Corona Virus: ఊహకందని విషయమిది.. 7 నెలల కన్నా ఎక్కువ కాలం మనిషి శరీరంలో వైరస్‌?

30 Jan, 2022 04:54 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచాన్ని రెండేళ్లుగా అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారి గురించి కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. ఇప్పటివరకు మనం ఊహిస్తున్న, అంచనా వేస్తున్న దానికన్నా మరింత ఎక్కువ కాలం మనుషుల శరీరంలో వైరస్‌ యాక్టివ్‌గా ఉంటుందని తాజాగా ఓ పరిశోధనలో తేలింది. పాజిటివ్‌గా తేలిన 14 రోజుల తర్వాత కూడా చాలా మంది యాక్టివ్‌ వైరస్‌ను వెదజల్లే అవకాశముందని, కొందరిలో 7 నెలలకు పైగానే యాక్టివ్‌గా ఉండొచ్చని వెల్లడైంది. ఈ పరిశోధనకు సంబంధించిన వివరాలు ప్రాంటియర్స్‌ ఇన్‌ మెడిసిన్స్‌ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ఫ్రాన్స్‌కు చెందిన పాస్చర్‌ ఇన్‌స్టిట్యూట్, ది యూనివర్సిటీ ఆఫ్‌ సావ్‌పౌలో (యూఎస్‌పీ), బ్రెజిల్‌లోని ఆస్వాల్డో క్రజ్‌ ఫౌండేషన్, ఇతర అంతర్జాతయ శాస్త్రవేత్తల బృందం కలిసి ఈ పరిశోధన చేశాయి.  

ఒక్కొక్కరిలో ఒక్కోలా..! 
బ్రెజిల్‌లోని కొందరు కరోనా పేషెంట్లకు పరిశోధకులు వరుస పరీక్షలు చేశారు. నెగెటివ్‌ వచ్చే దాకా రెండు, మూడుసార్లు ఆర్‌టీపీసీఆర్‌ టెస్టులు నిర్వహించారు. వీరిలో ఇద్దరు పురుషులు, ఓ మహిళలో 70 రోజులకు మించి వైరస్‌ను గుర్తించినట్టు వెల్లడించారు. దీన్ని బట్టి వైరస్‌ సోకిన వారిలో 8 శాతం మంది 2 నెలల కంటే ఎక్కువ కాలం పాటు ఇతరులకు కరోనాను వ్యాప్తి చేసే అవకాశాలున్నాయని వాళ్లు చెబుతున్నారు. ఇన్ఫెక్షన్‌ సోకిన తర్వాత చివరి దశలో ఎలాంటి లక్షణాలు కనిపించకపోవచ్చని అంటున్నారు.

38 ఏళ్ల ఓ వ్యక్తిలో 20 రోజులు స్వల్ప లక్షణాలే కనిపించినా అతని శరీర వ్యవస్థల్లో 232 రోజుల పాటు వైరస్‌ కొనసాగినట్టు, మ్యుటెషన్లు జరిగినట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. కరోనాకు ఆ వ్యక్తి క్రమం తప్పకుండా చికిత్స తీసుకోకుండా, మాస్క్‌ ధరించకుండా, వ్యక్తుల మధ్య దూరం పాటించకుండా ఉండి ఉంటే ఆ 7 నెలల్లో ఎంతో మందికి వైరస్‌ వ్యాప్తి చెందించి ఉండేవాడని చెప్పారు.  

14 రోజుల తర్వాత కూడా.. 
కరోనా వచ్చాక 14 రోజుల తర్వాత కూడా ప్రజలు ‘యాక్టివ్‌ వైరస్‌’ను కలిగి ఉండి ఇతరులకు వ్యాప్తి చెందించే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఈ పరిశోధనలో ముఖ్యపాత్ర పోషించిన పౌలా మినోప్రియో వెల్లడించారు. అందువల్ల కరోనా సోకిన వారు ఎక్కడెక్కడ ఉన్నారు, వారి ఆరోగ్య పరిస్థితి ఏంటో ఎప్పటికప్పుడు తెలుసుకోవడం ద్వారా మరిన్ని మ్యుటేషన్లు, కొత్త వేరియెంట్లు వచ్చే అవకాశాలపై కన్నేసి ఉంచొచ్చని అంటున్నారు. పేషెంట్‌కు నెగెటివ్‌ రావడానికి నెల రోజులు పడుతుందని, కొన్ని కేసుల్లో 71 రోజుల నుంచి 232 రోజుల వరకు ఉండొచ్చని అధ్యయనం చెబుతోందన్నారు. ఐతే ఇలా వ్యాప్తి జరిగి అందరిలో యాంటీబాడీస్‌ ఏర్పడే అవకాశముందని కొందరు అంటున్నారు.    

మరిన్ని వార్తలు