కరోనా వచ్చి పోయిందేమో? 

7 Sep, 2020 09:39 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘కరోనా సోకినట్లు చాలామందికి తెలియను కూడా తెలియదు. ఎలాంటి లక్షణాలూ లేకుండా కూడా కరోనా వచ్చిపోవచ్చు’ అంటూ డబ్ల్యూహెచ్‌వో చెబుతోంది. దీనిని బలపరుస్తూ ‘దేశంలో ఇప్పటికే దాదాపు 18కోట్ల మందికి కరోనా సోకింది’.. అని ఓ సర్వే వెల్లడించింది. నగరంలో ‘గత 35 రోజుల్లో 6.60లక్షల మందికి కరోనా బారినపడ్డారు’ అని మరో పరిశోధన తేల్చి చెప్పింది. ఇవే ఇప్పుడు నగరవాసుల్లో యాంటీబాడీస్‌ టెస్ట్స్‌ పట్ల ఆసక్తిని పుట్టించాయి. ‘నాకు తెలీకుండానే కరోనా వచ్చి తగ్గిపోయిందేమో’ తెలుసుకోవాలనే కుతూహలం ఈ పరీక్షలకు సిటీలో డిమాండ్‌ తెచ్చిపెట్టింది.

కరోనా మహమ్మారి కొందరికి ప్రాణాంతకం ఎలా అవుతుందో మరికొందరికి కనీసం చీమ కుట్టినంత నొప్పి కూడా ఇవ్వకుండానే వచ్చిపోతోంది. ఈ నేపథ్యంలోనే తమకు కరోనా సోకిందో లేదో తెలుసుకోవాలనే ఆసక్తి పెరిగి యాంటీ బాడీ టెస్ట్స్‌ ఇప్పుడు క్రేజీగా మారాయి. ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ ఆధ్వర్యంలో ఇమ్యూనిటీ సర్టిఫికెట్‌ ఇచ్చే క్రమంలో ర్యాపిడ్‌ యాంటీ బాడీ టెస్ట్స్‌ ఊపందుకున్నాయి. దీనికి తోడు సర్వేల ద్వారా నగరాలు, పట్టణాల్లో కరోనా వ్యాప్తి అవకాశాలను అంచనా వేయడం జోరుగా సాగుతోంది.  

ప్రైవేట్‌.. స్పీడ్‌ రూట్‌.. 
రాష్ట్రంలో మొత్తం 54 ల్యాబ్స్‌కు కోవిడ్‌ ఆర్‌టీ పీఎస్‌ఆర్‌ టెస్టులకు అనుమతి ఉంది. వీటిలో 17 ప్రభుత్వానికి చెందినవి కాగా, 37 ప్రైవేటు సంస్థలకు చెందినవి. సహజంగానే ప్రైవేటు ల్యాబ్స్‌ ఈ తరహా పరీక్షల విషయంలో ప్రజల్లో ఆసక్తికి అనుగుణంగా మరింత వేగంగా పరీక్షలు నిర్వహిస్తూ ఫలితాలు అందిస్తున్నారు. తొలుత ఢిల్లీ, ముంబై వంటి నగరాల్లో వీటికి బాగా ఆదరణ ఉండగా, ఇప్పుడు హైదరాబాద్‌ సహా దక్షిణాది నగరాల్లో కూడా టెస్టులు బాగా పెరిగాయి. పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ టెస్టుల కోసం రిక్వెస్టులు పెడుతున్నట్టు ఓ ప్రైవేట్‌ ల్యాబ్‌ టెక్నీషియన్‌ చెప్పారు. 

యాంటీ బాడీస్‌ ఉంటే సురక్షితమనేనా? 
వైరస్‌కు సంబంధించి శరీరంలో యాంటీ బాడీస్‌ వృద్ధి చెందడం అనేది ఖచ్చితంగా మేలు చేసే అంశమే అయినా.. అవి ఉన్నట్టు నిర్ధారణ అయినంత మాత్రానే మనం సేఫ్‌ అనేది ఖచ్చితంగా చెప్పలేమంటున్నారు వైద్యులు. ఈ విషయంలో మరిన్ని పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందంటున్నారు. ఏ పరిమాణంలో యాంటీ బాడీస్‌ ఉంటే మనం కోవిడ్‌తో యుద్ధం చేసినట్టనేది ఇంకా తేలాల్సి ఉందంటున్నారు. ఇవి వ్యక్తిగతంగా ఆయా వ్యక్తుల ఇమ్యూన్‌ సిస్టమ్‌ మీద ఆధారపడి ఉంటుందనీ, వ్యక్తికి సంబంధించిన మెడికల్‌ హిస్టరీ, ఇన్ఫెక్షన్‌ పరిమాణం ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటే గానీ చెప్పలేమని నిపుణులు అంటున్నారు. ఈ పరీక్షలతో పాటు రివర్స్‌ ఆర్‌టీ–పీసీఆర్‌ టెస్ట్‌ కూడా తోడైతే మరింత ఖచ్చితత్వం వస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. 

