‘సెకండ్‌’ ముప్పు

24 Nov, 2020 03:39 IST|Sakshi

మన నిర్లక్ష్యం వల్లే రెండో దశలో 

కరోనా విజృంభించే అవకాశం

మాస్క్‌ ధారణ, భౌతికదూరమే మనల్ని రక్షించే ఆయుధాలు

వైద్య నిపుణుల మాటామంతి

సాక్షి, హైదరాబాద్‌ : కరోనా వైరస్‌ సెకండ్‌వేవ్‌ రూపంలో మళ్లీ విరుచుకుపడితే..? వైరస్‌ విజృంభించిన మొదట్లో ఎదురైన గడ్డు పరిస్థితులు మళ్లీ పునరావృతమైతే మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామా?, గత 8 – 9 నెలలుగా అవిశ్రాంతంగా శ్రమిస్తూ కరోనా నియంత్రణలో ముందుండి పోరాడిన ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌.. డాక్టర్లు, వైద్య సిబ్బంది, హెల్త్‌కేర్‌వర్కర్లు మరోసారి అదే తెగువను చూపుతారా? ఇప్పటికే ఎన్నో ఒత్తిళ్లు, ఆందోళనలతో పాటు ఈ సుదీర్ఘ యుద్ధంలో తమ సహచరులను కొందరిని కోల్పోయిన వారియర్స్‌ మళ్లీ అలాంటి శారీరక, మానసిక సంఘర్షణను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారా?, పరిస్థితి మళ్లీ చేతులు దాటి.. దేశవ్యాప్తంగా మరింత కఠిన లాక్‌డౌన్‌ విధించాల్సి వస్తే..?.. ఇప్పుడివే ప్రశ్నలు అందరి మదినీ తొలుస్తున్నాయి.

ఐరోపా దేశాల్లో 17 సెకన్లకు ఒక మరణం
అమెరికా, ఫ్రాన్స్, మెక్సికో సహా వివిధ ఐరోపా దేశాల్లో సెకండ్‌వేవ్‌లో కేసుల తీవ్రత పెరగడంతో పాటు మరణాల సంఖ్యా ›పెరుగుతోంది. వ్యాక్సిన్‌ ఇంకా అందుబాటులోకి రాకపోవడంతో పాటు పశ్చిమదేశాల్లోని వాతా వరణ పరిస్థితుల్లో కోవిడ్‌ చికిత్సలో వాడే కొన్ని ముఖ్యమైన మందులు పనిచేయట్లేదనే వార్తలొస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం ‘మాస్క్‌ మాత్రమే వ్యాక్సిన్‌’అని వైద్య నిపుణులు అంటున్నారు. మాస్క్‌ను నిర్లక్ష్యం చేసిన దేశాల్లో కేసులు బాగా పెరుగుతున్నాయి. సెకండ్‌వేవ్‌ కుదుపునకు గురైన ఐరోపా దేశాల్లో ప్రస్తుతం ప్రతీ 17 సెకన్లకు ఒకరు మరణిస్తున్నారని అంచనా. అదే మాస్క్‌ల వాడకంలో ముందున్న తైవాన్‌ ఇతర ఆసియా దేశాల్లో తక్కువ కేసులు నమోదవుతున్నాయి.

చికిత్సకు లొంగని కేసులు
కరోనా వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే కొద్దీ అది మరింత తట్టుకునే శక్తి (రెసిస్టెన్స్‌ పవర్‌)ని పెంచుకుంటుందని, దీంతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మరణాల సంఖ్య పెరగొచ్చని గత కొన్ని నెలలుగా కోవిడ్ ప్రత్యేక ట్రీట్‌మెంట్‌లో నిమగ్నమైన వైద్య నిపుణులు అంటున్నారు. ఒకటి రెండు వారాలుగా మన దగ్గర కూడా సాధారణ చికిత్సకులొంగని కేసులు ఒకటొకటిగా పెరుగుతున్నట్టు చెబుతున్నారు. ఇలాంటిì కొరుకుడుపడని కేసులకు సంబంధించి ‘జెనిటిక్‌ అనాలిసిస్‌’చేస్తే అసలు కారణం తెలుస్తుందని అంటున్నారు. కొన్ని నెలలుగా కరోనా రోగులకు చికిత్సనందిస్తూ, వైరస్‌తో ముడిపడిన వివిధ అంశాలను నిశితంగా గమనిస్తూ, దీనిపై దేశవిదేశాల్లో జరుగుతున్న పరిశోధనలను విశ్లేషిస్తున్న పల్మనాలజిస్ట్‌లు డాక్టర్‌ హరికిషన్‌ గోనుగుంట్ల, డాక్టర్‌ వీవీ రమణప్రసాద్, డాక్టర్‌ విశ్వనాథ్‌ గెల్లా ‘సాక్షి’తో పంచుకున్న తమ అనుభవాలు వారి మాటల్లోనే.. 

