Hyderabad: ఎండల్లో వానలు.. ఏందిరా ఈ బాధలు.. మరో 2 రోజులు ఇంతేనా!

20 Mar, 2023 08:55 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మార్చి నెలలో అకాల వర్షాలు నగరాన్ని వణికిస్తున్నాయి. వేసవిలో ఊహించని విధంగా భారీ వర్షాలు విరుచుకుపడుతున్నాయి. ఈదురు గాలులతో చెట్ల కొమ్మలు విరిగిపడటంతో విద్యుత్‌ తీగలు తెగిపోతున్నాయి. రోడ్లు జలమయమై ట్రాఫిక్‌ స్తంభించి వాహనదారులు తీవ్ర ఇక్కట్లకు గురవున్నారు. శివారు ప్రాంతాల్లో వడగళ్లు పడటంతో పండ్లు, కూరగాయలు, పూల తోటల అపార నష్టం వాటిల్లుతోంది.

అల్పపీడంతో ఏర్పడిన ద్రోణి ఆదివారం దక్షిణ అంతర్గత కర్ణాటక నుంచి పశ్చిమ విదర్భ వరకు.. ఉత్తర అంతర్గత కర్ణాటక మరఠ్వాడా మీదుగా సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తున కొనసాగుతుండటంతో ఆకాశంలో దట్టమైన మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇప్పటికే వరుసగా రెండు రోజులు నుంచి వర్షాలు కురుస్తుండగా మరో రెండు రోజులు అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.

ద్రోణుల ప్రభావంతో వేసవిలో సైతం వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుత మార్చి నెలలో సాధారణ వర్షపాతం కంటే పదింతలు అధికంగా నమోదు కావడం గమనార్హం.

మరిన్ని వార్తలు