ప్రజల ఆశలు నెరవేర్చేలా.. సీఎం కేసీఆర్‌

7 Mar, 2021 01:29 IST|Sakshi

గత బడ్జెట్‌ కంటే ఎక్కువగానే కేటాయింపులు..

సమీక్షా సమావేశంలో సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశం

కరోనాతో ఇప్పటికే రూ. 50 వేల కోట్ల నష్టం..

మొత్తంగా రూ. లక్ష కోట్ల దాకా ప్రభావం

కొద్దిరోజులుగా ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటున్నాయి

నేటి నుంచి శాఖల వారీగా బడ్జెట్‌పై మంత్రి హరీశ్‌ సమీక్షలు

మళ్లీ సమీక్షించి తుది రూపు

ఈ నెల మధ్యలో బడ్జెట్‌ సమావేశాలు మొదలయ్యే చాన్స్‌

మరో 3 లక్షల యూనిట్ల గొర్రెల పంపిణీకి సీఎం ఓకే

సాక్షి, హైదరాబాద్‌: కరోనా మహమ్మారి కారణంగా రాష్ట్ర ఖజానాకు దాదాపు రూ.50 వేల కోట్ల మేర నష్టం వాటిల్లిందని.. ప్రస్తుతం ఈ నష్టం రూ.లక్ష కోట్లకు చేరుకున్నదని సీఎం కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. కరోనా తర్వాతి పరిస్థితులలో రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలు పుంజుకున్నాయని, వివిధ రూపాల్లో రాబడి పెరిగిందని చెప్పారు. ఈ నేపథ్యంలో గత బడ్జెట్‌ కంటే రాబోయే బడ్జెట్లో నిధుల కేటాయింపులు ఎక్కువగానే ఉండే అవ కాశం ఉందని తెలిపారు.

బడ్జెట్‌ ఆశాజనకంగా ఉండబోతున్నదని స్పష్టం చేశారు. రాష్ట్ర బడ్జెట్‌ 2021–22 రూపకల్పనపై శనివారం సీఎం కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. పద్దుల్లో పొందుపర్చాల్సిన శాఖల వారీ బడ్జెట్‌ అంచనాలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అధికారులు సమర్పించిన నివేదికలను సీఎం పరిశీలించారు. ఆయా అం శాలపై చర్చించిన అనంతరం.. బడ్జెట్‌ కేటాయిం పుల విధివిధానాలను ఖరారు చేశారు. ఆదివారం నుంచి ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు తమ శాఖ అధికారులతో కలిసి.. ఆర్‌అండ్‌బీ, పంచాయతీ రాజ్, పురపాలక, విద్యా, నీటిపారుదల తదితర శాఖల బడ్జెట్‌ అంచనాల తయారీపై రోజువారీగా వరుస సమావేశాలు నిర్వహిస్తారని ఈ సందర్భంగా వెల్లడించారు.

అన్ని శాఖలతో బడ్జెట్‌ రూపకల్పన కసరత్తు ముగిసిన తర్వాత.. సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో బడ్జెట్‌కు తుది మెరుగులు దిద్దనున్నారు. ఈ నెల మధ్యలో రాష్ట్ర బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని సీఎం తెలిపారు.

అభివృద్ధి, సంక్షేమ పథకాలు కొనసాగింపు
రాష్ట్రంలో అమలు చేస్తున్న పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలను కొనసాగిస్తామని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. గొర్రెల పెంపకం కార్యక్రమం అమలు కొనసాగుతుందన్నారు. ఈ పథకం ద్వారా యాదవులు, గొల్లకుర్మల కుటుంబాలు ఆదాయాన్ని మంచి ఆర్జిస్తున్నందున.. ఇప్పటికే పంపిణీ చేసిన 3.70 లక్షల యూనిట్లకు కొనసాగింపుగా.. మరో 3 లక్షల యూనిట్ల పంపిణీ కోసం బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తామని తెలిపారు.

గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం మెచ్చుకున్నదని సీఎం గుర్తు చేశారు. దేశంలోనే అధికంగా గొర్రెలు ఉన్న రాష్ట్రంగా తెలంగాణ పురోగమిస్తున్నదని కేంద్రం గుర్తించిన నేపథ్యంలో.. ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని నిర్ణయించామన్నారు. ఇక చేపల పెంపకం కార్యక్రమం గొప్పగా సాగుతోందని, మంచి ఫలితాలు వస్తున్నందున దాన్ని కూడా కొనసాగిస్తామని ప్రకటించారు. సీ సమీక్ష్లలో ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌ శర్మ, సీఎస్‌ సోమేశ్‌ కుమార్, ఆర్థిక వ్యవహారాల సలహాదారు జీఆర్‌ రెడ్డి, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్టారావు, కార్యదర్శి రోనాల్డ్‌ రాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు