30న ఎన్టీపీసీ ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్లాంట్‌ జాతికి అంకితం  

25 Jul, 2022 02:16 IST|Sakshi

జ్యోతినగర్‌ (రామగుండం): ఎన్టీపీసీ రామగుండం ప్రాజెక్టు వద్ద రిజర్వాయర్‌లో నిర్మించిన 100 మెగావాట్ల ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్లాంట్‌ను ఈనెల 30వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతికి అంకితం చేయనున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పర్యావరణానికి అనుకూలంగా రూ.423 కోట్ల వ్యయంతో ఈ ప్లాంట్‌ను నిర్మించారు. ప్రాజెక్టు రిజర్వాయర్‌లో దాదాపు 500 ఎకరాలలో దీనిని ఏర్పాటు చేశారు.

ఒక్కోటి 2.5 మెగావాట్ల చొప్పున 40 బ్లాకులుగా ఈ ప్లాంట్‌ను విభజించారు. ఈ ప్లాంట్‌ వల్ల ఏడాదికి సుమారు 32.5 లక్షల క్యూబిక్‌ మీటర్ల నీటి ఆవిరిని నివారించవచ్చని అధికారవర్గాలు తెలిపాయి. కాగా, వర్చవల్‌ పద్ధతిలో ఈ ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్లాంట్‌ను ప్రధాని జాతికి అంకితం చేయనున్నందున అధికారులు అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు