పీఎం కేర్‌ నిధులతో  1.5 లక్షల ఆక్సీమీటర్లు 

13 May, 2021 04:42 IST|Sakshi

లక్ష సాధారణ మీటర్లు.. మిగతావి ఆటోమేటిక్‌.. 

ఆటోమేటిక్‌ ఆక్సీమీటర్లతో 30–40 శాతం ఆక్సిజన్‌ ఆదా 

సాక్షి, హైదరాబాద్‌: కరోనా బాధితులు ఎదుర్కొంటున్న ఆక్సిజన్‌ సమస్యను తీర్చేందుకు డీఆర్‌డీవో బృహత్తర కార్యక్రమం చేపట్టింది. బాధితుల శరీరంలోని మోతాదులకు అనుగుణంగా ఆక్సిజన్‌ సరఫరాను సరిచేసుకోగల టెక్నాలజీ ఉన్న ఆక్సిజన్‌ వ్యవస్థలను సేకరించనుంది. దాదాపు 1.5 లక్షల ఈ వ్యవస్థలను అందుబాటులోకి తేనుంది. పీఎం కేర్స్‌ నిధుల నుంచి రూ.322.5 కోట్లతో కొనుగోలు చేసేందుకు అనుమతులు లభించినట్లు డీఆర్‌డీవో బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ వ్యవస్థను కొద్ది నెలల కిందట డీఆర్‌డీవోలోని డెబెల్‌ సంస్థ ఆక్సికేర్‌ పేరుతో స్వయంగా అభివృద్ధి చేసింది. ఎత్తయిన ప్రాంతాల్లో పనిచేసే సైనికుల కోసం అభివృద్ధి చేసిన ఈ ఆక్సికేర్‌ వ్యవస్థలను కరోనా చికిత్సకు సమర్థంగా ఉపయోగించొచ్చని తెలిపింది.

ఈ 1.5 లక్షల ఆక్సికేర్‌ యూనిట్లలో లక్ష యూనిట్లు సాధారణమైనవి కాగా.. మిగిలినవి ఆటోమేటిగ్గా పనిచేసేవి. సాధారణ ఆక్సికేర్‌ యూనిట్‌లో 10 లీటర్ల ఆక్సిజన్‌ సిలిండర్, పీడన, ప్రవాహాలను నియంత్రించే కంట్రోలర్, తేమను చేర్చే హ్యుమిడిఫయర్, ముక్కుకు అనుసంధానించుకునే నాసల్‌ క్యానులా ఉంటాయి. రక్తంలోని ఆక్సిజన్‌ మోతాదుకు అనుగుణంగా కంట్రోలర్‌ సాయంతో ఆక్సిజన్‌ను విడుదల చేయాల్సి ఉంటుంది. ఆటోమేటిక్‌ ఆక్సీమీటర్‌లో ఎలక్ట్రానిక్‌ కంట్రోల్స్‌ ఏర్పాటు చేశా రు. ఇందులో రక్తంలోని ఆక్సిజన్‌ మోతాదు గుర్తిం చి లెక్కకట్టేందుకు ఓప్రోబ్‌ ఉంటుంది.

ప్రోబ్‌ గుర్తిం చిన ఆక్సిజన్‌ మోతాదులకు అనుగుణంగా ఎలక్ట్రానిక్‌ కంట్రోల్‌ ఆక్సిజన్‌ విడుదలను నియంత్రిస్తుంది. ఈ ఆటోమేటిక్‌ ఆక్సీమీటర్‌ వినియోగం ద్వారా  అవసరమైనంత మాత్రమే ఆక్సిజన్‌ను అందిం చొచ్చు. ఆక్సిజన్‌ను 30 నుంచి 40 శాతం ఆదా చేయొచ్చని డీఆర్‌డీవో వివరించింది. పరిమితులను ముందుగానే నిర్ధారించడం ద్వారా ఈ ఆక్సీ మీటర్లను ఉపయోగిస్తున్న రోగులను నిత్యం పర్యవేక్షించాల్సిన అవసరం తగ్గుతుంది. ఈ ఆక్సీమీటర్‌ పనిచేయని పక్షంలో అలారం మోగి, వైద్య సిబ్బందిని హెచ్చరిస్తుంది. ఇళ్లు, క్వారంటైన్‌ సెంటర్లు, కోవిడ్‌ చికిత్స అందిస్తున్న ఆసుపత్రులన్నింటిలోనూ వీటిని వాడుకోవచ్చని వివరించింది.  

>
మరిన్ని వార్తలు