గులాబీకి గుడ్‌బై.. హస్తం గూటికి చేరే దిశగా అడుగులు!

3 Jul, 2022 07:25 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గ్రూపు రాజకీయాలతో విసిగిపోయిన గులాబీ నేతలు ఆ పార్టీకి షాక్‌ ఇవ్వడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. హస్తం గూటికి చేరే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ఆ పార్టీ అధిష్టానంతో చర్చలు జరిపిన నేతలు.. కారు దిగడానికి దాదాపుగా ముహూర్తం ఖరారు చేసుకున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల అనంతరం మారిన సమీకరణలతో కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి.. టీఆర్‌ఎస్‌ కండువా కప్పుకొన్న నేతలు తాజాగా సొంతగూటికి వెళ్లడానికి పావులు కదుపుతున్నారు. మున్సిపల్‌ ఎన్నికల ఫలితాల అనంతరం గులాబీదళంలో చేరిన కార్పొరేటర్లు కూడా ఇప్పుడు పక్క చూపులు చూస్తున్నారు.

తాజాగా బడంగ్‌పేట నగర పాలక సంస్థ మేయర్‌ చిగురింత పారిజాత నర్సింహారెడ్డి దంపతులు టీఆర్‌ఎస్‌కు ఝలక్‌ ఇవ్వనున్నట్లు ఇప్పటికే సంకేతాలిచ్చారు. ఈ మేరకు పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డిని కలిసి సంప్రదింపులు కూడా జరిపారు. ఆరుగురు కార్పొరేటర్లతో కలిసి ఒకట్రెండు రోజుల్లో హస్తం గూటికి చేరేందుకు రెడీగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరేకాకుండా.. గతంలో మహేశ్వరం నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన మరో నేత కూడా గులాబీకి గుడ్‌బై చెప్పనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.

వీరంతా హస్తినలో రాహుల్‌గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం. కాంగ్రెస్‌ నుంచి గెలిచిన అనంతరం టీఆర్‌ఎస్‌లో చేరి మంత్రి పదవి చేజిక్కించుకున్న సబితా ఇంద్రారెడ్డితో పొసగని నేతలు పక్క చూపులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడిపోతుండటం అధికార పార్టీని ఇరకాటంలో పడేస్తోంది. 
 
ఎల్‌బీనగర్‌లోనూ... 
ఎల్‌బీ నగర్‌ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన కీలక నేత కూడా సొంతగూటి వైపు చూస్తున్నట్లు రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి గెలుపొంది, ఆ తర్వాత అధికార పార్టీలో చేరారు. దీంతో అప్పటి నుంచి ఆయన అధికార టీఆర్‌ఎస్‌ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. తాజా రాజకీయ సమీకరణల నేపథ్యంలో ఆయన పార్టీ మారడం ఖాయంగా కనిపిస్తోంది. హస్తం గూటికొ ప్పుడు చేరనున్నారనే అంశంపై ఆయన స్పష్టత ఇవ్వడం లేదు.

టీకేఆర్‌ను బుజ్జగించిన కేటీఆర్‌ 
గత ఎన్నికల్లో మహేశ్వరం నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్‌  తరఫున పోటీ చేసి ఓటమి పాలైన తీగల కృష్ణారెడ్డి రెడ్డి సైతం కారు దిగేందుకు దాదాపు సిద్ధమయ్యారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కూడా ఇటీవల ఆయన నివాసానికి చేరుకుని పార్టీలోకి ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఇటీవల ఆయన తన పుట్టిన  రోజు సందర్భంగా సన్నిహితులు, వర్గీయులతో ప్రత్యేకంగా సమావేశమై ఇదే అంశంపై చర్చించారు.

ఆయన కోడలు తీగల అనితా హరినాథ్‌రెడ్డి ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌గా కొనసాగుతున్నారు. ఇదే సమయంలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ తీగల కృష్ణారెడ్డిని వ్యక్తిగతంగా కలిసి మాట్లాడారు. రాజకీయ వారసత్వ విషయంలో ఆయనకు హామీ ఇచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. దీంతో ఆయన పార్టీని వీడే యోచన నుంచి వెనక్కి తగ్గినట్లు సమాచారం. 

మేయర్‌ సహా ఇద్దరు కార్పొరేటర్లపై వేటు 
బడంగ్‌పేట్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ చిగురింత పారిజాత నర్సింహారెడ్డి దంపతులు సహా 23వ డివిజన్‌ కార్పొరేటర్‌ రాళ్లగూడెం శ్రీనివాసరెడ్డి, 20వ డివిజన్‌ కార్పొరేటర్‌ పెద్దబావి సుదర్శన్‌రెడ్డిలను టీఆర్‌ఎస్‌ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి శనివారం రాత్రి  ప్రకటించారు. పార్టీ ఆదేశాలను ధిక్కరించి, పార్టీకి నష్టం చేకూర్చేలా వ్యవహరించినందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు ఆయన ప్రకటించారు.

(చదవండి: ‘మేం బ్యాంకుల్ని మాత్రమే.. మీరు దేశాన్నే దోచుకుంటున్నారు’)

మరిన్ని వార్తలు