టెస్టులంటే టెన్షన్‌ 

11 Aug, 2020 03:24 IST|Sakshi

కరోనా లక్షణాలున్నా పరీక్షలకు ముందుకురాని బాధితులు

పాజిటివ్‌ వస్తుందేమోనన్న భయంతో వెనకడుగు

పరీక్షలకు వెళితే ఇతరుల ద్వారా వస్తుందన్న ఆందోళన

సొంత వైద్యంతో తగ్గించుకుందామని ధీమా

ఆలస్యం వల్ల వెంటిలేటర్‌ వరకూ వెళ్తున్న పరిస్థితి  

ఆదిలాబాద్‌కు చెందిన ఆమె పేరు లక్ష్మీబాయి (పేరు మార్చాం). ఇటీవల కొద్దిగా జ్వరం, దగ్గు రావడంతో డాక్టర్‌ సూచన మేరకు మందులు వాడింది. అయినా తగ్గలేదు. కరోనా టెస్ట్‌ చేయించుకోవాలని కుమారుడు చెబితే తనకు వచ్చింది సీజనల్‌ జ్వరమంటూ వాదించింది. చివరకు ఆయాసం మొదలవడంతో పరీక్ష చేయించుకుంటే కరోనా పాజిటివ్‌గా తేలింది. ఆమె ఆక్సిజన్‌ స్థాయిలు 80కి పడిపోవడంతో హైదరాబాద్‌లోని ఒక ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఆమెకు ప్రస్తుతం ఆక్సిజన్‌ అందిస్తున్నారు. 

కరీంనగర్‌కు చెందిన మరో వ్యక్తి రామలింగయ్య. ఇటీవల పొడి దగ్గు రాగా దగ్గు మందు వాడాడు. కుటుంబ సభ్యులు, స్నేహితులు కరోనా పరీక్ష చేయించుకోవాలని చెప్పినా తొలుత పట్టించుకోలేదు. వారమైనా దగ్గు తగ్గకపోవడం, ఆయాసం రావడంతో సీటీ స్కాన్‌ చేయించుకోగా కరోనాగా నిర్ధారణ అయింది. ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయని, మెరుగైన చికిత్స అవసరమని వైద్యులు చెప్పడంతో వెంటనే హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఇప్పుడు ఆక్సిజన్‌ బెడ్‌పై ఉన్నాడు.

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో చాలా మంది కరోనా వైరస్‌ లక్షణాలతో బాధపడుతున్నప్పటికీ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడానికి మాత్రం ముందుకు రావట్లేదు. జ్వరం, దగ్గు, జలుబు ఉన్నా సీజనల్‌ వ్యాధులుగా భావించి టెస్టులు చేయించుకోవట్లేదు. కొందరైతే జ్వరం వస్తే సొంతంగా పారాసిటమాల్‌ మాత్రలు వాడేస్తున్నారు. దగ్గు, జలుబు చేస్తే సొంత వైద్యంపైనే ఆధారపడుతున్నారు. పరిస్థితి విషమించే దాకా నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. కొందరు డాక్టర్లు కూడా కరోనా అనుమానితులకు సాధారణ చికిత్సపైనే దృష్టి పెడుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. కరోనా కాలంలో ఇలా ఉదాసీనంగా వ్యవహరిస్తుండటంతో పరిస్థితి చేయిదాటిపోతోంది. 

సామాజిక వ్యాప్తి మొదలైనా... 
రాష్ట్రంలోనూ కరోనా సామాజిక వ్యాప్తి మొదలైంది. ఎక్కడ, ఎలా కేసులు నమోదవుతున్నాయో కూడా ఎవరికీ అంతుబట్టట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలంతా జాగ్రత్తలు తీసుకోవాలని, జ్వరం, దగ్గు, జలుబు, ఇతరత్రా లక్షణాలు ఏవైనా ఉంటే వెంటనే కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని ప్రభుత్వం ఇప్పటికే సూచించింది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) నుంచి పెద్దాసుపత్రుల వరకు 1,100 కేంద్రాల్లో ర్యాపిడ్‌ యాంటిజెన్‌ టెస్టులు చేస్తోంది. టెస్టుల్లో పాజిటివ్‌ వస్తే తక్షణమే కరోనా నివారణ కిట్లు ఇస్తున్నారు. ఒకవేళ ఫలితం నెగెటివ్‌ వచ్చి కరోనా లక్షణాలుంటే ఆర్‌టీ–పీసీఆర్‌ పరీక్ష చేయించుకోవాలని చెబుతోంది.

