ఏమవుతోందో ఏమో!

26 Apr, 2022 03:21 IST|Sakshi

పీకే ఎపిసోడ్‌తో కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తల్లో గందరగోళం

సీఎం కేసీఆర్‌తో ప్రశాంత్‌ కిశోర్‌ మంతనాలపై కేడర్‌లో చర్చ 

టీఆర్‌ఎస్‌తో తెగదెంపులు చేసుకునేందుకే అంటున్న నేతలు

ఎవరేం చెప్పినా లోపల టెన్షన్‌.. మే 6న రాహుల్‌ సభలో స్పష్టత!

సాక్షి, హైదరాబాద్‌: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ (పీకే) వ్యవహారం తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీకి తలనొప్పిగా మారింది. ఆయన కాంగ్రెస్‌ పార్టీలో చేరతారనే ప్రచారం నేప థ్యంలో రాష్ట్రానికి వచ్చిన పీకే రెండురోజుల పాటు సీఎం కేసీఆర్‌తో మంతనాలు జరపడం, టీఆర్‌ఎస్‌తో కలిసి పనిచేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారన్న వార్తలు రావడంతో ఆ పార్టీ కేడర్‌లో గందరగోళం నెలకొంది. పీకే కాంగ్రెస్‌లో చేరి ఆయనకు చెందిన ఐ ప్యాక్‌ సంస్థ టీఆర్‌ఎస్‌తో కలిసి పనిచేస్తే రా ష్ట్రంలో పార్టీ పరిస్థితి ఏంటనేది ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్‌ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.  

తేలేవరకూ టెన్షనే.. 
పీకే, టీఆర్‌ఎస్‌ల మధ్య ఎలాంటి ఒప్పందం ఉండబోదని రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నప్పటికీ అది పూర్తిస్థాయిలో ధ్రువీకరణ అయ్యేవరకు నమ్మే పరిస్థితి లేదని క్షేత్రస్థాయి కేడర్‌ భావిస్తోంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డితో పాటు పలువురు పార్టీ నేతలు కూడా ఈ విషయంలో పలు రకాలుగా స్పందిస్తున్నారు.

ఆ ఇద్దరు నేతలు సోమవారం మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్‌తో తెగదెంపులు చేసుకునేందుకే పీకే రాష్ట్రానికి వచ్చారని చెప్పారు. ఒకవేళ ఆయన కాంగ్రెస్‌లో చేరితే ఎట్టి పరిస్థితుల్లోనూ టీఆర్‌ఎస్‌తో కలిసి పనిచేయరని, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలు పు కోసమే ఆయన పనిచేస్తారని కొందరు నేత లు చెబుతున్నారు. సీఎల్పీ నేత భట్టి మాత్రం ఇది టీఆర్‌ఎస్, బీజేపీల కుమ్మక్కు రాజకీయానికి నిదర్శనమని అంటూనే పీకే విషయంలో అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా శిరసావహిస్తామని మీడియాతో చెప్పారు. రాష్ట్ర స్థాయి నేతలు పైకి ఏం చెబుతున్నా లోలోపల మాత్రం వారిలో కూడా ఆందోళన వ్యక్తమవుతోందనేది బహిరంగ రహస్యం.  

ఏమీ అర్ధం కావడం లేదు.. 
క్షేత్రస్థాయిలో మాత్రం ఎవరికీ ఏమీ అంతుపట్టడం లేదు. అసలేం జరుగుతుందో అర్థం కావడం లేదని జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి నాయకులు అంటున్నారు. మరోవైపు కాంగ్రెస్‌ అధిష్టానం సోమవారం ఢిల్లీలో సమావేశమైనప్పటికీ పీకే చేరే అంశంపై ఏమీ తేల్చకుండా సమావేశం ముగించడం గందరగోళాన్ని మరింత పెంచింది. ఏది ఏమైనా వరంగల్‌లో జరిగే బహిరంగ సభలో రాహుల్‌ గాంధీ చెప్పే  విధానాన్ని బట్టి స్పష్టత వస్తుందని కాంగ్రెస్‌ కేడర్‌ భావిస్తోంది. 

మరిన్ని వార్తలు