మళ్లీ అలజడి ..అన్నల అమ్ములపొదిలో విదేశీ ఆయుధాలు 

6 Dec, 2022 03:37 IST|Sakshi
మావోయిస్టులకు  వ్యతిరేకంగా వెలసిన పోస్టర్లు   

ఈ నెల 2 నుంచి 8 వరకు పీఎల్‌జీఏ వారోత్సవాలు 

తెలంగాణలో ముగింపు ఉత్సవాలకు మావోయిస్టుల ప్లాన్‌ 

అప్రమత్తమైన ఇంటెలిజెన్స్‌.. మూడు రాష్ట్రాల సరిహద్దుల్లో పోలీసు బలగాలు 

గోదావరి నది వెంట తెలంగాణ గ్రేహౌండ్స్‌ గస్తీ 

సాక్షిప్రతినిధి, వరంగల్‌: అడవుల్లో మళ్లీ అలజడి నెలకొంది. సీపీఐ(మావోయిస్టు) పీఎల్‌జీఏ(పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ) వారోత్సవాల నేపథ్యంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య యుద్ధవాతావరణం ఏర్పడింది. కొయ్యూరు ఎన్‌కౌంటర్‌ స్మృత్యార్థం వారోత్సవాలను ఈ నెల 2 నుంచి 8 వరకు నిర్వహించాలని మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. దీంతో వారం ముందు నుంచే తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల సరిహద్దులో ఓవైపు పోలీసుల గాలింపు, మరోవైపు మావోయిస్టుల చర్యలు అడవిలో కలకలం రేపుతున్నాయి.

వారోత్సవాలను విజయవంతం చేయాలని లేఖలు, కరపత్రాలు, పోస్టర్ల ద్వారా మావోయిస్టులు విస్తృతంగా ప్రచారం చేయగా, ‘అమాయక ఆదివాసీలను అంతం చేసే మావోయిస్టులు’అంటూ వారికి వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. కాగా, మరో రెండు/రోజుల్లో ముగిసే పీఎల్‌జీఏ వారోత్సవాలను తెలంగాణలో నిర్వహించాలన్న మావోయిస్టుల ప్లాన్‌ను పసిగట్టిన ఇంటెలిజెన్స్‌ పోలీసులను అప్రమత్తం చేసింది. దీంతో సోమవారం సాయంత్రం నుంచి మూడు రాష్ట్రాల సరిహద్దుల్లో భారీగా బలగాలను మోహరించారు. పూర్వ వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల సరిహద్దు, గోదావరి పరీవాహక ప్రాంతంలో తెలంగాణ గ్రేహౌండ్స్‌ పహారా కాస్తోంది.  

అడవులు జల్లెడ.. అరెస్టులు, ఎన్‌కౌంటర్లు..  
జేఎస్‌ భూపాలపల్లి, ములుగు, పెద్దపల్లి, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, కుమురంభీమ్, ఆసిఫాబాద్‌ జిల్లాలను ఆనుకుని ఉన్న గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలు ఉన్నాయన్న సమాచారం మేరకు పోలీసులు నిఘా వేశారు. ఈ సందర్భంగా నెలరోజుల వ్యవధిలో వివిధ ప్రాంతాల్లో 22 మంది మావోయిస్టులను అరెస్టు చేయగా, 31 మంది లొంగిపోయినట్లు ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు ప్రకటించారు.

ఇదే సమయంలో ఇటీవల బాలాఘాట్‌ జిల్లా సరిహద్దులో జరిగిన ఎన్‌కౌంటర్‌లో జీఆర్‌బీ, కేబీ డివిజన్‌ కోఆర్డినేషన్‌ టీం ఇన్‌చార్జి గణేశ్‌ మరావి(35), భోరమ్‌దేవ్‌ కమిటీ పీఎల్‌–2 కమాండర్‌ రాజేశ్‌ మృతి చెందగా, ఓ మహిళామావోయిస్టు తప్పించుకున్నారు. బీజాపూర్‌ జిల్లాలో భద్రతాబలగాలు–మావోయిస్టు దళాల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు డివిజనల్‌ కమిటీ సభ్యుడు మోహన్‌ కడ్తి(40), మట్వారా ఎల్‌వోఎస్‌ సభ్యుడు రమేశ్‌(32), మహిళా మావోయిస్టునేత సుమిత్ర (28), మరో మహిళా మావోయిస్టు మృతి చెందారు. ములుగు జిల్లా వాజేడు మండలం జగన్నాథపురం క్రాస్‌రోడ్డు వద్ద సోమవారం వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులకు ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించడంతో ప్రశ్నించగా మావోయిస్టు కొరియర్‌గా తేలింది. దీంతో అతన్ని అరెస్ట్‌ చేశారు.  

అన్నల అమ్ములపొదిలో విదేశీ ఆయుధాలు 
నిత్యనిర్బంధంలోనూ మావోయిస్టులు విదేశీ ఆయుధాలను వాడుతుండటం మూడు రాష్ట్రాల పోలీసులను విస్మయానికి గురిచేస్తోంది. తెలంగాణలో 1978లో మొదట తపంచాతో మొదలైన సాయుధీకరణ ఏకే–47, ఎల్‌ఎంజీల వరకు వెళ్లగా, ప్రస్తుతం అమెరికా, రష్యా మేడ్‌ ఆయుధాలను వాడుతుండటం గమనార్హం. మొదట పూర్వ కరీంనగర్‌ జిల్లా జగిత్యాల డివిజన్‌లో జరిగిన ఓ ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన అగ్రనేత పులి రాములు వద్ద ఏకే–47 తుపాకీ పోలీసులకు లభించింది.

కాగా, ఇటీవల ఛత్తీస్‌గఢ్‌ బీజాపూర్‌ జిల్లాలో భద్రతాబలగాలు– మావోయిస్టు దళాల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. అక్కడ నాలుగు ఆయుధాలు, పేలుడు సామగ్రి, కిట్‌ బ్యాగులు, విప్లవ సాహిత్యం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో ఒకటి అమెరికాలో తయారైన ఎం1 కార్బైన్‌ తుపాకీ కూడా ఉంది. ఈ నేపథ్యంలో పీఎల్‌జీఏ వారోత్సవాలు మరో రెండు రోజులే ఉన్న సందర్భంగా మావోయిస్టులు అధునాతన ఆయుధసంపత్తిని కూడా ఉపయోగించే అవకాశముందన్న సమాచారం మేరకు గ్రేహౌండ్స్, పారా మిలటరీ బలగాలు మూడు రాష్ట్రాల సరిహద్దు, గోదావరి పరీవాహక ప్రాంతంలో మోహరించడం కలకలం రేపుతోంది.

మరిన్ని వార్తలు