మమ అన్నట్టు మాస్కు ధరిస్తే కోవిడ్‌కు స్వాగతం పలికినట్టే!

26 Apr, 2021 12:23 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రోజురోజుకు కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చుతోంది. ఎవరి నుంచి ఎలా వస్తోందోనని భయాందోళన మధ్య జనం బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. కేసులతోపాటు మరణాలు సైతం పెరగడంతో కొందరు కరోనా నిబంధనలు పకడ్బందీగా పాటిస్తున్నారు. అయితే కొందరు మాత్రం మాకేంటి.. మాకేం కాదులే అంటూ యథేచ్ఛగా నిబంధనలను ఉల్లంఘించి ఆరుబయట మాస్క్‌లు లేకుండా తిరిగేస్తున్నారు. అందులో కొందరైతే మాస్క్‌ ఉన్నా ఏదో పెట్టుకున్నాంలే అన్నట్లుగా ముక్కు కిందకు, నోరు నిందకు వేలాడేలా ఉంచుకుంటున్నారు.

మరికొందరైతే పోలీసుల భయానికో.. జరిమానా వేస్తే డబ్బులు పోతాయోనని తప్ప కరోనా గురించి ఏమాత్రం పెట్టుకోవడంలేదు. మొత్తానికి మమ అన్నట్లుగా మాస్క్‌ను సర్దేస్తున్నారు. కరోనా మహమ్మారి పెరగడానికి మొదటి కారణాన్నే ప్రజలు విస్మరిస్తున్నారు. దీంతో కరోనా మరింత ఉధృతంగా కోరలు చాస్తోంది. కరోనా పాజిటివ్‌ వచ్చినా పట్టించుకోకుండా జనాల్లో కలిసి తిరుగుతున్న కొందరు, మాస్కులు సరిగ్గా ధరించని ఇంకొందరి వల్ల అమాయకులైన ప్రజలు బలికావాల్సి వస్తోంది. ఆదివారం రాంనగర్‌ చేపల మార్కెట్‌లో వందల సంఖ్యలో ప్రజలు ఒకేరీతిన వచ్చేశారు. అందులో చాలామంది మాస్కే ధరించలేదు.

మరికొందరు మాస్క్‌ ధరించినా అది కిందకు వేలాడుతూ.. పైకి వెక్కిరిస్తున్నాట్లు పెట్టుకున్నారు. ముక్కు, మూతి పూర్తిగా కవర్‌ అయ్యేలా మాస్కులను ధరించకపోవడం వల్ల వారు కూడా ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుందన్న విషయాన్ని పట్టించుకోవడం లేదు. మరోవైపు బయటకు వెళ్లినప్పుడు మాస్క్‌ను ఎక్కువ మంది మరిచిపోతుండటం కూడా కరోనా వ్యాప్తికి కారణం అవుతోంది. 

భౌతిక దూరమూ అంతంతే... 
కరోనా మహమ్మారి కట్టడికి భౌతిక దూరం పాటించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పదేపదే చెబుతున్నా పట్టించుకోవడంలేదు. మాస్క్, భౌతిక దూరమే కరోనా కట్టడికి ఉపయోగపడతాయని తెలిసినా అనేక మంది దాన్ని పట్టించుకోకపోవడంతో పాజిటివ్‌ కేసులు పెరిగిపోతున్నాయి. ఒక వ్యక్తికి, మరొకరికి మధ్య కనీసం ఆరడుగుల దూరం పాటించాలన్న నిబంధనను చెవికెక్కించుకోవడంలేదు. కూరగాయల మార్కెట్లు, చేపల మార్కెట్లు, కిరాణా దుకాణాల వద్ద భౌతిక దూరం పాటించాలన్న విషయాన్ని పట్టించుకోవడం లేదు.  

మాస్క్‌పై ప్రజల మనోగతం ఇలా..! 

  • మన వాళ్లే కదా మాస్క్‌ ఎందుకని వదిలేయడం 
  • రోజూ వాళ్లతోనే ఉంటున్నాం కదా.. అంటూ కరచాలనం చేయడం 
  • గుంపులుగా పది మంది ఉన్నప్పుడు కొద్దిసేపు మాస్క్‌పెట్టుకొని తర్వాత తీసేయడం 
  • అంతా మన బంధువులే కదా మాస్క్‌ పెట్టుకుంటే ఏమనుకుంటారోనని వదిలేయడం 
  • ఫంక్షన్లకు అందరూ బంధువులు ఒకే దగ్గర ఉండడం, అందులో మాస్క్‌లు పెట్టుకుంటే బాగుండదని అనుకోవడం  
  • స్నేహితుడే కదా రోజు తిరుగుతున్నాం కదా.. మాస్క్‌ పెట్టుకోకుంటే ఏమి కాదులే అని అనుకోవడం.

చదవండి: కరోనా: ఏది నిజం.. ఏది అబద్ధం.. కేంద్రం వివరణ

మరిన్ని వార్తలు