Kamareddy Road Accident: మృతుల కుటుంబాలకు ప్రధాని రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా

9 May, 2022 12:34 IST|Sakshi

సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాద ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బాధితుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్ కింద తక్షణ సాయంగా రూ. 2 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. గాయపడిన వారికి చికిత్స కోసం రూ. 50 వేలు ప్రకటించారు.

కాగా జిల్లాలోని ఎల్లారెడ్డి–బాన్సువాడ రహదారిపై అన్నాసాగర్‌ తండా సమీపంలో జరిగిన లారీ-ఆటో ట్రాలీ ఢీకొన్న ఘోర రోడ్డు ప్రమాదంలో 9 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. మరో 16 మంది గాయపడ్డారు. ఈ సంఘటనపై రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, మంత్రి ప్రశాంత్‌ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. ప్రభుత్వం వారికి అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసానిచ్చారు. బాన్సువాడ, ఎల్లారెడ్డి, నిజామాబాద్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.

మరిన్ని వార్తలు