పెట్రో డీలర్ల ఆందోళన 

1 Jun, 2022 01:12 IST|Sakshi

కమీషన్‌ పెంచాలని కోరుతూ ‘నో పర్చేజ్‌ డే’పాటించిన డీలర్లు 

చమురు కంపెనీలకు చెందిన ఏడు డిపోల నుంచి వాహనాలను అడ్డగింత 

సాక్షి,హైదరాబాద్‌: పెట్రోల్, డీజిల్‌పై కమీషన్‌ పెంచాలని కోరుతూ ‘పెట్రో’డీలర్లు మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా ‘నో పర్చేజ్‌ డే’పాటించి నిరసన వ్యక్తం చేశారు. దేశంలోని 22 రాష్ట్రాల్లో చేపట్టిన ఈ నిరసన కార్యక్రమంలో భాగంగా ఇంధన కంపెనీల నుంచి పెట్రోల్, డీజిల్‌ కొనుగోలు చేయకుండా రాష్ట్రంలోని డీలర్లంతా సంఘీభావాన్ని ప్రకటించారు. 2017 నుంచి పెట్రోల్, డీజిల్‌ ధరలు రెట్టింపు అయినప్పటికీ, డీలర్ల కమీషన్‌ మాత్రం పెంచలేదని, ఇటీవల ఎక్సైజ్‌ డ్యూటీ తగ్గించడంతో తాము చెల్లించిన మొత్తం నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని ఈ సందర్భంగా డీలర్లు ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్ర పెట్రోల్, డీజీల్‌ డీలర్ల సంఘం పిలుపు మేరకు హైదరాబాద్, సూర్యాపేట, రామగుండం, వరంగల్‌లలో ఉన్న మూడు చమురు కంపెనీలకు చెందిన 7 పెట్రోల్, డీజిల్‌ డిపోల నుంచి వాహనాలు బయటకు వెళ్లకుండా ఆందోళన దిగారు. ఈ సందర్భంగా కుషాయిగూడలో ఎనిమిది మంది డీలర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని మధ్యాహ్నం వదిలి వేశారు.

ఈ ఆందోళనల కారణంగా రాష్ట్రంలో కొన్ని పెట్రోల్‌ బంకుల్లో ‘నో స్టాక్‌’బోర్డులు దర్శనమిచ్చాయి. దీంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. కాగా, ఆర్నెల్లకోసారి డీలర్ల కమీషన్‌ను సవరించాల్సి ఉండగా, 2017 నుంచి దాని గురించి పట్టించుకోలేదని రాష్ట్ర పెట్రో డీలర్ల సంఘం అధ్యక్షుడు అమరేందర్‌ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించడాన్ని తప్పుపట్టడం లేదని, తాము చెల్లించిన మొత్తాన్ని రీయంబర్స్‌మెంట్‌ చేయాలని చమురు కంపెనీలను డిమాండ్‌ చేస్తున్నట్లు తెలిపారు. 

మరిన్ని వార్తలు