Photo Story: కుండపోత వాన, పర్యాటకుల సందడి, ఆరుద్ర ఆగమనం

28 Jun, 2021 09:26 IST|Sakshi

వర్షాల కోసం భీంసన్‌ దేవుడికి పూజలు

బేల(ఆదిలాబాద్‌): మండలకేంద్రంలోని ఆదివాసీ పర్దాన్‌లు వర్షాలు సమృద్ధిగా పడాలని ఆదివారం భీంసన్‌ దేవుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు కుటుంబ సభ్యులతో కలిసి శోభాయాత్ర నిర్వహించారు. స్థానిక ఇందిరా నగర్‌కాలనీలో భీంసన్‌ దేవుడికి ప్రత్యేక పూజలు చేసి, నైవేద్యం సమర్పించారు.

కుండపోత వర్షం
వేములవాడ : వేములవాడలో ఆదివారం సాయంత్రం ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఈదురుగాలుల కారణంగా సెస్‌ అధికారులు విద్యుత్‌ సరఫరా నిలిపి వేశారు. పలు గ్రామాల్లో పత్తి చెళ్లలో వర్షపు నీరు నిలిచింది. ఇల్లంతకుంట మండలంలోని పొత్తూరు–కందికట్కూర్‌ గ్రామాల మధ్య ఉన్న సుద్ద ఒర్రె ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలకు నిలిచిపోయాయి.  

కుంటాల జలపాతం వద్ద పర్యాటకుల సందడి
వరుసగా కురుస్తున్న వర్షాలకు ఆదిలాబాద్‌ జిల్లాలోని కుంటాల, పొచ్చెర జలపాతాలు జలకళను సంతరించుకున్నాయి. లాక్‌డౌన్‌ కారణంగా పర్యాటకులను అనుమతించకపోవడంతో ఇన్ని రోజులు నిర్మానుష్యంగా ఉన్నాయి. అయితే ప్రస్తుతం కరోనా ఆంక్షలు ఎత్తివేయడం, ఆదివారం కలిసి రావడంతో హైదరాబాద్, మహారాష్ట్ర నుంచి పర్యాటకులు తరలివచ్చారు. జలపాతం వద్ద స్నానాలు చేస్తూ.. సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు.
– సాక్షి ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్‌


ఆరుద్ర.. ఆగమనం 
ఏడాది మొత్తంలో ఆరుద్రకార్తెలో మాత్రమే ఆరుద్ర పురుగులు దర్శనమిస్తాయి. ఆరుద్ర కార్తెకు రైతులకు అవినాభావ సంబంధం ఉంది. ఈ పురుగుల ఆగమనాన్ని అన్నదాతలు శుభసూచకంగా భావిస్తారు. ఆదివారం నెన్నెల శివారులోని చేన్లలో ఆరుద్ర పురుగులు దర్శనమిచ్చాయి. దీంతో ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా పడి, పంటలు బాగా పండుతాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.                   
– నెన్నెల 

విరబూసిన ‘బ్రహ్మ కమలం’

రెబ్బెన(ఆసిఫాబాద్‌): అత్యంత అరుదుగా కనిపించే బ్రహ్మకమలం రెబ్బెన మండలంలోని గోలేటి టౌన్‌షిప్‌లో దర్శనమిచ్చింది. బెల్లంపల్లి ఏరియాలోని ఏరియా వర్క్‌షాప్‌ డీజీఎంగా పనిచేస్తున్న శివరామిరెడ్డి నివాసంలో ఈ బహ్మకమలం వికసించింది. కొద్ది గంటలు మాత్రమే పూర్తిగా వికసించే ఈ పుష్పం ఆపై ముడుచుకుంటుంది. శివరామిరెడ్డి సతీమణి సృజన మాట్లాడుతూ సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే బ్రహ్మకమలం వికసిస్తుందని తెలిపారు. అలాంటి అరుదైన పుష్పం పూయటం అదృష్టంగా భావిస్తున్నామని పేర్కొన్నారు.   

మరిన్ని వార్తలు