కరోనా పాజిటివ్‌ వచ్చినా బయట తిరిగేస్తున్నారు

24 Apr, 2021 08:24 IST|Sakshi

కరోనా లక్షణాలు ఉన్నా.. జనంలో సంచారం 

పాజిటివ్‌ బాధితులు బయట తిరగడం వల్లే..

వైరస్‌ విస్తృతంగా వ్యాప్తి

నిబంధనలు పాటించాలని అధికారుల సూచన.. పట్టించుకోని జనం 

మహబూబ్‌నగర్‌ క్రైం: కరోనా రెండోదశ రోజురోజుకూ తీవ్రమవుతోంది. పట్టణం, గ్రామం అనే తేడా లేకుండా జిల్లావ్యాప్తంగా ప్రతి రోజూ వందల సంఖ్యలో కేసులు నమోదు కావడం దీనికి నిదర్శనం. ప్రజల్లో, ప్రధానంగా యువతలో ఉన్న నిర్లిప్తతతో పాటు కొందరు పాజిటివ్‌ లక్షణాలతో బాధపడుతున్నా తమకేమీ పట్టనట్లుగా బయట తిరుగుతున్నారు. పట్టించుకునేవారు లేకపోవడంతోనే ఇలా జరుగుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి. గతేడాది కరోనా పాజిటివ్‌ వచ్చిన వారిని ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో సిబ్బంది పర్యవేక్షించేవారు. ఆరోగ్య పరిస్థితి తీవ్రమైతే ఐసోలేషన్‌ కేంద్రంలో, లేకపోతే హోం క్వారంటైన్‌లో ఉండాలని అధికారులు ప్రకటించారు.

దీని ప్రకారం.. వైరస్‌ బారిన పడినవారు విధిగా 14 రోజుల పాటు తగిన జాగ్రత్తలతో ఏకాంతంగా ఉంటే వైరస్‌ను అదుపు చేయగలుగుతాం. పాజిటివ్‌ వచ్చిన వ్యక్తుల ఆరోగ్య పరిస్థితిని ప్రతిరోజూ హైదరాబాద్‌ కేంద్రంగా ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూం నుంచి ఫోన్‌ చేసి తెలుసుకునేవారు. ఇప్పుడా పరిస్థితి కనిపించడం లేదు. క్షేత్రస్థాయిలో పర్యవేక్షించడం లేదు. పెద్దసంఖ్యలో బాధితులుండటంతో అధికారులు సైతం వివరాలు వెల్లడించే పరిస్థితి లేకుండాపోతుంది. దీంతో కొందరు వ్యక్తులు తమ అవసరాల కోసం స్వేచ్ఛగా బయటకు వచ్చేస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో, రద్దీ ప్రదేశాల్లో ఎప్పటిలాగే తిరుగుతున్నారు. ఫలితంగా ఇతరులు వైరస్‌ బారిన పడేందుకు అవకాశాలను కల్పించినట్లవుతోంది. దీనికి తోడు ప్రజల్లోనూ ఉన్న కాసింత నిర్లక్ష్యం బాధితుల సంఖ్యను గణనీయంగా పెంచేస్తోంది. ఈ కారణంగానే గత పక్షం రోజులుగా నిత్యం వందల సంఖ్యల్లో కేసులు నమోదవుతున్నాయి. 

సమాచారం ఇవ్వడం లేదు 
గతంలో కాలనీలు, గ్రామాల వారీగా పేర్లతో వైద్య సిబ్బంది కరోనా రోగుల సమాచారం పంపించేవారు. ఆ పరిసర ప్రాంతాల్లో అధికారికంగా రసాయన ద్రావణాన్ని పిచికారీ చేసేవారు. పాజిటివ్‌ కేసులు ఎక్కువగా ఉన్నాయని తెలిస్తే కంటైన్‌మెంట్‌ జోన్లు, ఐసోలేషన్‌ కేంద్రాలు తదితర వాటిని ఏర్పాటు చేసి వైరస్‌ వ్యాప్తి చెందకుండా జాగ్రత్త పడేవారు. బాధితులు బయటకు రాకుండా వారికి అవసరమైన సహాయ సహకారాలను అందించేందుకు ఆయా వార్డు కౌన్సిలర్లు, సర్పంచులు ఇతర వ్యక్తులు స్వచ్ఛందంగా ముందుకొచ్చేవారు. అయితే ప్రస్తుతం ఎలాంటి వివరాలు వెల్లడి కాకపోవడంతో ఇటువంటివేవి జరగడం లేదు. చాలాచోట్ల బాధితులు బయట తిరుగుతున్నారు. 

3,025 మందికి టీకాలు 
జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ కేంద్రాల్లో ఇస్తున్న కరోనా టీకాలకు విశేష స్పందన లభిస్తోంది. నిత్యం వేల మంది వ్యాక్సినేషన్‌ చేసుకోవడానికి వస్తున్నారు. జిల్లాలో శుక్రవారం 3,025మందికి టీకాలు ఇచ్చారు. మొదటి డోస్‌ కింద హెల్త్‌కేర్‌ వర్కర్స్‌ 11, ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌ 61మందికి, 60ఏళ్లుపైబడిన వారిలో 809మందికి, 45–59ఏళ్ల దీర్ఘకాలిక రోగులతో పాటు 45ఏళ్లుపైబడిన వారిలో 1804మందికి టీకాలు ఇచ్చారు.  ఇక సెకెండ్‌ డోస్‌లో ఈ నాలుగు విభాగాలకు కలిపి 340మందికి టీకాలు ఇచ్చారు.

మరిన్ని వార్తలు