ఎదుర్కొనేందుకు సిద్ధం
కరోనా సెకండ్‌వేవ్‌ నేపథ్యంలో రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ సైతం పరిస్థితిని ఎదుర్కొనేందుకు సన్నద్ధమవుతోంది. ముందస్తుగా చేపట్టిన చర్యలతో తొలిదశ కరోనా మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కొన్న యంత్రాంగం వివిధ రాష్ట్రాలు, నగరాల్లో మళ్లీ కేసులు పెరుగుతున్న క్రమంలో అప్రమత్తమైంది. సెకండ్‌వేవ్‌ వచ్చే అవకాశాలుండటంతో శాఖాపరంగా కచ్చితమైన కార్యాచరణను సిద్ధం చేసినట్టు వైద్య,ఆరోగ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి. ‘తెలంగాణలో మళ్లీ కేసులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. సెకండ్‌వేవ్‌ వచ్చినా ఎదుర్కొనేలా చర్యలు చేపడుతున్నాం. ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. రికవరీ రేటు 94 శాతంగా ఉంది. సెకండ్‌వేవ్‌ నేపథ్యంలో ప్రజలు కచ్చితంగా మాస్క్‌ ధరించాలి. గుమికూడరాదు. ఇతర కోవిడ్‌ ప్రొటోకాల్స్‌ పాటించడం ద్వారా ప్రజలు సహకారమందిస్తే సమస్యను సులభంగా అధిగమించవచ్చు’అని వైద్య,ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి.

ఇప్పటికిప్పుడు మాస్కే వ్యాక్సిన్‌
ఐరోపా నుంచి వస్తున్న నివేదికలను బట్టి సెకండ్‌వేవ్‌ తీవ్రంగా ఉన్న దేశాల్లో ప్రతీ 17 సెకన్లకు ఒక మరణం సంభవిస్తోంది. గత వారంలోనే 29 వేల మంది చనిపోయారు. ఇప్పటికే మెక్సికోలో లక్ష మందిపైగా మత్యువాతపడ్డారు. ఆస్ట్రేలియాలోని కొన్ని ప్రాంతాల్లో మరోసారి లాక్‌డౌన్‌ విధించారు. భారత్‌లో సెకండ్‌వేవ్‌ తీవ్రంగా వస్తే అది సునామీగా మారే ప్రమాదముంది. ఢిల్లీ, ముంబై తదితర చోట్ల కేసులు పెరుగుతున్నాయి. హాస్పటల్స్‌లో బెడ్స్‌ మళ్లీ నిండిపోతున్నాయి. కొన్నిచోట్ల అడ్మిట్‌ అయ్యేందుకు పేషెంట్లు వేచిచూడాల్సిన పరిస్థితులున్నాయి. సాధారణ ప్రజలు వైరస్‌ ప్రభావం తగ్గిపోయిందనే భావనలో ఉన్నారు.

కనీస జాగ్రత్తలు తీసుకోకుండా పండుగలు, పబ్బాలు చేసుకుంటున్నారు. మన దగ్గరా సెకండ్‌వేవ్‌ వస్తే దానిని తట్టుకునే, ఎదుర్కొనే సంసిద్ధత ఉందా? అనేది ప్రశ్న. హెల్త్‌కేర్‌ వర్కర్లు ఒత్తిళ్లకు గురవుతున్నారు. ప్రజల్లో కనిపిస్తోన్న నిర్లక్ష్యం, వైరస్‌ మ్యుటేటయ్యే అవకాశాలు, ఇంకా వ్యాక్సిన్‌ సిద్ధం కాకపోవడం వంటివి సవాల్‌గా మారతాయి. వైరస్‌ స్ట్రెయిన్లు మార్పు చెందుతూ ఉంటే మరణాల సంఖ్య పెరుగుతుంది. యూఎస్, ఇతర పశ్చిమ దేశాలతో పోలిస్తే తైవాన్‌లో మాస్క్‌లు తప్పనిసరి చేయడంతో అక్కడ గతంలో రోజుకు 40 వేల కేసులు నమోదైతే ఇప్పుడు పదిలోపే వస్తున్నాయి. కాబట్టి ఇప్పటికిప్పుడు మాస్కే వ్యాక్సిన్‌.
– డాక్టర్‌ హరికిషన్‌ గోనుగుంట్ల, యశోద ఆసుపత్రి చీఫ్‌ ఇంటర్వెన్షనల్‌ పల్మనాలజిస్ట్‌

