‘కరోనా’ అప్పు..తీర్చడానికి జీవితకాలం

3 Jun, 2021 03:11 IST|Sakshi

నాడు కూతుళ్ల పెళ్లిళ్లకోసం తండ్రి అప్పు 

తీర్చేందుకు జీవితకాలం పట్టిన వైనం 

ఇప్పుడు కన్నవారి చికిత్స కోసం కొడుకు.. 

ఒక వైపు పేదరికం, మరో వైపు అంగ వైకల్యంతో దిక్కుతోచని స్థితి 

ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకోలు.. 

‘మిగిలింది’ 10 లక్షల అప్పే
రేకుల షెడ్డులాంటి ఈ ఇల్లు కాషాగౌడ్‌ది. ఆయన ఇద్దరు బిడ్డల పెళ్లిళ్ల కోసం రూ.10 లక్షల అప్పుచేశాడు. అది కాస్తా తీరి కుదుటపడుతున్న వేళ కరోనా ఆయనతో సహా భార్యను పొట్టనపెట్టుకుంది. వీరిని కాపాడుకునేందుకు కుమారుడు మురళీగౌడ్‌ రూ.10 లక్షలు వెచ్చించాడు. అమ్మానాన్న దక్కలేదు కానీ.. అప్పు మిగిలింది. అసలే రోడ్డు ప్రమాదంలో గాయపడి కాలు కూడదీసుకోలేని పరిస్థితి.. పై చిత్రంలో కనిపిస్తున్న ఇల్లమ్మితే తప్ప అప్పుతీరని దుస్థితి.. అదే జరిగితే భార్యాపిల్లలతో రోడ్డున పడతానంటున్న మురళి..చికిత్సకు లక్షలుపోసి అప్పుల ఊబిలో కూరుకుపోతున్న బాధితులపై వరుస కథనాలు నేటి నుంచి.. 

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): పేదరికం వారిపాలిట శాపమైంది. అప్పు వారి జీవన ప్రయాణంలో భాగమైంది. కులవృత్తిపై ఆధారపడి బతుకు సాగించే ఆ కుటుంబం ఇప్పుడు ఛిన్నాభిన్నమైంది. ఎదిగొచ్చిన ముగ్గురు కూతుళ్లను మంచి అయ్యల చేతిలో పెట్టాలని ఆ తండ్రి చేసిన పది లక్షల అప్పు తీర్చేందుకు జీవిత కాలం పట్టింది. ఇక తన బాధలు తీరాయని.. గుండెలపై చెయ్యేసుకుని హాయిగా నిద్రపోతున్న సమయంలో కరోనా రాకాసి ఆ కుటుంబాన్ని కాటేసింది. సెకండ్‌ వేవ్‌లో దంపతులిద్దరికీ పాజిటివ్‌ రాగా.. చికిత్స కోసం మళ్లీ రూ.10 లక్షల వరకు అప్పులయ్యాయి. అయినా ఆ ఇద్దరి ప్రాణాలు దక్కలేదు. ఇప్పుడు ఆ రూ.10 లక్షల అప్పు తీర్చేందుకు వారి కొడుకుకు దారి కనిపించడం లేదు. ఉన్న ఇల్లు అమ్మితే గానీ అప్పులు తీరేలా లేవు. కానీ.. ఆ ఇల్లు కూడా అమ్ముకుంటే గూడు లేకుండా భార్యా పిల్లలను పోషించేదెలా అని ఆ కొడుకు మధనపడుతున్నాడు. 

జీవితాంతం అప్పు.. 
రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లికి చెందిన ఆకుల లక్ష్మి (65), కాషాగౌడ్‌ (68) భార్యాభర్తలు. వీరికి ముగ్గురు కూతుళ్లు, కొడుకు మురళీగౌడ్‌ ఉన్నారు. గీతవృత్తిని నమ్ముకుని కాషాగౌడ్‌ అంతంత మాత్రంగా వచ్చే ఆదాయంతో బతుకు బండిని లాగాడు. భార్య బీడీలు చుట్టేది. ముగ్గురు కూతుళ్ల పెళ్లిళ్లు చేసేందుకు రూ.10 లక్షల అప్పు చేశాడు. కొడుకుకు కూడా వివాహం చేశాడు. 45 ఏళ్లుగా కల్లు అమ్ముతూ.. పైసాపైసా కూడబెట్టి అప్పు తీర్చాడు. అప్పులు తీరాయని, ఇక భార్య, కొడుకుతో మలిదశలో మనశ్శాంతితో జీవించవచ్చని అనుకుంటున్న తరుణంలో గతనెలలో లక్ష్మీ, కాషాగౌడ్‌ దంపతులకు కరోనా సోకింది. 

