అంచనా లోపమే శాపం!

24 Jul, 2020 02:46 IST|Sakshi

కరోనాను తక్కువగా అంచనా వేయడంతోనే వైద్యుల మరణాలు

దేశంలో 108 మంది డాక్టర్ల మృతిపై అధ్యయనంలో వెల్లడి

భద్రత, భౌతిక దూరం పాటించకపోవడం, నిరూపితం కాని మందులు వాడటం

కరోనా రోగులకు ఆపరేషన్‌ చేయడమూ మరణాలకు కారణాలే..

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో కరోనా బెంబేలెత్తిస్తోంది. గత ఐదు నెలల్లో ఈ వైరస్‌ కారణంగా వంద మందికి పైగా వైద్యులు మరణించారు. కరోనా పట్ల అవగాహన లేక ఆ మహమ్మారిని చిన్న విషయంగా భావించడం, తగు రక్షణ చర్యలు తీసుకోకపోవడం, భౌతిక దూరం వంటి మార్గదర్శకాలను విస్మరించడం, పీపీఈ కిట్లను ఉపయోగించడంలో వైఫల్యం, నిరూపితం కాని మందులు తీసుకోవడం వంటివి ఆయా డాక్టర్ల మరణాలకు కారణమని తేలింది. అలాగే ఇతరత్రా తీవ్రమైన వ్యాధులు కలిగి ఉండటం, ఆసుపత్రి వెలుపల తగు జాగ్రత్తలు తీసుకోకపోవడం కూడా కారణమని నిర్ధారించారు.

‘ఏ హండ్రెడ్‌ లైవ్స్‌ లాస్ట్‌: డాక్టర్‌ డెత్స్‌ ఇన్‌ ఇండియా టైమ్స్‌ ఆఫ్‌ కోవిడ్‌–19’అనే అంశంపై ఓ అధ్యయనం జరిగింది. దానిపై డాక్టర్‌ రాజీవ్‌ జయదేవన్‌ అనే నిపుణుడు దేశంలో 108 మంది డాక్టర్ల మరణాల నుంచి నేర్చుకున్న పాఠాల పేరుతో తాజాగా ఒక అధ్యయన పత్రాన్ని విడుదల చేశారు. దాని ప్రకారం మరణించిన వారి సగటు వయసు 55గా ఉండటం గమనార్హం. ఒక 22 ఏళ్ల యువ వైద్యుడు ఆత్మహత్య కూడా చేసుకున్నాడు. ఇక చనిపోయిన నర్సుల సగటు వయస్సు 42.7 ఏళ్లు. వారిలోనూ ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు.

ఆ డాక్టర్ల మరణాలకు కారణమేంటి?
ఇక డాక్టర్ల మరణాలకు తరచుగా పీపీఈ కిట్ల వాడకంపైనే దృష్టి పెట్టి చర్చిస్తాం. కానీ అనేక కారణాలున్నాయని గుర్తించాలి. పై వాటితోపాటు ఇతర అంశాలు కూడా కారణాలుగా నిలుస్తున్నాయి. ఇన్ఫెక్షన్‌ కంట్రోల్‌ కమిటీ, ట్రయాజ్, క్రౌడ్‌ కంట్రోల్, టెలిమెడిసిన్, ఆడిట్స్, పీపీఈల లభ్యత, వాటి నాణ్యత, వెంటిలేషన్‌ సౌకర్యం లేని భవనాల్లో వైద్య సేవలు అందించడం, ఏరోసోల్‌ వ్యాప్తిని నిరోధించడానికి తీసుకునే చర్యలు కూడా కారణంగా ఉంటున్నాయి. అలాగే వారిలో ఏర్పడే మానసిక ఒత్తిడిని సక్రమంగా నిర్వహించడంలో వైఫల్యం కూడా కనిపిస్తుంది. 
► కరోనా రోగికి ఆపరేషన్‌ చేయడం వల్ల సర్జన్, అనస్థీషియన్, ఇతర సహాయకులకు కరోనా వ్యాప్తి ప్రమాదం ఉంటుంది. 
► లక్షణాలు లేని కరోనా పాజిటివ్‌ సహోద్యోగి నుంచి కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సహోద్యోగులు దగ్గరగా ఉండి మాట్లాడేటప్పుడు ఇది జరుగుతుంది.
► ఆపరేషన్‌ థియేటర్లలో నిర్దిష్ట ప్రొటోకాల్‌ను పాటించడం లేదు. అధిక రిస్క్‌ ఎక్స్‌పోజర్‌ ప్రాంతాల్లో సిబ్బంది సంఖ్యను అపరిమితంగా ఉంచడం వల్ల కూడా వ్యాప్తి చెందుతుంది.
► రోగులకు నిర్దిష్ట సమయాలు లేవు. ఇతర వైద్య సిబ్బంది భౌతిక దూరం, చేతి పరిశుభ్రతను అమలు చేయడం లేదు. ఎగ్జాస్ట్‌ ఫ్యాన్లు ఉండటం లేదు. కన్సల్టింగ్‌ గదులు ఇరుకుగా, తక్కువ వెంటిలేషన్‌తో ఉంటున్నాయి. 
► నర్సులు, ఫార్మసిస్ట్‌లు, సాంకేతిక నిపుణులు, ఫిజియోథెరపిస్టులు, అంబులెన్స్‌ డ్రైవర్లు, హౌస్‌ కీపింగ్, సెక్యూరిటీ సిబ్బంది, బిల్లింగ్, రిసెప్షన్‌ సిబ్బంది ఇతరుల నుంచి వైరస్‌ వ్యాప్తికి గురవుతుంటారు.
► వైద్యులు తమ సంస్థల్లో పనిచేస్తున్న సిబ్బందిని రక్షించడానికి నాయకత్వ పాత్ర పోషించడంలో చాలా చోట్ల వైఫల్యం కనిపిస్తుంది. ఫోన్లలో మాట్లాడటం, వీడియో కాల్‌ ద్వారా వారికి తగిన ఆదేశాలు ఇవ్వడంలో వైఫల్యం కనిపిస్తుంది. 
► కొన్ని చోట్ల సుదీర్ఘ సమావేశాలు జరుగుతున్నాయి. అత్యంత ఇరుకైన గదుల్లో నిర్వహించడం వల్ల సూక్ష్మ బిందువుల ద్వారా వైరస్‌ వ్యాప్తి చెందుతుందని తెలుసుకోవడం ముఖ్యం. కానీ చాలాచోట్ల వైద్యులు, ఉన్నత స్థాయి అధికారులు వీటిని పట్టించుకోవడం లేదు. 
► బాగా కనిపించే సహోద్యోగి లేదా స్నేహితుడు వైరస్‌ను మోస్తున్నారని తెలుసుకోవడంలో వైఫల్యం కనిపిస్తుంది. 
► ఇక ఇతరులతో కారులో ప్రయాణించేటప్పుడు ఏసీలు వేసుకొని ప్రయాణిస్తుంటారు. గ్లాసులు దించరు. 
► దేశంలో కరోనా కారణంగా ఇప్పటివరకు 138 మంది ఆరోగ్య కార్యకర్తల మరణాలు సంభవించాయి. వాటిలో ఆత్మహత్యలు కూడా ఎక్కువగా ఉంటున్నాయి. మానసిక ఒత్తిడి ఉంటే కౌన్సెలింగ్‌ చేయాల్సిన అవసరముంది. మానసిక, శారీరక అలసట రోడ్డు ప్రమాదాలకు దోహదం చేస్తుంది. అలాంటి కారణాలతో ముగ్గురు వైద్యులు, ఇద్దరు నర్సులు, ఒక అంబులెన్స్‌ డ్రైవర్‌ ప్రమాదాల్లో మరణించారు. 
► ఆసుపత్రుల్లో సాధారణ పడకలు, ఐసీయూలు అందుబాటులో లేకపోవడం వల్ల తీవ్ర అనారోగ్యంతో ఉన్న పలువురు వైద్యులకు చికిత్స చేయలేని పరిస్థితి ఏర్పడింది. అనేక సందర్భాల్లో వారు పడకల కోసం ఇతర ఆసుపత్రులకు వెళ్లాల్సి వచ్చింది. 
► కరోనాతో దేశంలో ఒక డాక్టర్, అతని భార్య చనిపోయారు. వీరు 60 ఏళ్లలోపువారే.

