అధికారులపై పెట్రోల్‌ పోసి.. లైటర్‌తో నిప్పంటించి.. 

11 May, 2022 01:37 IST|Sakshi
మంటలు అంటుకోవడంతో పరుగులు తీస్తున్న ఎంపీవో వెంకటకృష్ణరాజు 

దారి వివాదంపై విచారణకు వెళ్లినవాళ్లపై గ్రామస్తుడి దాడి 

ఓ అధికారికి స్పల్ప గాయాలు 

జగిత్యాల జిల్లాలో దారుణం

సారంగాపూర్‌ (జగిత్యాల): దారి వివాదాన్ని పరిష్కరించేందుకు వెళ్లిన అధికారులపై ఓ వ్యక్తి దాడి చేశాడు.  పవర్‌ స్ప్రేతో పెట్రోల్‌ చల్లి లైటర్‌తో నిప్పంటించాడు. దీంతో ఓ అధికారికి స్వల్ప గాయాలయ్యాయి. మిగతా అధికారులు, పక్కనున్న గ్రామస్తులు పరుగులు పెట్టి ప్రాణాలు కాపాడుకున్నారు. జగిత్యాల జిల్లా బీర్‌పూర్‌ మండలం తుంగూరు గ్రామంలో మంగళవారం ఈ దారుణం జరిగింది.  

దారి తనదంటూ.. ఎవరూ వెళ్లొద్దంటూ.. 
తుంగూరు గ్రామానికి చెందిన చుక్క గంగాధర్‌ ఇంటి వద్దకు బస్టాండ్‌ సమీపంలోని మెయిన్‌ రోడ్డు నుంచి దారి ఉంది. మరో 10 ఇళ్లకు కూడా ఇదే దారి. అయితే ఆ స్థలం తన సొంత ఆస్తి అని, ఈ దారి నుంచి ఎవరూ నడవొద్దని ఆ 10 ఇళ్ల వాళ్లను గంగాధర్‌ కొంతకాలంగా బెదిరిస్తున్నాడు. దీంతో వాళ్లు ఆరేడుసార్లు ప్రజావాణి ద్వారా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.

కలెక్టర్‌ ఆదేశించినా కింది స్థాయి అధికారులు ఇంతకాలం నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు. గత ఫిబ్రవరిలో మళ్లీ ప్రజావాణి ద్వారా ఫిర్యాదు చేయగా కలెక్టర్‌ ఆదేశాలతో డీఎల్‌పీవో కనకదుర్గ, తహసీల్దార్‌ అరీఫుద్దీన్, ఎస్సై గౌతమ్‌ పవార్, ఎంపీవో వెంకటకృష్ణరాజు తుంగూరుకు వెళ్లారు. కాలనీవాసులు, గ్రామస్తులను కలిసి వివరాలు సేకరించారు. ఆ తర్వాత దారికి అడ్డుగా పెట్టిన కర్రలను పంచాయతీ సిబ్బంది తొలగించారు. దీంతో గంగాధర్‌ అసభ్య పదజాలంతో అధికారులను తిడుతూ పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులపై దాడికి దిగాడు. అతడిని పోలీసులు అడ్డుకొని దారిని క్లియర్‌ చేయించారు. 

మరిన్ని వార్తలు