‘డబ్బు’ల్‌ ధమాకా! 

11 Oct, 2021 03:58 IST|Sakshi

ఒకే లేఔట్‌కు రెండుసార్లు హెచ్‌ఎండీఏ అనుమతులు 

పాత లేఔట్‌లో ఖాళీ స్థలాలను కలుపుతూ రెండో లేఔట్‌ 

గ్రామ పంచాయతీకి గిఫ్ట్‌డీడ్‌ చేసిన స్థలంలోనే భారీ భవనం 

కళ్లు మూసుకుని అనుమతి ఇచ్చిన మణికొండ మున్సిపాలిటీ 

తిరుమలహిల్స్‌ లేఔట్‌లో ఖాళీ స్థలాలకు రెక్కలు 

అక్రమార్కులతో అధికారుల కుమ్మక్కు

మణికొండ(హైదరాబాద్‌): హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) అక్రమాలకు అంతులేకుండాపోతోంది. మాస్టర్‌ప్లాన్‌లో రోడ్డుగా చూపిన స్థలంలో బహుళ అంతస్తు భవనానికి అనుమతి ఇచ్చిన ఘటన మరువకముందే తాజాగా మరో ఘటన వెలుగుచూసింది. ఒక లేఔట్‌కు అనుమతి జారీ చేసిన హెచ్‌ఎండీఏ.. అందులోని ప్రజావసరాలకు వదిలిన స్థలాన్ని కలుపుకొని మరో లేఔట్‌కు పర్మిషన్‌ ఇచ్చింది. రెండో లేఔట్‌ జారీ చేసేనాటికే.. ఈ ఖాళీ స్థలం స్థానిక గ్రామ పంచాయతీకి గిఫ్డ్‌డీడ్‌ కింద రిజిస్ట్రేషన్‌ కూడా కావడం గమనార్హం.

హెచ్‌ఎండీఏ చేసిన తప్పును ఎత్తిచూపాల్సిన స్థానిక పురపాలక సంఘం.. లేఔట్‌ కాపీని పట్టించుకోకుండా తమ పేరిట రిజిష్టర్‌ అయిన ఖాళీ స్థలంలో వేరొకరికి బిల్డింగ్‌ పర్మిషన్‌ను జారీ చేసింది. భవన నిర్మాణ అనుమతి సమయంలో స్థల యజమాని ఎవరనేది కూడా చూడకుండా మున్సిపాలిటీ గుడ్డిగా వ్యవహరించడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ అవినీతి భాగోతం ఐటీ హబ్‌ సమీపంలోని మణికొండ పురపాలిక పరిధిలో జరిగింది. సుమారు రూ.50 కోట్ల విలువైన భూమికి స్కెచ్‌ వేసిన రియల్టర్లకు కొందరు పెద్దలు, అధికారులు కూడా తోడు కావడంతో భవన నిర్మాణానికి పునాది పడింది. 

పంచాయతీ పేర రిజిస్ట్రేషన్‌ 
17.36 ఎకరాల విస్తీర్ణంలో వేసిన తిరుమలహిల్స్‌ లేఔట్‌లో 8,633 గజాలను పార్కు స్థలాలుగా నిర్దేశించారు. ఈ మేరకు ఈ విస్తీర్ణాన్ని స్థానిక పంచాయతీకి 1993లో గిఫ్ట్‌డీడ్‌ కూడా చేశారు. మూడేళ్ల క్రితం ఈ పంచాయతీ మణికొండ మున్సిపాలిటీలో విలీనం కావడంతో డాక్యుమెంట్లను ఇక్కడకు బదలాయించారు.

విలువైన ఈ స్థలాన్ని కాపాడుకోవాల్సిన మున్సిపల్‌ యంత్రాంగం.. కనీసం కంచె కూడా వేయకుండా వదిలేసింది. అంతేగాకుండా.. ఈ స్థలాన్ని చూపుతూ మరో లేఔట్‌ వెలిసినా చోద్యం చూస్తూ ఉండిపోయింది. దీంతో బిల్డర్ల ఆటలకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. అంతేకాదు.. నిబంధనలకు విరుద్ధంగా వేసిన రెండో లేఔట్‌లో ఇళ్ల నిర్మాణాలకు టౌన్‌ప్లానింగ్‌ విభాగం పర్మిషన్లు జారీ చేస్తుండటం విశేషం.

