శానిటైజర్‌ కొంటలేరు... 

13 Sep, 2020 04:31 IST|Sakshi

వాడకం తగ్గించిన జనం 

జూన్‌లో విపరీతంగా కొరత 

జూలై నెలలో తగ్గిన ధరలు 

ఆగస్టు చివరకు 30 శాతానికి పడిపోయిన అమ్మకాలు 

షాపుల్లో పేరుకుపోతున్న నిల్వలు

సాక్షి, హైదరాబాద్‌: శానిటైజర్‌.. కరోనా మహమ్మారి విజృంభించేంతవరకు ఆసుపత్రుల్లో తప్ప పెద్దగా వాడకం లేని పేరు. కానీ, ఇటీవల అది ఏకంగా నిత్యావసరంగా మారిపోయింది. రేషన్‌ కోసం క్యూ కట్టిన తరహాలో శానిటైజర్‌ కోసం జనం దుకాణాలకు ఎగబడ్డారు. ఇళ్లు, కార్యాలయాలు, పనిచేసే చోట, కార్లు.. ఇలా అన్ని చోట్లా శానిటైజర్‌ సీసాలను అందుబాటులో ఉంచుకున్నారు. చివరకు చిన్న సీసాలను జేబుల్లో పెట్టుకుని తిరిగారు. అయితే అంతలా వినియోగించిన జనం ఒక్కసారిగా దాని వైపు చూడ్డం మానేశారు. ఆగస్టు చివరివారం నుంచి శానిటైజర్‌ అమ్మకాలు బాగా పడిపోవటం మొదలైంది. ప్రస్తుతం అమ్మకాలు 30 శాతానికి పరిమితమయ్యాయి. జూన్, జూలైలలో విపరీతంగా కొరత ఉన్న పరిస్థితి నుంచి ఇప్పుడు, కొనేవారులేక, నిల్వలు పేరుకుపోయి దుకాణదారులు శానిటైజర్‌ను డిస్ట్రిబ్యూటర్లకు వెనక్కు పంపే పరిస్థితి ఏర్పడింది.  

అసలు పని పక్కన పెట్టి .. 
కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా తీవ్ర సంక్షోభాన్ని సృష్టించింది. దీంతో చిన్నచిన్న తయారీ సంస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. తయారీ రంగం పడకేయటంతో సిబ్బంది చెల్లాచెదురయ్యారు. దీంతో చాలా సంస్థలు కరోనానే తిరిగి అవకాశంగా చేసుకున్నాయి. శానిటైజర్‌ వాడకం విపరీతంగా పెరుగుతుండటాన్ని ఆసరా చేసుకుని అసలు ఉత్పత్తులను పక్కన పెట్టి శానిటైజర్‌ డిస్ట్రిబ్యూ టర్లుగా మారాయి. పెద్ద ఎత్తున శానిటైజర్‌ తయారీ సంస్థలు కొత్తగా ఏర్పడ్డాయి. కరోనా వచ్చే వరకు హైదరాబాద్‌లో రెండుమూడు తప్ప శానిటైజర్‌కు చెప్పుకోదగ్గ డిస్ట్రిబ్యూటర్‌ సంస్థలు లేవు. వ్యక్తిగతం మొదలు చిన్న సంస్థల వరకు వెరసి రాష్ట్రవ్యాప్తంగా పదివేల మంది డిస్ట్రిబ్యూటర్‌ అవతారమెత్తారు. కాగా కొన్ని సంస్థలు శానిటైజర్‌ అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని తమ వద్ద పనిచేసే సిబ్బంది జీతాలకు వినియోగించుకున్నాయి.  

పడిపోయిన ధరలు.. 
జూన్‌ నెలలో ఐదు లీటర్ల క్యాన్‌ను రూ.2 వేల కు ఈ సంస్థలు దుకాణాలకు సరఫరా చేసేవి. అలా నిత్యం సగటున 8 నుంచి 10 వరకు అలాంటి క్యాన్లు, 100 మిల్లీలీటర్ల చిన్న సీసాలు 300 వరకు, 200 మి.లీ. సీసాలు 100 నుంచి 200 చొప్పున సరఫరా చేసేవి. జూలై వచ్చేసరికి కేంద్ర ప్రభుత్వం వాటి ధరలను నియంత్రించటంతో 5 లీటర్ల క్యాన్‌ ధర వెయ్యి రూపాయలకు పడిపోయింది. ఆగస్టు చివరికొచ్చేసరికి క్రమంగా విక్రయాలు తగ్గిపోవటంతో అదే క్యాన్‌ను కేవలం రూ.400 అమ్మడం ప్రారంభించారు. ఇప్పుడు చాలా మెడికల్‌ షాపుల్లో అలాంటి క్యాన్లు పెద్ద ఎత్తున పేరుకుపోయాయి. దాంతో వాటిని వాపస్‌ చేయాల్సిన పరిస్థితి వచ్చింది.

భయం వీడడమే కారణం..!
కరోనా సోకటం మొదలైన కొత్తలో జనంలో విపరీతమైన భయం పెరిగిపోయింది. మాస్కుతోపాటు శానిటైజర్‌ వాడకం కూడా అనివార్యమైంది. కానీ ప్రస్తుతం నిత్యం వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నా.. జనంలో మాత్రం భయం బాగా తగ్గిపోయింది. కరోనా వచ్చినా సాధారణ జ్వరం తరహాలో తగ్గిపోతుందన్న అభిప్రాయానికి ఎక్కువ మంది వచ్చారు. ప్రస్తుతం తెలంగాణలో కరోనా రికవరీ రేటు 77 శాతానికి చేరుకుంది. మరణాల రేటు బాగా తక్కువగా ఉండటంతో జనంలో కరోనా భయం బాగా తగ్గిపోయింది. ఫలితంగా శానిటైజర్‌ వాడకం కూడా పడిపోయింది. దీంతో కొనేవారు లేక దుకాణాల్లో సరుకు పేరుకుపోతోంది.

మరిన్ని వార్తలు