PM Kisan-eKYC: ఈ-కేవైసీ నమోదులో కొత్త సమస్యలు.. ఆధార్‌కు లింకు కాని ఫోన్‌ నంబర్లు

14 May, 2022 11:07 IST|Sakshi

ఈ నెల 31తో ముగియనున్న గడువు

క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పిస్తేనే ఉపయోగం 

నర్వ (నారాయణ్‌పేట్‌ జిల్లా): రైతులకు పెట్టుబడి సాయంగా ఏడాదికి రూ.6 వేలను మూడు విడతల్లో అందిస్తున్న ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకంలో నమోదైన రైతులు తప్పనిసరిగా ఈ నెలాఖరులోగా ఈకేవైసీని చేయించుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించింది. దేశంలోని పలు రాష్ట్రాల్లో లక్షల సంఖ్యలో బోగస్‌ పేర్లను లబ్ధిదారులుగా నమోదు చేసుకుని గత సీజన్లలో నిధులను కాజేసిన వైనాన్ని కేంద్రం గుర్తించగా.. ఈ సీజన్‌లో అర్హులను గుర్తించేందుకు ఈకేవైసీని తప్పనిసరి చేసింది.

కాగా గడువు ఈ నెల 31 వరకే ముగుస్తున్నా జిల్లాలో ఈకేవైసీ నామమాత్రంగా సాగుతోంది. ఇప్పటి వరకు జిల్లాలో కేవలం 10 శాతం మాత్రమే నమోదైంది. ఈకేవైసీని పూర్తి చేసిన రైతులకు మాత్రమే ప్రస్తుతం రూ.2 వేల చొప్పున చెల్లింపులు చేయాలని లేదా నమోదు పూర్తికాకుంటే ఈ సీజన్‌ నుంచి నిధులను నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు జిల్లా వ్యవసాయాధికారి జాన్‌సుధాకర్‌ తెలిపారు.  
చదవండి👉 ‘ఇలాంటి ఫథకం దేశంలో ఎక్కడా లేదు’

అనుసంధానం ఇలా.. 
రైతులు ముందుగా పీఎం కిసాన్‌ పథకం వివరాలిచ్చిన తమ బ్యాంకు ఖాతాకు ఆధార్‌కార్డును అనుసంధానించుకోవాలి. తదుపరి ఆధార్‌ కార్డుకు ఫోన్‌ నంబర్‌ను అనుసంధానించాలి. అనంతరం పీఎం కిసాన్‌ పోర్టల్‌లో ఆధార్‌ ఆధారితంగా ఈకేవైసీ చేస్తున్నప్పుడు ఫోన్‌ నంబర్‌కు వచ్చే ఓటీపీ సంఖ్యను తిరిగి నమోదు చేస్తేనే ఈకేవైసీ పూర్తవుతుంది. సెల్‌ఫోన్‌లో పీఎం కిసాన్‌ యాప్‌ ద్వారా లేదా కంప్యూటర్‌లో పోర్టల్‌ ద్వారా రైతులే ఈకేవైసీని చేసుకోవచ్చు.

లేదా కామన్‌ సర్వీస్‌ సెంటర్లలో సైతం ఈకేవైసీని పూర్తి చేయించాలి. ఆధార్‌ ద్వారా ఈ కేవైసీని పూర్తి చేసిన అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాలకు నిధులు విడుదల చేస్తారు. బోగస్‌ రైతులు జాబితా నుంచి తొలగించబడతారు. 2018లో పథకం ప్రారంభించిన దగ్గర నుంచి 10 విడతలుగా నిధులను విడుదల చేయగా ప్రస్తుతం ఏప్రిల్‌లోనే 11వ విడతకు సంబంధించి ఈ దఫా నిధులు ఇవ్వాల్సి ఉండగా ఈకేవైసీతో ఈ నెలాఖరులోగా లేదా జూన్‌ మొదటి వారంలో నిధులు విడుదల చేసే అవకాశం ఉంది. 

అవగాహన కల్పించరూ.. 
ఆధార్‌ అనుసంధానం, ఈకేవైసీ చేసుకోవడం గురించి చాలా మంది రైతులకు తెలియదు. ఇవి చేసుకోలేకనే ఎంతో మంది రైతులు ఇప్పటికీ ఎన్నో ప్రభుత్వ పథకాలకు నోచుకోలేకపోతున్నారు. తాజాగా ఈకేవైసీ తప్పనిసరి చేసింది. కానీ, క్షేతస్థ్రాయిలో ఈ విషయమే చాలా మంది రైతులకు తెలియదు. తెలిసిన వారు వెళ్లినా మీ సేవా కేంద్రాల్లో సాంకేతిక సమస్యలు, ఆధార్‌కు ఫోన్‌ నంబర్‌ లింకు లేకపోవడం వంటి కారణాలతో మళ్లీ మళ్లీ తిరగాల్సి వస్తుంది. ప్రస్తుతం వ్యవసాయాధికారులు ధాన్యం నాణ్యత ధ్రువీకరణ పనుల్లో నిమగ్నమై ఉండగా ఈకేవైసీని పూర్తిచేయించేందుకు రైతులకు అవగాహన కల్పించలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ఈకేవైసీని పూర్తి చేయని రైతులకు నిధులు నిలిచిపోనున్నందున రైతులందరూ ఈకేవైసీని పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. 
చదవండి👉🏻 గడువు 31 వరకే.. ఈ–కేవైసీ తప్పనిసరి.. ఇలా నమోదు చేసుకోండి

నమోదు చేసుకోండి 
పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకం కోసం రైతులు ఈ నెల 31లోగా నమోదు చేసుకోవాలి. ఇప్పటి వరకు జిల్లాలోని అన్ని మండలాల్లో ఈకేవైసీ నమోదు చాలా తక్కువగా ఉంది. ఆయా మండలాల ఏఈఓలు నమోదును వేగవంతం చేసేందుకు చర్యలు చేపట్టాలని ఒత్తిడి తీసుకొస్తున్నాం. రైతులకు గ్రామాల్లో గడువులోగా ఈకేవైసీ నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలి. పీఎం కిసాన్‌ లబ్ధి రైతులే కాకుండా మిగిలిన రైతులు కూడా ఈకేవైసీ చేసుకుంటే మంచిది. – జాన్‌సుధాకర్, జిల్లా వ్యవసాయాధికారి 

ఇప్పటి వరకు రాలే.. 
ఇప్పటి వరకు పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి డబ్బులు రాలేదు. అనేకసార్లు దరఖాస్తు చేసుకున్నా ఫలితం లేకపోయింది. ఇప్పుడు ఈకేవైసీ చేసుకోవాలని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. ఈ నెల 31 వరకు గడువు ఉన్నందు వల్ల వెంటనే చేసుకుంటాను. 
– గోవిందరెడ్డి, రైతు, పెద్దకడ్మూర్‌ గ్రామం

మరిన్ని వార్తలు