నైపుణ్యం, సాంకేతికతతోనే దేశ ప్రగతి

12 Oct, 2022 01:52 IST|Sakshi
ప్రధాని వీడియో సందేశాన్ని వింటున్న  కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయ మంత్రి  జితేంద్ర సింగ్, కార్యదర్శి ఎస్‌.చంద్రశేఖర్‌ 

ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడి

అందరినీ కలుపుకొనిపోయే సాధనంగా సాంకేతిక ప్రగతి

చిట్టచివరి వ్యక్తికీ సాధికారత కల్పించేలా సర్కారు కృషి

ఘనంగా మొదలైన భూ ప్రాదేశిక సమాచార కాంగ్రెస్‌

సాక్షి, హైదరాబాద్‌: నైపుణ్యం, సాంకేతిక పరిజ్ఞానం అన్న రెండు స్తంభాల ఆధారంగానే భారతదేశ అభివృద్ధి ప్రస్థానం కొనసాగిందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. దేశంలో సాంకేతిక పరిజ్ఞానం అన్నది అందరినీ కలుపుకొని పోయే సాధనంగా అవతరించిందని చెప్పారు. ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో భారత శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన విభాగం నిర్వహిస్తున్న ‘ప్రపంచ భూ ప్రాదేశిక సమాచార కాంగ్రెస్‌ –2022’ నాలుగు రోజుల సదస్సు మంగళవారం హెచ్‌ఐసీసీలో ప్రారంభమైంది.

ఈ సందర్భంగా ప్రధాని వీడియో ద్వారా తన సందేశం అందించారు. ఎవరూ వెనుకబడిపో కూడదనే ప్రపంచ భూ ప్రాదేశిక సమాచార కాంగ్రెస్‌ ప్రధాన ఇతివృత్తం (జియో ఎనేబిలింగ్‌ గ్లోబల్‌ విలేజ్‌: నో వన్‌ షుడ్‌ బి లెఫ్ట్‌ బిహైండ్‌) మాదిరిగానే భారత ప్రభుత్వం కూడా చిట్టచివరి వ్యక్తికీ సాధికా రత కల్పించేందుకు యుద్ధ ప్రాతిపదికన కృషి చేస్తోందని మోదీ తెలిపారు.

అట్టడుగు వర్గాలకు కూడా భారీ లబ్ధి చేకూర్చే లక్ష్యంతో తాము కార్యక్ర మాలు చేపట్టామన్నారు. ఇందులో భాగంగా 45 కోట్ల మందికి బ్యాంకింగ్‌ సౌకర్యాలు, 13.5 కోట్ల మందికి బీమా ప్రయోజనం, 11 కోట్ల కుటుంబాలకు పారిశుధ్య వసతి, ఆరు కోట్ల కుటుంబాలకు  నల్లాల ద్వారా తాగునీరు అందించగలిగామని చెప్పారు. లబ్ధిదారులు పలు పాశ్చాత్యదేశాల జనాభా కంటే ఎన్నో రెట్లు ఎక్కువని మోదీ పేర్కొన్నారు.

ఆ రెండే కీలకం...
దేశ అభివృద్ధి ప్రస్థానంలో టెక్నాలజీ, నైపుణ్యం రెండే కీలకమైన స్తంభాలని ప్రధాని తెలిపారు. టెక్నాలజీ మార్పును తీసుకొస్తుందని, అతిచిన్న వ్యాపారి కూడా ఈ రోజున డిజిటల్‌ పేమెంట్లకు అంగీకరిస్తుండటం అలాంటి మార్పేనని వివరించారు. కోవిడ్‌–19 సమయంలోనూ ప్రభుత్వం టెక్నాలజీ సాయంతో పేదలను ఆదుకుందని జామ్‌ ట్రినిటీగా చెప్పుకునే జన్‌ధన్‌ యోజన, ఆధార్‌ కార్డు ఆధారిత డేటాబేస్, మొబైల్‌ నంబర్ల ద్వారా 80 కోట్ల మందికి సంక్షేమ ఫలాలు అందించగలిగిందని గుర్తుచేశారు. వాతావరణ మార్పుల వంటి అంతర్జాతీయ సమస్యలను ఎదుర్కొనేందుకు కూడా టెక్నాలజీనే కీలకం కానుందన్నారు.

అందరికీ అందుబాటులో భూ ప్రాదేశిక సమాచారం
కోవిడ్‌ మహమ్మారి ప్రపంచానికి ఓ మేలుకొలుపు లాంటిదని, సంక్షోభ సమయంలో అన్ని వర్గాల వారినీ కలుపుకుని పోవాల్సిన అవసరాన్ని గుర్తు చేసిందని మోదీ చెప్పారు. భూ ప్రాదేశిక సమాచారం లాభాలను సమాజంతో పంచుకునే విషయంలో భారత్‌ ఇప్పటికే తనదైన ముద్ర వేసిందన్నారు. రెండు వందల సంవత్సరాలుగా పలు జాతీయ సంస్థలు సేకరించిన భూ ప్రాదేశిక సమాచారాన్ని ఇప్పుడు అందరికీ అందుబాటులోకి తెచ్చామని.. ఇది దేశ ప్రగతి ప్రస్థానంలో రెండో స్తంభమైన యువ నైపుణ్యానికి కొత్త దారులు పరిచిందని చెప్పారు. 

స్టార్టప్‌ల ఏర్పాటులో అగ్రగామిగా భారత్‌
స్టార్టప్‌ కంపెనీల ఏర్పాటులో భారత్‌ ఇప్పుడు ప్రపంచంలోనే అగ్రగామిగా ఉందని, 2021 నుంచి ఇప్పటివరకూ వందకోట్ల డాలర్ల టర్నోవర్‌ సాధించిన యునికార్న్‌ స్టార్టప్‌లు రెట్టింపు అయ్యాయని తెలిపారు. ఇదంతా యువత నైపుణ్యం వల్లనే సాధ్యమైందన్నారు. ప్రభుత్వం భూ ప్రాదేశిక రంగంతోపాటు డ్రోన్‌ల వినియోగాన్నీ ప్రోత్సహిస్తోందని, అంతరిక్ష రంగంలోనూ ప్రైవేట్‌ సంస్థలకూ భాగస్వామ్యం కల్పించిందని వివరించారు. మంగళవారం నాటి ప్రారంభ కార్యక్రమానికి కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్‌ జితేంద్ర సింగ్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. 

>
మరిన్ని వార్తలు