స్కెచ్‌ వేశారు.. చెక్కేశారు 
పుప్పాలగూడ గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్‌ 87, 119లో 17.36 ఎకరాలలో తిరుమల్‌హిల్స్‌ పేరిట 1990లో హైదరాబాద్‌ నగరాభివృద్ధి సంస్థ (హుడా) 10132/ఎంపీ2/హుడా/1990 పేరిట లేఔట్‌కు అనుమతి ఇచ్చింది. హుడా అనుమతి ఇచ్చిన వెంచర్‌ కావడం.. నగరానికి దగ్గరగా ఉండటంతో ఇక్కడి ప్లాట్లు హాట్‌కేకుల్లా అమ్ముడుపోయాయి. క్రమేణా ఈ వెంచర్‌ కాస్తా సంపన్నుల కాలనీగా మారింది. దీంతో ఖాళీ స్థలాలపై పాత రియల్టర్ల కన్ను పడింది.

పాత వెంచర్‌లోని ఖాళీ స్థలాలకు పక్కనే మరికొంత స్థలాన్ని (వేరే యజమాని) కలుపుకొని రెండో లేఔట్‌కు ప్రణాళిక రచించారు. హెచ్‌ఎండీఏ అధికారులతో కుమ్మక్కై 6 వేల గజాల పార్కు స్థలాన్ని (మొదటి లేఔట్‌లో చూపిన) కాజేసే ఎత్తుగడకు తెర లేపారు. రెండో లేఔట్‌ ప్రకారం స్థలాలను అమ్మేసి రియల్టర్లు చెక్కేశారు. తాజాగా ఈ ప్లాట్లను కొన్నవారు ఇళ్ల నిర్మాణాలకు రావడం.. మొదటి లేఔట్‌లో కొనుగోలు చేసినవారు వీరిని అడ్డుకోవడంలో అసలు కథ బయటపడింది. మరో విచిత్రమేమిటంటే.. రెండో లేఔట్‌లో నిబంధనలకు అనుగుణంగా కేటాయించాల్సిన పార్కు స్థలాన్ని పక్కనే ఉన్న అజయ్‌హిల్స్‌ కాలనీ పార్కును చూపడం. 

అధికారుల వైఫల్యం 
హుడా అనుమతులతో వచ్చిన లేఔట్‌లో పార్కు స్థలాలను అప్పటి పంచాయతీ పేరుతో రిజిస్ట్రేషన్‌ చేసినా వాటిని పరిరక్షించడంలో అధికారుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. గతంలోనే ప్రహరీ నిర్మాణం చేస్తే ఇన్ని ఇబ్బందులు వచ్చేవి కావు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలి.
– డాక్టర్‌ పి.అవినాష్, తిరుమలహిల్స్‌ సంక్షేమ సంఘం అధ్యక్షుడు  

కేసు ఉండగా అనుమతులా..?
తమ కాలనీ పార్కు స్థలాలుగా చూపిన దాన్నే తిరిగి హెచ్‌ఎండీఏ అధికారులు లేఔట్‌కు అనుమతి ఇవ్వటం దారుణం. దాన్ని రద్దుచేశామని ఒకవైపు చెబుతునే మరోవైపు మున్సిపాలిటీ అధికారులు నిర్మాణ అనుమతులు ఇవ్వటం మరింత దారుణం. సదరు భూమి విషయం కోర్టులో ఉన్నా ఇలాంటి చర్యలు జరగటాన్ని ప్రభుత్వం సమర్ది్థస్తుందా..? లేదంటే అలాంటి అధికారులపై కఠినంగా వ్యవహరిస్తేనే ప్రభుత్వం, శాఖలపై నమ్మకం పెరుగుతుంది.  
– రంగాచారి, తిరుమలహిల్స్‌ సంక్షేమ సంఘం ప్రధానకార్యదర్శి 

నిబంధనల ప్రకారమే అనుమతులు 
హెచ్‌ఎండీఏ జారీ చేసిన లేఔట్‌ కావడంతోనే భవన నిర్మాణానికి అనుమతులు జారీ చేశాం. సదరు లేఔట్‌ రద్దు అయిన విషయం తెలియదు. కాలనీవాసులు పేర్కొంటున్న పార్కు భూమి కోర్టు వివాదంలో ఉండటంతో దాన్ని పరిరక్షించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతున్నాం. గతంలో గ్రామపంచాయతీగా ఉన్నప్పటి నుంచే దానిపై వివాదాలు కోర్టులో ఉన్నాయి. 
– ఎస్‌.జయంత్, కమిషనర్, మణికొండ మున్సిపాలిటీ  

>
మరిన్ని వార్తలు