హైదరాబాద్‌: రూ.100.20 పలికిన లీటర్‌ పెట్రోల్‌     

15 Jun, 2021 08:17 IST|Sakshi

రూ.95.14 పైసలకు చేరిన డీజిల్‌

నగరంలో ఆల్‌టైం రికార్డు ధరలు

పక్షం రోజుల్లో పెట్రోల్‌పై రూ.2 వడ్డన

డీజిల్‌పై రూ.2.17 పెరిగిన భారం

నిత్యాసర సరుకుల ధరలపై ప్రభావం

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ రూ.100 దాటి ఆల్‌టైమ్‌ రికార్డు సృష్టించింది. డీజిల్‌ లీటర్‌ ధర వందకు చేరువైంది. సోమవారం పెట్రోల్‌ రూ.100.20, డీజిల్‌ రూ.95.14 పైసల చొప్పున ధర పలికాయి. కరోనా కష్టకాలంలో సైతం ఇంధన ధరలపై బాదుడు తప్పడం లేదు. తాజాగా పక్షం రోజుల్లో  లీటర్‌ పెట్రోల్‌పై రూ.2, డీజిల్‌పై రూ.2.17 పైసలు పెరిగింది. ఒకవైపు కరోనా సెకండ్‌వేవ్‌ ఉగ్రరూపం, మరోవైపు ఉపాధి కోల్పోయి సామాన్య ప్రజానీకం ఇబ్బంది పడుతుంటే చమురు ధరల పెంపు మరింత భారంగా మారాయి. పెరుగుతున్న ఇంధనం ధరలతో నిత్యావసర వస్తువుల ధరలు మండిపోతున్నాయి. 

రెండు నెలలుగా పైపైకి.. 
కరోనా కష్టకాలంలో గత రెండు మాసాలుగా పెట్రోల్, డీజిల్‌ ధరలు మళ్లీ పెరుగుదల బాట పట్టాయి. వాస్తవంగా ఈ ఏడాది ఆరంభంలో మొదటి రెండు నెలల్లో లీటర్‌ పెట్రోల్‌పై రూ.8.32 పైసలు, డీజిల్‌పై 9.51 పైసలు పెరిగాయి. ఆ తర్వాత వరసగా రెండు నెలలు లీటర్‌ పెట్రోల్‌పై 75 పైసలు, డీజిల్‌పై 92 పైసలు తగ్గాయి. తిరిగి వరుసగా పైసలు పెరిగి రెండు నెలల వ్యవధిలో లీటర్‌ పెట్రోల్‌పై రూ.6.02 పైసలు, డీజిల్‌పై రూ 7.32 పెరిగినట్లు చమురు సంస్థల రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. 

గరిష్ట స్థాయికి ఇలా.. 
పెట్రోల్, డీజిల్‌ ధరలు గరిష్ట స్థాయికి చేరాయి. రోజువారీ సవరణ కంటే ముందే ఇంధన ధరలు గరిష్ట స్ధాయికి చేరి తర్వాత తగ్గుముఖం పట్టాయి. నాలుగేళ్ల క్రితం రోజువారీ సవరణలు ప్రారంభం కావడంతో పైసల్లో హెచ్చు తగ్గులు ప్రారంభమయ్యాయి. తొలిసారిగా పెట్రోల్‌  2013 సెప్టెంబర్‌లో లీటర్‌ ధర రూ. 83.07 పలికి గరిష్ట స్థాయికి చేరింది. ఆ తర్వాత తగ్గుముఖం పట్టి రోజువారీ ధరల సవరణ అనంతరం  2018 అక్టోబర్‌ 4న లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.89.11కు పెరిగి రికార్డు బద్దలు కొట్టింది. డీజిల్‌  2018 అక్టోబర్‌లో లీటర్‌ ధర రూ.82.38తో రికార్డు సృష్టించింది. ఈ ఏడాది జనవరిలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.89.15, డీజిల్‌ రూ.82.80కు చేరి పాత రికార్డును అధిగమించింది. తాజాగా మరింత గరిష్ట ధరకు చేరుకున్నాయి. 

నగర వాటా 70 శాతం పైనే 
గ్రేటర్‌లో వాహనాల సంఖ్య సగటున 65 లక్షలపైగానే ఉంటుంది. పెట్రోల్, డీజిల్‌ వినియోగంలో నగర వాటా 70% వరకు ఉంటుంది. నగరం మొత్తమ్మీద 558 వరకు పెట్రోల్‌ బంకులు ఉన్నాయి. ప్రతినిత్యం 35 నుంచి 40 లక్షల లీటర్ల పెట్రోల్, 30 నుంచి 33 లక్షల లీటర్ల డీజిల్‌ అమ్మకాలు జరుగుతుంటాయి. 

జీఎస్టీలో చేర్చాలి  
చమురు ధరల్లో కేంద్ర, రాష్ట్ర పన్నుల వాటా శాతమే సగానికిపైగా ఉంటుంది. పెట్రోల్, డీజిల్‌లను కూడా జీఎస్టీలో చేర్చాలి. అప్పుడే ధరలు నియంత్రణలోకి వచ్చే అవకాశం ఉంది. ధరలు ఇదే విధంగా కొనసాగితే నిత్యావసర సరుకులు మరింత పెరుగుతాయి. వాహనాలు కూడా నడపడం కష్టమే.   
 – సయ్యద్‌ జావీద్, అధ్యక్షుడు, గ్రేటర్‌ సిటీ ట్యాక్స్‌ వేల్పేర్‌ అసోసియేషన్‌ 

మరిన్ని వార్తలు