‘ఔట్‌డోర్‌ జిమ్‌’పైనే ఆసక్తి 

4 Jan, 2021 08:36 IST|Sakshi
ఓపెన్‌ జిమ్‌లో వ్యాయామం చేస్తున్న స్థానికులు

జీహెచ్‌ఎంసీ ఓపెన్‌జిమ్‌కు ఆదరణ 

వరుస కడుతున్న మహిళలు, వృద్ధులు 

సౌకర్యంగా ఉందంటున్న స్థానికులు 

సాక్షి, శేరిలింగంపల్లి(హైదరాబాద్‌): శారీరక మానసికోల్లాసానికి వృద్ధులు.. చక్కటి ఆరోగ్యానికి మహిళలు.. శారీరక దృఢత్వానికి యువకులు వ్యాయామం చేయాల్సిన అవసరం ఉందని వైద్యులు సూచిస్తుంటారు. ప్రస్తుత సమాజంలో సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఉరుకులు, పరుగుల కారణంగా శరీరానికి వ్యాయామం లేక రోగాల బారిన పడుతున్నారు. యువత మాత్రం వేలకు వేలు చెల్లించి జిమ్‌లలో నిమిషాలు లెక్కపెడుతూ కుస్తీలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఓపెన్‌ జిమ్‌ (అవుట్‌ డోర్‌ జిమ్‌)లకు శ్రీకారం చుట్టింది. వాటిలో భాగంగా శేరిలింగంపల్లి సర్కిల్‌ పరిధిలోని  ఆలిండ్‌ కాలనీ పార్కులో ఏర్పాటు చేశారు. దీంతో కాలనీ వాసులు అధిక సంఖ్యలో ఉదయం, సాయంత్రం ఉత్సాహంతో వ్యాయామాలు చేస్తున్నారు.  
 

ఆలిండ్‌కాలనీ పార్కులో ఏర్పాటు చేసిన ఔట్‌డోర్‌ జిమ్‌లో అత్యాధునిక వ్యాయామ పరికరాలు అందుబాటులో ఉన్నాయి. 
ఎయిర్‌ వాకర్, పుష్‌చైర్, ఎయిర్‌ స్వింగ్, షోల్డర్‌ వీల్, లెగ్‌ప్రెస్, పుల్‌చైర్, స్టాండింగ్‌ ట్విస్టర్, డబుల్‌ క్రాస్‌ వాకర్, ఎల్లిప్టికర్‌ ఎక్సర్‌సైజ్‌. లెగ్‌లిప్ట్, సిట్టింగ్‌ ట్విస్టర్‌ ఏర్పాటు చేశారు. 
⇔ ఈ ఓపెన్‌ జిమ్‌పట్ల యువత, చిన్నారులు, ముఖ్యంగా సీనియర్‌ సిటిజన్లు ఆసక్తి కనబరుస్తున్నారు. 
సీనియర్‌ సిటిజన్లు, మహిళలు కూడా క్రమం తప్పకుండా వ్యామామాలు చేస్తున్నారు. 
కరోనా సమయంలో ఏసీ హాల్‌ జిమ్‌ల కన్నా ఓపెన్‌ జిమ్‌ ఎంతో మేలంటున్నారు. 

ఉత్సాహంగా చేస్తున్నాం.. 
ఓపెన్‌జిమ్‌తో ఎంతో ఉత్సాహంగా ఉంది. ఉదయం కాసేపు వ్యాయామాలు చేయడంతో రోజంతా పనిచేసినా హుషారుగా ఉంటున్నా. ప్రైవేట్‌ జిమ్‌లకు వేలకు వేలు చెల్లించాల్సి అవసరం లేదు. జిమ్‌ ఏర్పాటుతో కాలనీవాసులకు, ముఖ్యంగా యువతకు ఎంతో సౌకర్యంగా ఉంది. సీనియర్‌ సిటిజన్లు, మహిళలు సైతం ఆసక్తి కనబరుస్తున్నారు. – కృష్ణతేజ, ప్రైవేట్‌ ఉద్యోగి 

మరిన్ని వార్తలు