నియంత్రిత బాటలోనే 

7 Aug, 2020 03:52 IST|Sakshi

రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగానే ఈ వానాకాలం పంటల సాగు

1.25 కోట్ల ఎకరాల్లో పంటల సాగుకు వ్యవసాయ శాఖ ప్రణాళిక

ఇప్పటివరకు 1.13 కోట్ల ఎకరాల్లో జరిగిన సాగు పనులు

భారీగా తగ్గిన మొక్కజొన్న.... గతేడాదితో పోలిస్తే పదో వంతే సాగు

మొక్కజొన్న స్థానంలో పెరిగిన కంది

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర అవసరాలకు తోడు డిమాండ్‌ ఉన్న పంటలనే ప్రోత్సహించాలన్న సీఎం కేసీఆర్‌ సూచనకు అనుగుణంగానే ఈ వానాకాలం పంటల సాగు నియంత్రిత బాటలో సాగుతోంది. గత వానాకాలంలో సాగు పంటల వివరాలను బేరీజు వేసి ఈ వానాకాలంలో మొత్తం 1.25 కోట్ల ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేసేలా వ్యవసాయ శాఖ ప్రణాళిక సిద్ధం చేయగా అన్నదాతలు ఇప్పటివరకు 1.13 కోట్ల ఎకరాల్లో పంటల సాగు చేపట్టారు. 

మక్కలు తగ్గాయి.... కందులు పెరిగాయి  
వ్యవసాయ శాఖ తాజా నివేదిక ప్రకారం ఈ ఏడాది రాష్ట్రంలో మొక్కజొన్న సాగు గణనీయంగా తగ్గింది. 2019లో మక్కలు రాష్ట్రవ్యాప్తంగా 10.12 లక్షల ఎకరాల్లో వేయగా గతేడాది ఇదే సమయానికి 8.38 లక్షల ఎకరాల్లో వేశారు. కానీ ఈ ఏడాది మాత్రం గతేడాది మొత్తం సాగులో కేవలం 10.6 శాతమే రైతులు మొక్కజొన్న పంట వైపు మొగ్గు చూపారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 1.74 లక్షల ఎకరాల్లోనే మక్కలు సాగు చేయగా అందులోనూ స్వీట్‌ కార్న్, పాప్‌ కార్న్, బేబీ కార్న్‌ రకాలే ఎక్కువగా ఉన్నాయి. మక్కల స్థానంలో కంది సాగు చేపట్టాలన్న వ్యవసాయ శాఖ సూచనల మేరకు ఈసారి కంది సాగు విస్తీర్ణం పెరిగింది. గతేడాది మొత్తం 7.38 లక్షల ఎకరాల్లో కంది పంట వేయగా ఈ ఏడాది ఇప్పటికే 9.54 లక్షల ఎకరాల్లో వేశారు. ఈ విస్తీర్ణం ఇంకా పెరుగుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది.  

ఆ రెండు పంటలదీ అదే బాట.. 
ఈ వానాకాలంలో పత్తిని వీలైనంత మేర ఎక్కువ సాగు చేయాలని వ్యవసాయ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం రైతులకు అవగాహన కల్పించి రాష్ట్రవ్యాప్తంగా ఈసారి 60 లక్షల ఎకరాల్లో పత్తి విత్తనాలు వేయించాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకు అనుగుణంగానే రాష్ట్రంలో ఇప్పటికే 56.26 లక్షల ఎకరాల్లో రైతులు పత్తి పంట వేశారు. రాష్ట్రంలో పత్తి సాధారణ సాగు 40 లక్షల ఎకరాలవగా గతేడాది 54.45 లక్షల ఎకరాల్లో పత్తి సాగు జరిగింది. కానీ ఈ వానాకాలంలో ఇప్పటికే గతేడాదికన్నా ఎక్కువ సాగు జరిగిందని గణాంకాలు చెబుతున్నాయి. వరి విషయానికి వస్తే 2019లో 41.20 లక్షల ఎకరాల్లో రైతులు నాట్లు పెట్టారు.

అదే ఈ సీజన్‌లో దాదాపు అదే స్థాయిలో 38.35 లక్షల ఎకరాల్లో నాట్లు పడ్డాయి. అయితే ఆగస్టు చివరి వరకు నాట్లు వేసే అవకాశం ఉన్నందున ఈ విస్తీర్ణం ఇంకా పెరుగుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. ఇప్పటివరకు సాగయిన 38.35 లక్షల ఎకరాలకుగాను 28 లక్షల ఎకరాల్లో రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన ప్రకారమే ఫైన్‌ (మేలు) రకం ధాన్యం సాగు చేయడం గమనార్హం. మొత్తంమీద రాష్ట్ర ప్రభుత్వ నియంత్రిత సాగు ఆలోచన తొలి ఏడాదిలోనే కార్యరూపంలోకి రావడం ఆహ్వానించదగ్గ పరిణామమని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు

మరిన్ని వార్తలు