పులి దాడిలో యువకుడి మృతి

12 Nov, 2020 03:11 IST|Sakshi

సాక్షి, మంచిర్యాల : పులి దాడిలో ఓ గిరిజన యువకుడు మృతిచెందా డు. కుమురంభీం జిల్లా దహెగాం మండలం దిగిడలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. దిగిడకు చెందిన గిరిజన యువకుడు సిడాం విఘ్నేష్‌ (22).. శ్రీకాంత్, నవీన్‌తో కలసి పత్తి చేను వద్దకు వెళ్లారు. అక్కడ పొదలమాటున ఉన్న పులి ఒక్కసారిగా విఘ్నేష్‌పై దాడి చేసింది. అతన్ని నోటకరుచుకుని అడవిలోకి లాక్కెళ్లింది. విఘ్నేష్‌తో వెళ్లిన ఇద్దరు ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు, స్థానికులకు సమాచారం ఇచ్చారు.

అంతా ఆ ప్రాంతంలో వెతకగా మృతదేహం లభ్యమైంది. తల, ఇతర శరీర భాగాలపై పులి విఘ్నేష్‌ను తీవ్రం గా గాయపర్చింది. జిల్లా అటవీ అధికారుల, పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మహారాష్ట్రలోని చంద్రాపూర్‌ జిల్లా తడోబా–అందేరి అభయారణ్యంలోని పులులు తరచూ సమీప గ్రామాల్లోకి వచ్చి మనుషులపై దాడి చేస్తున్నాయి. ఈ దాడుల్లో ఈ ఏడాదిలో అక్కడ 20 మంది ప్రాణాలు కోల్పోగా.. అనేకమంది గాయపడ్డారు. దీంతో అక్కడి అటవీ అధికారులు 50 పులులను వేరే ప్రాంతానికి తరలించేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం తడోబాలో 160 పులులు ఉన్నాయి.

వీటి ఆవాసా లు ఇరుకుగా మారడంతో ప్రాణహిత దాటి తెలంగాణలో అడుగుపెడుతున్నాయి. అలా ఆవాసాలు వెతుక్కునే క్రమంలోనే ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా కవ్వాల్‌ టైగర్‌ జోన్‌ పరిధిలోని ఆదిలాబాద్, కుమురం భీం, మంచిర్యా ల జిల్లాల అటవీ ప్రాంతంలోని పశువుల కాపర్లకు, బాటసారులకు అనేకసార్లు పులులు ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి. 
 

మరిన్ని వార్తలు