అయితే ఇన్ని రకాలుగా వసతులున్నా కొందరు బాధితులు చాలా తేలికగా తీసుకుంటున్నారు. కరోనా లక్షణాలున్నా పరీక్షలు చేయించుకోవడానికి భయపడుతున్నారు. ఆసుపత్రికి వెళ్లి అందరితో కలసి టెస్టు చేయించుకోవడం వల్ల తమకు వైరస్‌ లేకున్నా సోకుతుందేమోనని అనుమానపడుతున్నారు. మరికొందరేమో పాజిటివ్‌ వస్తే కుటుంబ సభ్యులు భయపడతారని భావిస్తున్నారు. ఇంకొందరేమో తమకు ఏమీ లేదన్న ధీమాతో ఉంటున్నారు. దీంతో ఇలాంటి వారిలో ఒక్కోసారి వైరస్‌ తీవ్రత పెరిగి పరిస్థితి విషమిస్తోంది. ఆక్సిజన్‌ స్థాయిలు ఒక్కసారిగా పడిపోతుండటంతో అప్పుడు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. అయితే అప్పటికే వ్యాధి ముదిరిపోవడంతో అనేక సందర్భాల్లో ఆక్సిజన్‌ బెడ్‌పైకి లేకుంటే ఐసీయూలోకి వెళ్లాల్సి వస్తోంది. ఒక్కోసారి ప్రాణాంతకం అవుతోంది. 

ఇక విరివిగా ప్రచారం.. 
కరోనాపై ప్రజల్లో ఉన్న భయాందోళనలు, లక్షణాలుంటే తక్షణమే స్పందించేలా అవగాహన పెంచడం కోసం పట్టణాలు, గ్రామాల్లో విరివిగా ప్రచారం చేయాలని వైద్య, ఆరోగ్యశాఖ తాజాగా నిర్ణయించింది. జిల్లాల్లో ఒక నోడల్‌ వ్యవస్థను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. సామాజిక మాధ్యమాలు, మీడియా ద్వారా కూడా భారీగా ప్రచారం చేయనుంది. కరపత్రాలు ముద్రించాలని, గ్రామాల్లో చాటింపులు వేయించడం ద్వారా కరోనా లక్షణాలున్న వారు తక్షణమే ఆసుపత్రికి వచ్చేలా చేయాలని నిర్ణయించింది. కరోనా వస్తే ఏమీ కాదని, ఆలస్యం చేయడం వల్లే సమస్యలు వస్తాయని ప్రజలకు వివరించనుంది. 

ముందే స్పందిస్తే కరోనాతో ముప్పులేదు.. 
కరోనా పరీక్షలను పీహెచ్‌సీలు సహా అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో చేస్తున్నారు. అత్యంత ఖరీదైన విలువైన రెమిడెసివిర్, టోసీలుక్సిమాబ్‌ మందులు అన్ని జిల్లా ఆసుపత్రులలో ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వం కూడా ఇప్పటికే ఉన్న 8 వేల ఆక్సిజన్‌ పడకలకు తోడుగా మరో పది వేలు పెంచాలని నిర్ణయించింది. కాబట్టి ఎవరికైనా లక్షణాలుంటే పరీక్షలు చేయించుకోవాలి. వెంటనే స్పందిస్తే కరోనా వల్ల ముప్పు ఏమీ ఉండదు. – డాక్టర్‌ కిరణ్‌ మాదల, క్రిటికల్‌ కేర్‌ విభాగాధిపతి, నిజామాబాద్‌ ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ 

మరిన్ని వార్తలు