కాలుష్య రహితంగా ఫార్మాసిటీ

26 Aug, 2020 06:09 IST|Sakshi
ఫార్మాసిటీపై సమీక్ష నిర్వహిస్తున్న ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌

అంతర్జాతీయ ప్రమాణాలతో మాస్టర్‌ప్లాన్‌

జీరో లిక్విడ్‌ డిశ్చార్జి యూనిట్ల ఏర్పాటు

ఫార్మాసిటీపై మంత్రి కేటీఆర్‌ ఉన్నత స్థాయి సమీక్ష

సాక్షి, హైదరాబాద్‌: అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో హైదరాబాద్‌ ఫార్మా సిటీ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. మంగళవారం ‘టీ ఫైబర్‌’కార్యాలయంలో హైదరాబాద్‌ ఫార్మాసిటీపై జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌తో పాటు, ఆర్థిక, పురపాలక, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శులు పాల్గొన్నారు. ఫార్మాసిటీలో తమ యూ నిట్ల ఏర్పాటుకు వందలాది ఫ్యాక్టరీలు ఎదు రు చూస్తున్నాయని తెలిపారు. మాస్టర్‌ ప్లాన్‌కు అనుగుణంగా కాలుష్య రహితంగా ఫార్మాసిటీని తీర్చిదిద్దాలని కేటీఆర్‌ అన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఫార్మాసిటీని ఏర్పాటు చేసేందుకు పరిశ్రమల శాఖ అధికారులు ఇప్పటికే పలు దేశాల్లోని ఫార్మా క్లస్టర్లను సందర్శించిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు.

విండ్‌ ఫ్లో వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని మాస్టర్‌ప్లాన్‌ రూపొందించినట్లు వెల్లడించారు. ఫార్మాసిటీని కాలుష్య రహితంగా తీర్చిదిద్దేందుకు జీరో లిక్విడ్‌ డిశ్చార్జి యూనిట్లు ఎక్కువగా ఏర్పాటవుతాయని తెలిపారు. రసాయన వ్యర్థాలను కేంద్రీకృతంగా శుద్ధి చేసేలా ఏర్పాట్లు చేస్తున్నామని, ఫార్మాసిటీలో పనిచేసే వారికి అక్కడే నివాస సౌకర్యం ఉంటుందన్నారు. ఫార్మాసిటీకి అనుబంధంగా అత్యుత్తమ విద్యా సంస్థలు ఏర్పడతాయని పేర్కొన్నారు. అలాగే స్థానికులకు ఉద్యోగాలు కల్పించేందుకు నైపుణ్య శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. సమావేశంలో ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్, టీఎస్‌ఐఐసీ ఎండీ ఈవీ నర్సింహారెడ్డి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు