దిమాఖ్‌ ఖరాబ్‌

1 Aug, 2020 03:24 IST|Sakshi

జీవనశైలిపై కరోనా ఎఫెక్ట్‌

దేశవ్యాప్తంగా ప్రజల్లో పెరిగిన మానసిక ఒత్తిళ్లు

డిప్రెషన్‌తో బాధపడేవారు 43%

59% మందికి పనులపై తగ్గిన ఆసక్తి

‘జీవోక్యూఐఐ’ తాజా అధ్యయనంలో వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: దేశ పౌరుల జీవనశైలి, అలవాట్లు, ఆహార పద్ధతులపై కరోనా మహమ్మారి తీవ్ర ప్రభావం చూపుతోంది. దీంతో భారతీయులు గతంలో ఎన్నడూ లేనివి ధంగా ఒత్తిళ్లు, కుంగుబాటు వంటి వాటిని ఎదుర్కొంటున్నారు. ఉద్యోగాలు ఉంటాయా లేదా అన్న ఆందోళనలు, లే ఆఫ్‌లు, ఆరోగ్యంతో ముడిపడిన భయాలు ప్రజలను వెంటాడుతున్నాయి. ఫలితంగా చాలా మందిలో మానసిక సమస్యలు బయటపడుతున్నాయని నిపుణులు చెబుతున్నారు

 కరోనా వైరస్‌ వ్యాప్తితో తలెత్తిన కొత్త, అనూహ్య పరిస్థితులను ఏ మేరకు అర్థం చేసుకున్నారు? వాటికి ఏ మేరకు అలవాటు పడ్డారు? అనే అంశంపై ‘జీవోక్యూఐఐ’–స్మార్ట్‌టెక్‌ ఆధారిత హెల్త్‌కేర్‌ ప్లాట్‌ఫాం సంస్థ దేశవ్యాప్తంగా 10 వేల మందినిపైగా సర్వే చేసినప్పుడు అనేక కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. అధ్యయనంలో పాల్గొన్న వారిలో 43 శాతం మంది మానసిక కుంగుబాట్లతో బాధపడుతున్నట్లు, 59 శాతం మందిలో పనులపట్ల ఆసక్తి తగ్గిపోయినట్లు, 57 శాతం మంది అలసిపోయినట్లు పేర్కొన్నారని సర్వే సంస్థ వివరించింది.

ఐదు నెలల్లో ఎంతో తేడా...
దేశంలో మొదటి వైరస్‌ కేసు నమోదయ్యాక గత ఐదు నెలల్లో పెద్ద సంఖ్యలోనే ప్రజల మానసిక స్థితి ఒడిదొడుకులకు గురైనట్లు జీవోక్యూఐఐ సంస్థ అధ్యయనంలో వెల్లడైంది. మారిన పరిస్థితుల్లో జీవనశైలి, వ్యాయామం, పనులు, పోషకాహారం, నిద్ర, ఒత్తిళ్లు, కుంగుబాటు, కొనుగోలు అలవాట్లలో మార్పు, మానసిక ఒత్తిళ్లు పెరిగి బయటి తిండి ఎక్కువ తినడం వంటివి తీవ్రంగా ప్రభావితమైనట్లు తేలింది. రోజువారీ కార్యకలాపాలు, తిండిపై ఆసక్తి, తినగలిగే స్థాయి, నిద్రపోతున్న తీరు, ఏ విషయంపైనైనా మనసు లగ్నం చేయగలిగే లక్షణం, ఏదైనా పని చేసేందుకు శక్తియుక్తుల స్థాయి వంటి అం«శాలపై ఈ సంస్థ సమాచారాన్ని సేకరించింది.

సర్వేలోని కీలకాంశాలు...
► వివిధ స్థాయిల్లో కుంగుబాటు, మానసిక ఒత్తిళ్లకు గురైన వారు 43 శాతం మంది
► చేసే పనుల్లో ఎలాంటి ఉత్సాహం ఉండట్లేదన్న వారు 59 శాతం మంది
► అలసట, శక్తి తగ్గిపోయినట్లు భావిస్తున్న వారు 57 శాతం మంది
► నిరాశ, నిస్పృహలతో ఉన్నవారు 44 శాతం మంది
► నిద్రపోవడంలో ఇబ్బందులు లేదా అతినిద్ర సమస్య ఎదుర్కొంటున్న వారు 49 శాతం మంది 

పెరుగుతున్న అనిశ్చితితో ఒత్తిళ్లు
కరోనా వైరస్‌ వ్యాప్తి, సుదీర్ఘ లాక్‌డౌన్‌ విధింపు ప్రభావం ప్రజల్లో ఒత్తిళ్లు పెరిగేందుకు కారణమైంది. దీనివల్ల మానసిక సమస్యలు పెరుగుతున్నాయి. అంతటా అనిశ్చిత పరిస్థితులు నెలకొనడంతో ఒత్తిళ్ల స్థాయి పెరుగుతోంది. జీవనశైలిని మార్చుకోవడంతోపాటు సమతుల ఆహారం, సరైన నిద్ర అలవాట్లను పాటిస్తే ఈ సమస్యను అధిగమించొచ్చు. మానసిక ఆరోగ్యం సక్రమంగా లేకపోతే దాని ప్రభావం వ్యక్తి పూర్తి ఆరోగ్యంపై పడుతుంది. అందువల్ల జీవనశైలిని మార్చుకొని ఆరోగ్యకరమైన అలవాట్లు పాటించడం ద్వారా ఈ సమస్యలన్నింటినీ అధిగమించొచ్చు. – జీవోక్యూఐఐ ఫౌండర్, సీఈవో విశాల్‌ గోండల్‌

>
మరిన్ని వార్తలు