Photo Feature: అరక దున్నిన అత్త.. విత్తనాలు వేసిన కోడళ్లు!

17 Jun, 2022 16:05 IST|Sakshi

వ్యవసాయంలో మహిళల శ్రమే అధికమైనా... రైతు అనగానే నెత్తిన తలపాగ, చేతిలో అరకతో ఓ పురుష రూపం గుర్తుకొస్తుంది. దాన్ని బ్రేక్‌ చేశారు నల్లగొండ జిల్లాకు చెందిన శ్రీశైలమ్మ. చింతపల్లి మండలం కుర్రంపల్లిలో గురువారం ఆమె అరక దున్నుతుండగా, తన ఇద్దరు కోడళ్లు విత్తనాలు వేస్తూ కనిపించారు. శ్రీశైలమ్మ భర్త రామచంద్రం సామాజిక కార్యకర్త. వారికి ఆరుగురు కుమారులు. ఇద్దరు ఆర్మీలో ఉన్నారు. నలుగురు ప్రైవేట్‌ ఉద్యోగాలు చేస్తున్నారు. అయినా శ్రీశైలమ్మ భర్తతోపాటు వ్యవసాయ పనులు చేస్తూ స్ఫూర్తినిస్తున్నారు.    
– సాక్షి ఫొటోగ్రాఫర్, చింతపల్లి (దేవరకొండ) 


‘ఆశ’క్తిగా ఖోఖో

ఆదిలాబాద్‌ డైట్‌ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన క్రీడా మైదానాన్ని కలెక్టర్‌ సిక్తా పట్నాయక్, మున్సిపల్‌ చైర్మన్‌ జోగు ప్రేమేందర్‌లతో కలిసి ఎమ్మెల్యే జోగు రామన్న గురువారం ప్రారంభించారు. అక్కడ ఏర్పాటు చేసిన క్రీడా వస్తువులు, మైదానాన్ని పరిశీలించి వెళ్లిపోయారు. అనంతరం విధి నిర్వహణలో భాగంగా అక్కడే ఉన్న ఆశ వర్కర్లు ఖోఖో ఆడారు. ఈ సందర్భంగా మున్సిపల్‌ కమిషనర్‌ శైలజ వారితో కలిసి ఉత్సాహంగా ఖోఖో ఆడుతూ కనిపించారు.
–సాక్షి ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్‌   


పిల్లల్ని పలకరించి.. కలిసి భోజనం.. 

గూడూరు: మహబూబాబాద్‌ జిల్లా గూడూరు మండలం తీగలవేణి హైస్కూల్‌లో కలెక్టర్‌ కె.శశాంక విద్యార్థినులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గురువారం తీగలవేణికి హాజరైన కలెక్టర్‌ ‘మన ఊరు – మన బడి’లో ఎంపికైన జెడ్పీహెచ్‌ఎస్‌ను సందర్శించారు. మధ్యాహ్న భోజన సమయం కావడంతో పిల్లలు ప్లేట్లు పట్టుకొని బారులు తీరారు. 

కలెక్టర్‌ శశాంక వారితో మాట్లాడిన అనంతరం వంటకాలను పరిశీలించారు. ‘రోజూ రుచికరంగా వండి పెడుతున్నారా? నేను మీతో కలిసి భోజనం చేయొచ్చా’.. అని కలెక్టర్‌ కోరగా.. సార్‌... రండి అంటూ పిల్లలు ఆనందంగా స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్‌ వారితో కూర్చుని భోజనం చేశారు. ‘వంటలు బాగానే ఉన్నాయి. ఇలాగే చేయండి’.. అని అన్నారు. (క్లిక్‌: గోళీ అంత గుడ్డు.. వావ్‌.. మూన్‌!)

మరిన్ని వార్తలు