తొలిరోజు ముగిసిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం

2 Jul, 2022 21:19 IST|Sakshi

Updates:

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం తొలి రోజు ముగిసింది. ఈ భేటీలో ఆర్థిక, రాజకీయ తీర్మానాలు జరిగాయి. పార్టీ ఆర్థిక తీర్మానాన్ని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రవేశపెట్టారు. సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో రేపు(ఆదివారం) బీజేపీ విజయ సంకల్ప సభకు భారీ ఏర్పాట్లు చేశారు.

పార్టీ ఆర్థిక తీర్మానాన్ని ప్రవేశపెట్టిన రాజ్‌నాథ్‌ సింగ్‌
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం కొనసాగుతోంది. కీలక అంశాలపై చర్చ జరుగుతోంది. పార్టీ ఆర్థిక తీర్మానాన్ని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రవేశపెట్టారు. పార్టీ ఖర్చులు, ఆస్తులు విరాళాలపై చర్చించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలపై నేతలు చర్చించారు. గుజరాత్‌, కర్ణాటక రాష్ట్రాల్లో  పార్టీ పరిస్థితిపై సమీక్ష చేపట్టారు.

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభం
హెచ్‌ఐసీసీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రధాని మోదీ, అమిత్‌షా, నడ్డా, జాతీయ నేతలు హాజరయ్యారు. రెండు రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి. పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని పటిష్టం చేసే దిశగా చర్చలు జరపనున్నారు. రేపు(ఆదివారం) కూడా హైదరాబాద్‌లోనే ప్రధాని మోదీ ఉండనున్నారు. రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు సమావేశాల్లో ఆయన పాల్గొననున్నారు. రేపు సాయంత్రం సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో జరిగే బహిరంగ సభలో  మోదీ ప్రసంగించనున్నారు.

హైదరాబాద్‌లో ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు ప్రధాని మోదీ, అమిత్‌ షా, నడ్డా, జాతీయ నేతలు హాజరయ్యారు.

ప్రధానికి స్వాగతం అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రధానికి స్వాగతం పలికానన్నారు. సీఎం తప్పనిసరిగా స్వాగతం పలకాలన్నది ఎక్కడా లేదన్నారు. గతంలో మోదీ వచ్చినప్పుడు కేసీఆర్‌ స్వాగతం పలికారు. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హాకు టీఆర్‌ఎస్‌ మద్దతు ప్రకటించిందన్నారు. బీజేపీ జాతీయ నేతలు హైదరాబాద్‌ అభివృద్ధి చూడాలని తలసాని అన్నారు.

హెచ్‌ఐసీసీకి ప్రధాని మోదీ చేరుకున్నారు. కాసేపట్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఆయన పాల్గొననున్నారు.

సాక్షి, హైదరాబాద్‌: ప్రధాని మోదీ హైదరాబాద్‌ చేరుకున్నారు. బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో ప్రధానికి గవర్నర్‌ తమిళిసై, మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ స్వాగతం పలికారు. అక్కడ నుంచి హెచ్‌ఐసీసీకి మోదీ బయలుదేరారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఆయన పాల్గొననున్నారు. రాత్రికి నోవాటెల్‌లో ప్రధాని బస చేయనున్నారు.

మరిన్ని వార్తలు