వారు రైతు వ్యతిరేకులు

25 Mar, 2022 01:45 IST|Sakshi

కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ ధ్వజం

ధాన్యం కొనుగోలుపై తప్పుదోవ పట్టిస్తున్నారు

కొందరివి తప్పుడు ఆరోపణలు

కేంద్రంతో ఒప్పందం ప్రకారం తెలంగాణ పనిచేయాలి

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వమని, ధాన్యం సేకరణ విషయంలో తప్పుదోవ పట్టిస్తోందని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాలశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ ఆరోపించారు. తెలంగాణలోని కొందరు నాయకులు తప్పుడు వ్యాఖ్యలు, అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ధాన్యం విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఆలోచనలు పారదర్శకంగా ఉంటే, నిజంగా రైతులకు మేలు చేయాలని తలిస్తే తమ బాధ్యతను నిజాయితీగా నిర్వర్తించాలని కోరారు. గురువారం తెలంగాణ మంత్రుల బృందంతో జరిగిన సమావేశం అనంతరం పార్లమెంట్‌ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు.  

నాణ్యత మేరకు అదనపు నిల్వల కొనుగోలు 
కేంద్రం చేయాల్సిన పనిని ఎలాంటి భేదభావాలు లేకుండా తప్పకుండా పూర్తి చేస్తుందని తెలంగాణ రైతులకు పీయూష్‌ భరోసా ఇచ్చారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో పంజాబ్‌లో అనుసరిస్తున్న విధానమే తెలంగాణలోనూ అమలు చేస్తామని స్పష్టం చేశారు. ధాన్యం సేకరణ అంశంలో తెలంగాణ ప్రభుత్వం తమతో చేసుకున్న ఒప్పందం ప్రకారం పని చేయాలని సూచించారు. తెలంగాణ నుంచి నాణ్యతా ప్రమాణాల ప్రకారం అదనపు నిల్వలను కొనుగోలు చేసేందుకు కేంద్రం కట్టుబడి ఉందని పీయూష్‌ చెప్పారు.  

ఆరేళ్ళలో ఏడు రెట్లు పెరిగిన ఎమ్మెస్పీ చెల్లింపులు
2014–15లో తెలంగాణ రైతులకు వరికి రూ.3,391 కోట్లు కనీస మద్దతు ధరగా చెల్లించామని, ఇది ఆరేళ్ళలో ఏడు రెట్లు పెరిగిందని, 2020–21 ఖరీఫ్‌ పంట కాలంలో రూ.26,610 కోట్లు ఎమ్మెస్పీగా చెల్లించినట్లు చెప్పారు. కాగా ‘తెలంగాణలో ఏవైనా అదనపు నిల్వలు ఉంటే, వాటి స్వంత వినియోగం తర్వాత, ముడి బియ్యం రూపంలో, కేంద్రంతో ఎంఓయూ ప్రకారం, ఎఫ్‌సీఐ పేర్కొన్న నాణ్యత ప్రకారం కొనుగోలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి లిఖితపూర్వకంగా కట్టుబడి ఉంది.. ’అని గోయల్‌ పేర్కొన్నారు. 

ముడిబియ్యం  ఎంత ఇచ్చేదీ చెప్పలేదు 
తెలంగాణలో ధాన్యం సేకరణ విషయమై జరుగుతున్న ప్రచారం సత్యదూరమని, దేశంలో ఉన్న డిమాండ్‌ మేరకు కేంద్రానికి ముడి బియ్యం అందజేస్తామని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసిందని కేంద్రమంత్రి పేర్కొన్నారు. బియ్యం సేకరణపై చర్చించేందుకు 2022 ఫిబ్రవరి 25న ఆహార, ప్రజాపంపిణీ శాఖ కార్యదర్శి సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన గుర్తుచేశారు. అన్ని రాష్ట్రాలను నిర్దిష్ట ఫార్మాట్‌ను ఇవ్వాలని కోరగా, తెలంగాణ ప్రభుత్వం ఫార్మాట్‌ను సమర్పించలేదని చెప్పారు. ఈ నెల 8వ తేదీన ఇదేశాఖ జాయింట్‌ సెక్రటరీ అధ్యక్షతన జరిగిన మరో సమావేశంలోనూ ముడిబియ్యం ఎంత ఇస్తామన్న విషయాన్ని తెలంగాణ చెప్పలేదన్నారు. మరోవైపు ప్రస్తుత రబీ పంటలో సెంట్రల్‌ పూల్‌కు తన వాటాగా అందించే ముడిబియ్యం మొత్తాన్ని తెలంగాణ ప్రభుత్వం ఇంకా ఇవ్వలేదని ఆయన తెలిపారు. అన్ని రాష్ట్రాల మాదిరిగానే తెలంగాణ నుంచి ముడిబియ్యం సేకరిస్తామన్నారు.   

మరిన్ని వార్తలు