తేనెటీగలను చెదరగొట్టబోయి వ్యక్తి సజీవ దహనం

21 Mar, 2021 08:05 IST|Sakshi

మక్తల్‌: బస్సుల్లో చేరిన తేనెటీగలను చెదరగొట్టేందుకు నిప్పు పెట్టడంతో మూడు బస్సులు దగ్ధం కావడమేగాక, ఓ వ్యక్తి సజీవ దహనమయ్యాడు. నారాయణపేట జిల్లా మక్తల్‌లో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. మక్తల్‌ పట్టణంలోని ఓ ప్రైవేట్‌ స్కూల్‌కు చెందిన మూడు బస్సులను నిర్వాహకులు ఏడాది కాలంగా స్కూల్‌ పక్కనే ఉన్న ఖాళీ ప్రదేశంలో నిలిపి ఉంచారు. ఉపయోగంలో లేకపోవడంతో వాటిలో తేనెటీగలు చేరాయి.

దీనిని గమనించిన స్కూల్‌ ప్రిన్సిపాల్‌ శ్రీనివాస్‌ స్థానికులైన బుడగజంగాలు మహదేవ్‌ (46), గోపీకి వాటిని తొలగించాలని సూచించారు. దీంతో వారిద్దరూ శనివారం సాయంత్రం కొబ్బరికొమ్మను కాల్చి బస్సులో మంటబెట్టారు. తేనెటీగలు చెల్లాచెదురుకాగా ఒక్కసారిగా మంటలు రేగి బస్సులు దగ్ధమయ్యాయి. అందులో చిక్కుకున్న మహదేవ్‌ సజీవ దహ నం కాగా, గోపీ ఎలాగోలా ప్రాణాలతో బయటపడ్డాడు. కొద్దిసేపటికి చుట్టుపక్కలవారు గమనించి మంటలను ఆర్పి పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటన స్థలాన్ని ఎస్‌ఐ రాము లు పరిశీలించి మృతదేహాన్ని మక్తల్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య బుజ్జమ్మ విలేకరులతో మాట్లాడుతూ, స్కూల్‌ ప్రిన్సిపాల్‌ ఫోన్‌ చేయడంతోనే తన భర్తతో పాటు మరో వ్యక్తి అక్కడికి వెళ్లి తేనెతుట్టెను రాల్చారని చెప్పారు. ఈ సంఘటనలో సుమారు రూ.30 లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది.
చదవండి: సంబరాల్లో అపశ్రుతి.. తెలంగాణ భవన్‌లో మంటలు

మరిన్ని వార్తలు