చేసి తర్వాత పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

2018లో అలైన్‌మెంట్‌ను పరిశీలించిన మెట్రో ఎండీ, ఎమ్మెల్యేలు.. 
2018 ఆగస్టు 25న పాతబస్తీలో మెట్రో రైలు అలైన్‌మెంట్‌ పనులను ప్రారంభించడానికి మెట్రో రైలు ప్రాజెక్టు ఎండీతో పాటు మజ్లీస్‌ పార్టీ ఎమ్మెల్యేలు పాతబస్తీలో పర్యటించారు. గతంలో ప్రతిపాదించిన విధంగా మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌(ఎంజీబీఎస్‌) నుంచి ఫలక్‌నుమా వరకు మెట్రోరైలు పనులను చేపట్టడానికి మెట్రో రైలు ప్రాజెక్టు అధికారుల బృందం పరిశీలించింది. పాత అలైన్‌మెంట్‌ ప్రకారమే పనులు ప్రారంభిస్తామని అధికారులు, ఎమ్మెల్యేలు అప్పట్లో తేల్చి చెప్పారు. అయినా ఇప్పటి వరకు ఆచరణ సాధ్యం కాలేదు.

మరిన్ని వార్తలు