ఆరోగ్య ఉపకేంద్రం ‘రెడీ’మేడ్‌

31 May, 2022 03:07 IST|Sakshi

కృత్రిమ గోడలతో సిద్ధమవుతున్న పీహెచ్‌సీ సబ్‌ సెంటర్‌ 5 ఏళ్లుగా నిలిచిన నిర్మాణం.. వారంలో ప్రారంభం

తిర్యాణి(ఆసిఫాబాద్‌): అది దట్టమైన అటవీప్రాంతం.. రవాణా అంటే హైరానే.. బాహ్య ప్రపంచానికి బహుదూరంగా, నిర్మాణ సామగ్రి తరలింపు భారంగా మారడంతో 15 ఏళ్లుగా ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం భవన నిర్మాణ పనులు నిలిచిపోయాయి. ఎట్టకేలకు అది రెడీమేడ్‌ తరహాలో సిద్ధమవుతోంది. కుమురంభీం జిల్లా తిర్యాణి మండలం గుండాల గ్రామపంచాయతీ ఏడు గూడేలతో ఉంటుంది.

దట్టమైన అటవీప్రాంతం లోపల ఉండటంతో గ్రామస్తులు విద్య, వైద్యం, నిత్యావసర సరుకుల కోసం వేరే గ్రామానికి ఆరు కిలోమీటర్ల మేర కాలినడకన వెళ్లాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ గ్రామంలో పీహెచ్‌సీ సబ్‌ సెంటర్‌ భవన నిర్మాణానికి 2007లో ఐటీడీఏ ద్వారా రాష్ట్రీయ స్వయం వికాస్‌ యోజన కింద రూ.7 లక్షలు మంజూరయ్యాయి. నిర్మాణ సామగ్రి తరలింపులో ఇబ్బందులు తలెత్తడంతో కాంట్రాక్టర్‌ బేస్‌మెంటు స్థాయిలోనే పనులు నిలిపివేశాడు. 15 ఏళ్లుగా స్తంభించిన పీహెచ్‌ఎసీ భవనం పనులు ఇటీవల కలెక్టర్‌ రాహుల్‌రాజ్, అడిషనల్‌ కలెక్టర్‌ వరుణ్‌రెడ్డి, ఐటీడీవో పీవో అంకిత్‌ ప్రత్యేక చొరవతో మళ్లీ ప్రారంభమయ్యాయి.

సాధారణ భవనం కట్టడానికి పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఆ బేస్‌మెంట్‌పైనే కేరళకు చెందిన శాంతి మెడికేర్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టం అనే సంస్థ ద్వారా కృత్రిమ గోడల (సిమెంటు ఫైబర్‌ ప్యానెల్‌)ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ తరహాలోనే ఆరోగ్య ఉపకేంద్రంలో విశ్రాంతి గది, ఫార్మసీ రూమ్, చికిత్స చేసే గది, హాలు, మరుగుదొడ్లు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే 80 శాతం పనులు పూర్తయ్యాయి. మరో వారం రోజుల్లో ప్రారంభిస్తామని డీఎంహెచ్‌వో కుడిమెత మనోహర్‌ తెలిపారు. ఇదే తరహాలో ఆసిఫాబాద్‌ మండలం గుండి గ్రామంలో అంగన్‌వాడీ కేంద్రాన్ని కూడా నిర్మించారు.  

మరిన్ని వార్తలు