Photo Story: చెట్లన్నీ పచ్చని తివాచీలా!

14 Jul, 2021 16:11 IST|Sakshi

చుట్టూ పచ్చని చెట్లు.. దట్టమైన అడవులు.. పుడమి తల్లికి ఆకు పచ్చని చీర చుట్టినట్లే ఉంది కదూ..! అడవి మధ్య నుంచి తాచుపాము మెలికలు తిరుగుతూ వెళ్తున్నట్లు ఉన్న ఈ తారు రోడ్డు ఆదిలాబాద్‌ జిల్లా నుంచి నాగ్‌పూర్‌ వెళ్లే 44వ నంబర్‌ రహదారి. ఇటీవల కురిసిన వర్షాలకు చెట్లన్నీ ఇలా పచ్చని తివాచీలా పరుచుకుని చూపరులకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి.     
– సాక్షి ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్‌ 

ఇల్లెక్కిన రైలింజన్‌ 
మంచిర్యాల: రైలు ఇంజన్‌ ఇంటిపైకి ఎలా చేరిందా అని డౌటా? మంచిర్యాల పట్టణంలోని రెడ్డి కాలనీలో ఓ ఇంటి యజమాని రైలు ఇంజన్‌ ఆకారంలో నీళ్ల ట్యాంకు నిర్మించి దానికి అచ్చం రైలు ఇంజన్‌లాగే రంగులు వేయించి అలంకరించారు. ఇది చూసిన వారు అచ్చం రైలు ఇంజన్‌ ఇంటిపైకి ఎక్కించారా అని ఆశ్చర్యపోతున్నారు. 
– సాక్షి ఫొటోగ్రాఫర్, మంచిర్యాల 

వరదొచ్చె.. ఇసుక రవాణా నిలిచె 
స్థానికంగా కురుస్తున్న వర్షాలు, ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరదతో ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని మూసీ పరవళ్లు తొక్కుతోంది. దీంతో జాజిరెడ్డిగూడెం, వంగమర్తి, ఇటుకులపహాడ్‌ వద్ద ఉన్న ఏడు క్వారీలు బంద్‌ అయ్యాయి. దీంతో ఇసుక కోసం వచ్చిన లారీలు ఇలా బారులుదీరాయి. జాజిరెడ్డిగూడెం హైవే బైపాస్‌ నుంచి శాలిగౌరారం మండలం వంగమర్తి వరకు జాతీయ రహదారిపై 200 లారీలు నిలిచిపోయాయి. వంగమర్తి క్వారీ వద్ద కూడా లారీలు క్యూకట్టాయి.     
– అర్వపల్లి, నల్లగొండ

ఊరు బాగుండాలని.. 
ఊరంతా పచ్చగా ఉండాలని, పశుసంపద వృద్ధి చెందాలని వేడుకుంటూ రాజన్నసిరిసిల్ల జిల్లా  రుద్రంగి మండలంలోని గిరిజన తండాల్లో మంగళవారం శీత్లాభవాని వేడుకలు నిర్వహించారు. తండా పొలిమేరలో ప్రతిష్టించిన ఏడు విగ్రహాలను అలంకరించి మొక్కులు చెల్లించుకున్నారు. తండాల్లోని 900 పశువులను గుట్టపైకి తీసుకొచ్చి దేవతా విగ్రహాల ముందు నుంచి ఊరేగింపుగా తీసుకెళ్లారు.   
 –రుద్రంగి, రాజన్న సిరిసిల్ల

మొక్క.. నాటాలి పక్కా
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతిలో భాగంగా ఇంటింటికి ఆరు మొక్కలు చొప్పున పంపిణీ చేస్తున్నారు. ఇంటి ముందు పచ్చదనం వెల్లివిరిసేలా ఈ మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచిస్తున్నారు. పట్టణ ప్రగతి మొదటి రోజు నుంచి ఇప్పటివరకు ఆదిలాబాద్‌ పట్టణంలో 3 లక్షల మొక్కలు పంపిణీ చేసినట్లు మున్సిపల్‌ అధికారులు తెలిపారు. గులాబీ, చామంతి, ఎర్రమందారం, మల్లెపువ్వు, బంతి తదితర రకాల పూల మొక్కలను మున్సిపల్‌ వాహనంలో ఇంటింటికీ తీసుకెళ్తూ అందచేస్తున్నారు. ఆదిలాబాద్‌ పట్టణంలోని భుక్తాపూర్‌ కాలనీలో కనిపించిన దృశ్యమిది.
– సాక్షి ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్‌

మరిన్ని వార్తలు