ఏం చేయాలి? 
► చాలా మంది లక్షణాలు లేకుండా వైరస్‌ను వ్యాప్తి చేస్తారు. ఈ ప్రమాదాన్ని అంచనా వేయడంలో సిబ్బందికి సెంటినెల్‌ పరీక్ష అవసరం. సెంటినెల్‌ టెస్టింగ్‌ అనేది లక్షణాలు లేనప్పుడు, అధిక రోగులున్న ఆసుపత్రుల్లో పనిచేస్తున్న వైద్య సిబ్బందికి అవసరం. సెంటినెల్‌ పరీక్ష లేకుండా వైరస్‌ వ్యాప్తిని అంచనా వేయడం అసాధ్యం.
► ఆపరేషన్‌ సమయంలో సిబ్బంది ప్రామాణిక కరోనా ప్రొటోకాల్‌ను అనుసరిస్తే వైరస్‌ వ్యాప్తిని నివారించవచ్చు.
► ప్రారంభ లక్షణాలు తేలికపాటివి అయినప్పటికీ, ఏదైనా తీవ్రతరం కావడానికి జాగ్రత్తగా పర్యవేక్షణ అవసరం. లేకుంటే సీరియస్‌ అయ్యే ప్రమాదముంది. 
► ఇది కొత్త వ్యాధి కాబట్టి, ఇతర అనారోగ్యాలకు దీనికి తేడా ఉంది. గత అనుభవాల ఆధారంగా మాత్రమే చికిత్స చేయమని పట్టుబట్టకుండా, తాజా మార్గదర్శకాలను అనుసరించాలి. 
► అనేక మంది డాక్టర్లు, వైద్య సిబ్బంది మహమ్మారిని తక్కువ చేసి చూస్తున్నారు. అటువంటి వైఖరి ఉన్న వ్యక్తులు తమకు మాత్రమే కాదు, సహోద్యోగులకు, కుటుంబానికి, సమాజానికి అన్యాయం చేసినట్లే.. మహమ్మారి ఒక బూటకమని, భౌతికదూరం అనవసరం అని నమ్ముతూ సమాజాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. 5 నెలల్లో వంద మందికిపైగా డాక్టర్లు దేశంలో మరణించారనేది వాస్తవం. దీన్ని గుర్తుంచుకోవాలి. 
► అత్యధిక జనాభా కలిగిన దేశంలో రోగుల రద్దీ అనివార్యమే. అందువల్ల టోకెన్, అపాయింట్‌మెంట్‌ సిస్టమ్‌ను అందుబాటులోకి తీసుకురావాల్సి ఉంది. టెలిమెడిసిన్, వైద్యులకు షిఫ్ట్‌ల వారీగా పనిచేయించడం అవసరం. కానీ చాలాచోట్ల ఇవి అమలు కావడం లేదు. 

మరిన్ని వార్తలు