యాంటీ.. అదే ఇమ్యూనిటీ.. 
ఇన్ఫెక్షన్‌తో పోరాడే ప్రోటీన్స్‌నే యాంటీ బాడీస్‌ అంటారు. వైరస్‌కు సమాధానంగా ఇవి ఉత్పన్నమవుతాయి. ఇవే మన శరీరంలో వైరస్‌ని గుర్తించడానికి బయటకు వెల్లడికావడానికి కూడా సహకరిస్తాయి. వీటినే ఇమ్యూనిటీ పరీక్షలని కూడా పేర్కొనవచ్చు. ఇందులోనే ప్రత్యేకంగా యాంటీ బాడీ టైట్లర్‌ టెస్ట్‌ ద్వారా యాంటీడీస్‌ సంఖ్య కూడా లెక్కిస్తారు. అధిక ప్రమాదం కలిగిన హెల్త్‌కేర్‌ వర్కర్స్‌కు, ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌గా వ్యవహరిస్తున్నవారికి వీటిని సూచిస్తున్నారు. కరోనా సోకి కోలుకున్న శరీరంలో యాంటిబాడీస్‌ గుర్తింపు ద్వారానే ప్లాస్మా దానానికి అర్హులుగా పరిగణిస్తున్నారు. అలాగే రీ ఓన్ఫెక్షన్‌కి గురయ్యే అవకాశాలు ఉన్నావారిని కూడా వీటి పరీక్ష ద్వారా గుర్తించవచ్చని వైద్యులు చెబుతున్నారు.  

పోటాపోటీగా.. పరీక్షలు 
ఈ పరీక్షలను కంటైన్మెంట్‌ జోన్స్, సెక్యూరిటీ సిబ్బంది, ట్యాక్సీ డ్రైవర్స్, పరిశ్రమల సిబ్బంది, మీడియా సంస్థల సిబ్బంది, పోలీసులు, హెల్త్‌కేర్‌ వర్కర్స్‌కు అధికంగా చేయాలని ఐసీఎమ్‌ఆర్‌ గైడ్‌లైన్స్‌ సూచిస్తోంది. అయితే ప్రైవేట్‌ల్యాబ్స్‌కు కూడా అనుమతులు లభించడంతో ఇతరులకూ ఊపందుకున్నాయి. వీటి పట్ల సిటిజనుల్లో ఆసక్తికి తగ్గట్టుగా అవి పరీక్షలను ఇంటి ముంగిటకే అందిస్తున్నాయి. డిమాండ్‌కు అనుగుణంగా ఒక్కో పరీక్ష శాంపిల్‌కు రూ.150 నుంచి రూ.300 దాకా ఇస్తూ ల్యాబ్‌ టెక్నీషియన్స్‌గా కొందరు తాత్కాలిక సిబ్బందిని కూడా పరీక్షల కోసం నియమించుకుంటున్నాయి.  

టెస్ట్‌ ప్లీజ్‌ అంటున్న కంపెనీలు..
వ్యక్తిగతంగా కొందరు పరీక్షలు కోరుతుంటే.. కొన్ని కార్పొరేట్‌ కంపెనీలు సైతం తిరిగి ఆఫీస్‌లోకి అడుగుపెట్టే ముందుగా ఈ తరహా పరీక్షలు చేయించుకోవాలని తమ ఉద్యోగులకు సూచిస్తున్నాయి. ‘కొందరు యాంటీ సార్స్‌–కోవ్‌–2 1జి టెస్ట్, మరికొందరు టోటల్‌ యాంటీ బాడీ టెస్ట్‌(1జి జి, 1జిఎమ్‌)లను కోరుతున్నారు.  ఇవి రూ.1200, రూ.900 ధరల్లో అందుబాటులో ఉన్నాయి’ అని ఓ డయాగ్నస్టిక్స్‌కు చెందిన శివాని చెప్పారు. అంతేగాకుండా బ్లడ్‌ శాంపిల్‌ ఏ సమయంలోనైనా ఇచ్చే అవకాశం ఉండటం, ఒక్కరోజులోనే ఫలితం వెల్లడిస్తుండటంతో అనేక మంది ఈ పరీక్షలకు సై అంటున్నారు.   

ఉపయుక్తమే..
మానవ శరీరంలోని కరోనా వైరస్‌ స్థితిగతుల పరిశీలనకు యాంటీ బాడీస్‌ టెస్ట్‌ ఉపకరిస్తుంది. ఇన్ఫెక్షన్‌తో పోరాడేందుకు మన వ్యాధి నిరోధక శక్తి వీటిని ఉత్పత్తి చేస్తుంది. అంతకు ముందు లక్షణాలు కనిపించిన/ కనిపించని కరోనా బాధితుల శరీరంలో సైతం వీటిని కనిపెట్టవచ్చు. 24గంటల్లోనే దీని ఫలితాలు వెల్లడించవచ్చు. ఈ పరీక్ష కోసం ఖాళీ కడుపుతో ఉండడం వంటి జాగ్రత్తలు అవసరం లేదు. ఈ పరీక్షలకు అయ్యే ఖర్చుతో పోలిస్తే ప్రయోజనాలు చాలా ఎక్కువ. నిరుపేదలకు మేం ఉచితంగానే ఈ పరీక్షలు నిర్వహిస్తున్నాం.  
– ఐశ్వర్య వాసుదేవన్, న్యూబర్గ్‌ డయాగ్నస్టిక్‌ సెంటర్‌   

మరిన్ని వార్తలు