విజిల్స్‌ మోత.. దారులు మూసివేత

8 Dec, 2020 05:58 IST|Sakshi
పీఈటీ అభ్యర్థులను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు

ప్రగతిభవన్‌  ముట్టడికి గురుకుల పీఈటీ అభ్యర్థుల యత్నం

పంజగుట్ట(హైదరాబాద్‌): కట్టుదిట్టమైన భద్రత.. బారులుగా బారికేడ్లు.. ఒక్కసారిగా విజిల్స్‌ మోత.. హోరెత్తిన నినాదాలు.. అటుగా దూసుకొచ్చిన యువతీయువకులు.. ప్రధాన ద్వారం వైపు పరుగులు.. ద్వారాలు, దారులు మూసివేత... అప్రమత్తమైన పోలీసులు ఎక్కడికక్కడ అడ్డగింపు.. ఇదీ ప్రగతిభవన్‌  వద్ద సోమవారం చోటుచేసుకున్న సన్నివేశం. గురుకుల వ్యాయామ ఉపాధ్యాయ పోస్టుల భర్తీని వెంటనే చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ గురుకుల పీఈటీ అభ్యర్థులు సోమవారం ఇక్కడి ప్రగతిభవన్‌  ముట్టడికి యత్నించారు. పెద్ద సంఖ్యలో అభ్యర్థులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ, విజిల్‌ సౌండ్లతో ప్రగతిభవన్‌  వద్దకు వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

అక్కడ భారీగా మోహరించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని గోషామహల్‌ స్టేషన్‌ కు తరలించారు. ఈ సందర్భంగా గురుకుల పీఈటీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మాదగోని సైదులుగౌడ్‌ మాట్లాడుతూ 616 గురుకుల వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులకు 2017 ఏప్రిల్‌ 20న నోటిఫికేషన్‌  విడుదల చేయగా, 2017 సెప్టెంబర్‌ 17, 18వ తేదీల్లో అర్హత పరీక్షలు రాశామని తెలిపారు. 2018 మే 17న ఒక్క పోస్టుకు ఇద్దరు చొప్పున 1,232 మంది అభ్యర్థులను ఎంపిక చేసి, 2018 మే 18 నుండి 23 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌  పూర్తి చేశారని, తర్వాత కోర్టు తీర్పు పేరుతో నియామకాలు ఆపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నియామకాలు చేపట్టాలని కోరారు.
 
పీఈటీ టీచర్ల పోరుకు బీసీ సంఘం సంఘీభావం  
వెంటనే పోస్టింగ్‌లు ఇవ్వాలని ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌
హైదరాబాద్‌ (గన్‌ఫౌండ్రీ): పీఈటీ ఉపాధ్యాయులకు తక్షణమే పోస్టింగ్‌ ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. సోమవారం ప్రగతిభవన్‌ ముట్టడికి యత్నించి అరెస్టయి గోషామహల్‌ పోలీస్‌ స్టేడియంలో ఉన్న పీఈటీ ఉపాధ్యాయులను ఆయన కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా పీఈటీ టీచర్ల ఆందోళనకు సంఘీభావం ప్రకటించి కృష్ణయ్య మాట్లాడారు. 1,232 మంది పీఈటీ ఉపాధ్యాయులుగా ఎంపికై మూడేళ్లు గడిచినా నేటికీ పోస్టింగ్‌లు ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోస్టింగ్‌ వచ్చిందనే ఆశతో ఇతర పనులకు వెళ్లలేక, పోస్టింగ్‌ రాక ఎంపికైన వారు ఎంతో మానసిక క్షోభకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా వ్యవస్థను ఒక పథకం ప్రకారం ప్రభుత్వం నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఖాళీగా ఉన్న పోస్టులకు వెంటనే ఉద్యోగ ప్రకటనలు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, ప్రతినిధులు వేముల రామకృష్ణ, ఉదయ్, సుధాకర్‌ పాల్గొన్నారు.

ధర్నాలో పాల్గొన్న బీసీ సంఘం నాయకులు

మరిన్ని వార్తలు