అలసత్వంతో మొదటికే మోసం
కరోనా ప్రభాం తగ్గిపోయింది.. ఇక ఏమీ కాదనే అతి విశ్వాసం, అజాగ్రత్త, నిర్లక్ష్యం ప్రజల్లో కనిపిస్తోంది. మాస్క్‌లు పెట్టుకోకపోవడమే కాక భౌతికదూరాన్ని కూడా సరిగ్గా పాటించట్లేదు. వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు ఇప్పటివరకు జరిగిన కృషి అంతా ఈ నిర్లక్ష్యంతో వృథాగా మారే ప్రమాదముంది. ప్రజల అలసత్వం, నిర్లక్ష్యం వల్లే సెకండ్‌వేవ్‌ వస్తుంది. ఢిల్లీ, ముంబై మాదిరిగా మళ్లీ కేసులు పెరిగి ఐసీయూ బెడ్స్‌ దొరకని పరిస్థితి రాకుండా చూసుకోవాలి. సాధారణంగా మహమ్మారులు వచ్చినపుడు సెకండ్‌వేవ్‌ అనేది ఉంటుంది. అయితే కోవిడ్‌ విషయంలో మరిన్ని ముందుజాగ్రత్తలు, వ్యాధి తీవ్రంగా మారకుండా చూసుకోవాల్సిన అవసరముంది.

చలికాలంలో వైరల్‌ ఇన్ఫెక్షన్లు పెరుగుతాయి. ఇకపై వీటిలో కరోనా, న్యూమోనియా భాగం కానున్నందున అప్రమత్తత చాలా అవసరం. వయసుపైబడిన వారు, అనారోగ్య సమస్యలున్న వారు, చిన్నపిల్లల విషయంలో ఎక్కువ కేర్‌ తీసుకోవాలి. కనీసం మరో 6 నెలల పాటు జాగ్రత్తలు పాటిస్తే సెకండ్‌వేవ్‌ను కూడా ఎదుర్కోగలుగుతాం. మన దగ్గర ఇప్పటికే 40 శాతం మందిలో యాంటీబాడీస్‌ ఏర్పడ్డాయనే వార్తలొస్తున్నాయి. ఇతర దేశాలతో పోలిస్తే ఇక్కడ పరిస్థితులు మెరుగ్గానే ఉన్నాయి. ట్రీట్‌మెంట్‌పరంగా కూడా ప్రొటోకాల్స్‌ ఏర్పడ్డాయి. కరోనా వస్తే ఏంచేయాలన్న దానిపై ప్రజల్లోనూ అవగాహన పెరిగింది. మన దగ్గర వైరస్‌ మార్పుచెంది మరింత వైర్యులెంట్‌గా మారిందనడానికి ఆధారాల్లేవు.
– డాక్టర్‌ వీవీ రమణప్రసాద్, కిమ్స్‌ ఆసుపత్రి కన్సల్టెంట్‌ పల్మనాలజిస్ట్‌

నిర్లక్ష్యం అసలు వద్దు
మన దగ్గరా సెకెండ్‌వేవ్‌ వచ్చే అవకాశాలు కచ్చితంగా కనిపిస్తున్నాయి. ఇటీవల చిన్నా, పెద్ద పండుగల్ని ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా జరుపుకుంటున్నారు. చకాలంలో వైరస్‌ తీవ్రత మరింత పెరగొచ్చు. మాస్క్‌లు ధరించకపోవడం, గుమికూడటం వంటివి ప్రమాదకరం. వ్యాక్సిన్‌ రాకముందే ఈ స్థాయిలో అన్నిచోట్లా ఓపెన్‌ కావడం మంచిది కాదు. కరోనాకు సంబంధించి ప్రస్తుత దశే కీలకం. కోవిడ్‌ చికిత్సకు సంబంధించి ఇంకా కొత్త మందులు రాలేదు. కొన్నిచోట్ల రెమ్‌డెసివిర్‌ వంటివి సరిగా పనిచేయడం లేదంటున్నారు. స్టెరాయిడ్స్‌ వినియోగం తప్ప మెరుగైన ఆయుధం లేదు. ఇప్పటికే వైరస్‌తో చాలా నష్టం జరిగిపోయింది. మనకు కావాల్సిన వారిని, ఆప్తులను చాలామందినే కోల్పోయాం. ఇంత జరిగాక కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే తెలిసి తెలిసీ మనకు మనమే నష్టం కలిగించుకుంటున్నట్టు.
– డాక్టర్‌ విశ్వనాథ్‌ గెల్లా, ఏఐజీ పల్మనాలజీ, స్లీప్‌ డిజార్డర్స్‌ స్పెషలిస్ట్‌

>
మరిన్ని వార్తలు