పుట్టు మూగ, చెవిటి దివ్యాంగుడు.. అయినా అందని పింఛన్‌

17 Aug, 2021 12:53 IST|Sakshi
సదరం కార్డును చూపిస్తున్న నర్సయ్య

సాక్షి, మరిపెడ (వరంగల్‌): చిన్నగూడూరు మండలం విస్సంపల్లి గ్రామానికి చెందిన కోల నర్సయ్యకు పుట్టుకతోనే మూగ, చెవుడు ఉంది. ఇతడికి జూన్‌ 7, 2011లో జీవితకాలం సదరం సర్టిఫికెట్‌ జారీ చేసిన గత ప్రభుత్వ హయాంలో నెల నెలా రూ.200 పింఛన్‌ డబ్బులు అంజేశారు. ఈ క్రమంలో దివ్యాంగుడి తల్లిదండ్రులు ఇద్దరూ మృత్యువాత పడ్డారు. తల్లిదండ్రులు మృతి చెందడంతో వివాహం కాని ఇతడి బాగోగులు చూసుకునేవారు కరువయ్యారు.

దీంతో ఊరూరు తిరుగుతూ బంధువుల ఇళ్లల్లో కొద్ది రోజుల పాటు తలదాచుకుంటూ వచ్చాడు. దివ్యాంగుడు నర్సయ్య గ్రామంలో లేని కారణంగా ఇతడికి వచ్చే పింఛన్‌ను అధికారులు కొట్టివేశారు. బంధువులు కూడా సాకలేమనడంతో 6 సంవత్సరాల క్రితం తిరిగి స్వగ్రామమైన విస్సంపల్లి చేరుకున్నాడు. నా అనేవారు లేక పోవడంతో కూలీ పనులు చేసుకుంటూ ఒంటరిగా బతికీడుస్తున్నాడు. అప్పటి నుంచి తన దగ్గర ఉన్న జీవిత కాలం దివ్యాంగుడి సర్టిఫికెట్‌ పట్టుకొని అధికారులు, పాలకుల చుట్టూ ప్రదక్షణలు చేసినా ఎవరూ కనికరం చూపలేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పింఛన్‌ అందించి ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.  

మరిన్ని వార్తలు