PM Modi Hyderabad Tour: ఉద్యోగులకు వర్క్‌ ఫ్రం హోమ్‌ 

25 May, 2022 13:56 IST|Sakshi

ఐఎస్‌బీకి రానున్న ప్రధాని మోదీ

కంపెనీలకు పోలీసుల అంతర్గత ఆదేశాలు

ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు

ఐఎస్‌బీ, గచ్చిబౌలి స్టేడియంలలో డ్రోన్ల నిషేధం 

సాక్షి, హైదరాబాద్‌: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు (గురువారం) ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ) 20వ స్నాతకోత్సవంలో పాల్గొననున్న నేపథ్యంలో గచ్చిబౌలి స్టేడియం, ట్రిపుల్‌ ఐటీ జంక్షన్‌ నుంచి విప్రో జంక్షన్, ట్రిపుల్‌ ఐటీ జంక్షన్‌ నుంచి గచ్చిబౌలి మధ్యలో ఉన్న ఆఫీసుల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు వర్క్‌ ఫ్రం హోమ్‌ ఇవ్వాలని లేదా ఉద్యోగుల హాజరు సమయాలలో మార్పులు చేసుకోవాలని ఆయా కంపెనీలకు పోలీసులు అంతర్గత ఆదేశాలు జారీ చేశారు. గురువారం మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సైబరాబాద్‌ కమిషరేట్‌ పరిధిలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు.  


ట్రాఫిక్‌ మళ్లింపులు ఇలా: 

► గచ్చిబౌలి జంక్షన్‌ నుంచి లింగంపల్లి వెళ్లేవారు గచ్చిబౌలి జంక్షన్‌ దగ్గర రైట్‌ టర్న్‌ తీసుకుని బొటానికల్‌ గార్డెన్, కొండాపూర్‌ ఏరియా హాస్పిటల్, మజీద్‌ బండ, హెచ్‌సీయూ డిపో ద్వారా లింగంపల్లికి వెళ్లాలి. 

► లింగంపల్లి నుంచి గచ్చిబౌలి వచ్చేవారు హెచ్‌సీయూ డిపో దగ్గర లెఫ్ట్‌ తీసుకుని మజీద్‌ బండ, కొండాపూర్‌ ఏరియా హాస్పిటల్, బొటానికల్‌ గార్డెన్‌ నుంచి గచ్చిబౌలి జంక్షన్‌కి చేరుకోవాలి. 

► విప్రో నుంచి లింగంపల్లికి వెళ్లేవారు విప్రో జంక్షన్‌ దగ్గర లెఫ్ట్‌ తీసుకుని క్యూ సిటీ, గౌలిదొడ్డి, గోపనపల్లి ఎక్స్‌ రోడ్, హెచ్‌ సీయూ బ్యాక్‌ గేట్, నల్లగండ్ల నుంచి లింగంపల్లికి వెళ్లాలి. 

► విప్రో నుంచి గచ్చిబౌలికి వెళ్లేవారు విప్రో జంక్షన్‌ దగ్గర రైట్‌ తీసుకుని ఫెయిర్‌ ఫీల్డ్‌ హోటల్, నానక్‌ రామ్‌ గూడ రోటరీ, ఓఆర్‌ఆర్, ఎల్‌ఆండ్‌ టీ టవర్స్‌ మీదుగా 
గచ్చిబౌలి జంక్షన్‌కి చేరుకోవాలి. 

► కేబుల్‌ బ్రిడ్జి నుంచి గచ్చిబౌలి జంక్షన్‌కి వెళ్లేవారు కేబుల్‌ బ్రిడ్జ్‌ పైకి ఎక్కే ర్యాంప్‌ దగ్గర రైట్‌ తీసుకుని రత్నదీప్, మాదాపూర్‌ పీఎస్, సైబర్‌ టవర్స్, హైటెక్స్, కొత్తగూడ, బొటానికల్‌ గార్డెన్‌ మీదుగా గచ్చిబౌలి జంక్షన్‌కి వెళ్లాలి. (క్లిక్‌: రెండో దశ మెట్రో రూట్‌ చేంజ్‌!)


డ్రోన్లను ఎగురవేయొద్దు 

ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ) 20వ స్నాతకోత్సవంలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. భద్రత చర్యలలో ఐఎస్‌బీ, గచ్చిబౌలి స్టేడియం ప్రాంతాలలో డ్రోన్లను ఎగరేయడానికి అనుమతి లేదు. ఆయా ప్రాంతాల చుట్టూ 5 కి.మీ. పరిధిలో పారా గ్‌లైడర్లు, రిమోట్‌ కంట్రోల్‌ డ్రోన్‌లు, రిమోట్‌ కంట్రోల్‌ మైక్రో లైట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌లకు నిషేధం విధించారు. బుధవారం మధ్యాహ్నం 12 నుంచి గురువారం సాయంత్రం 6 గంటల వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని సైబరాబాద్‌ ఇన్‌చార్జి పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ తెలిపారు. ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. (క్లిక్‌: హైదరాబాద్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌.. ‘త్రి’ పాత్రాభినయం!)

మరిన్ని వార్తలు