తల్లికి రూ. 7 లక్షలు.. తండ్రికి రూ.3 లక్షలు 
కొద్దిరోజులు ఈ దంపతులు హోం ఐసోలేషన్‌లోనే ఉన్నారు. లక్ష్మి పరిస్థితి విషమంగా మారడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స కోసం కొడుకు మురళీగౌడ్‌ తెలిసివారి వద్ద రూ. 7లక్షల అప్పు తీసుకొచ్చాడు. కాషాగౌడ్‌ పరిస్థితి కూడా అదుపుతప్పడంతో సిరిసిల్లలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. తండ్రి ప్రాణాలు దక్కించుకునేందుకు మురళి మరో రూ. 3 లక్షల అప్పు చేశాడు. అయితే లక్షలు ఖర్చు చేసినా తల్లి లక్ష్మి ప్రాణం దక్కలేదు. పరిస్థితి విషమించి గత నెల 22న చనిపోయింది. 

కడసారి చూడకుండానే.. 
తల్లి మరణించిన విషయం తండ్రి కాషాగౌడ్‌కు చెప్పకుండానే కొడుకు మురళి అంత్యక్రియలు పూర్తిచేశాడు. 
తండ్రిని సిరిసిల్ల నుంచి ఎల్లారెడ్డిపేటలోని మరో ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించాడు. అనంతరం తల్లి మరణించిన విషయాన్ని తండ్రికి నెమ్మదిగా చెప్పిన మురళి.. ఆక్సిజన్‌ సిలిండర్‌ సాయంతో గతనెల 31న తల్లి దశదిన కర్మ కోసం కాషాగౌడ్‌ను ఇంటికి తీసుకొచ్చాడు. కార్యక్రమంలో భాగంగా తలనీలాలు సమర్పించి.. అందరితో మాట్లాడిన కాషాగౌడ్‌ సాయంత్రానికి ఊపిరి తీసుకోవడం కష్టంగా మారడంతో మరణించాడు. 

వెంటాడిన కష్టాలు.. 
కాషాగౌడ్‌ కొడుకు మురళీగౌడ్‌ తల్లిదండ్రుల మరణంతో ప్రస్తుతం దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు. తండ్రిలాగే ఇప్పుడు కొడుకు కూడా అప్పుల ఊబిలో కూరుకుపోయా డు. గతంలో తండ్రి గీత వృత్తిలో ఉండగా మురళీగౌడ్‌ కొద్దిరోజులు కూలీపనికి వెళ్లాడు. తర్వాత ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో పనిచేశాడు. కొంతకాలం స్వగ్రామంలో ఆర్‌ఎంపీగా ప్రాక్టీస్‌ చేశాడు. గతేడాది దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. ఇప్పటికీ కుడికాలు పని చేయడం లేదు. తన ఆరోగ్యాన్ని బాగు చేసుకోవడం కోసం కూడా అప్పులు చేయాల్సి వచ్చింది. ఇన్నాళ్లు తల్లిదండ్రుల ఆసరా ఉండగా.. మురళీగౌడ్‌ వారి మరణంతో ఒంటరివాడయ్యాడు. భార్య, ఇద్దరు ఆడపిల్లలను పోషించుకోవడంతోపాటు.. రూ.10 లక్షల అప్పు ఎలా తీర్చేదని మదన పడుతున్నాడు. 


ఈ కష్టం పగవాడికి కూడా రావొద్దు 
అమ్మానాన్న మాకోసం జీవితకాలం కష్టపడ్డారు. నా తోబుట్టువుల పెళ్లిళ్లకోసం రూ.10 లక్షల అప్పుతెచ్చితీర్చడానికి జీవితకాలమంతా కష్టపడ్డాడు. అప్పులు తీర్చాక ఇక కష్టాలు పోయాయని అనుకుంటున్న సమయంలో మాయదారి కరోనా మా జీవితాలను నాశనం చేసింది. అమ్మానాన్నలను బతికించుకోవడానికి తెలిసి న చోటల్లా బతిమాలి రూ.10 లక్షల అప్పుతెచ్చాను. అయినా వారి ప్రాణాలు కాపాడుకోలేకపోయా. తెచ్చిన అప్పు తీర్చాలంటే దారి కనిపించడం లేదు. నా కాలు పనిచేయడం లేదు. ఉన్న ఒక్క ఇల్లును అమ్ముకుని అప్పులు తీర్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. అది అమ్మితే ఇద్దరు పిల్లలతో నేను..నా భార్య రోడ్డున పడాల్సి వస్తుంది. ఈ పరిస్థితి పగవాడికి కూడా రావొద్దు. రాష్ట్ర ప్రభుత్వం, మంత్రి కేటీఆర్‌ స్పందించి అమ్మానాన్నల వైద్యానికి అయిన ఖర్చు అందిస్తే.. జీవితకాలం రుణపడి ఉంటాం. – ఆకుల మురళీగౌడ్‌ 

మరిన్ని వార్తలు