ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలి

18 Feb, 2022 01:45 IST|Sakshi

సీఎంకు స్వయంగా ఫోన్‌చేసి శుభాకాంక్షలు చెప్పిన ప్రధాని మోదీ

రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, గవర్నర్, ఇతర రాష్ట్రాల సీఎంలు జగన్, స్టాలిన్, హిమంత, పిన రయి విజయన్‌ కూడా..

రాజకీయ విభేదాలు పక్కనబెట్టి శుభాకాంక్షలు తెలిపిన బండి సంజయ్, రాజాసింగ్‌ 

సోషల్‌ మీడియాలో సీఎం కేసీఆర్‌కు శుభాకాంక్షల వెల్లువ

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పుట్టినరోజు సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఏటా కేసీఆర్‌ జన్మదినం రోజున ఫోన్‌ చేస్తున్న ప్రధాని మోదీ.. ఈసారి కూడా స్వయంగా కేసీఆర్‌కు ఫోన్‌ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానిగా మోదీ ఎనిమిదేళ్ల పాలన, అనుసరించిన విధానాలతో దేశం నాశనమైందని, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పోతేనే దేశానికి మంచిదంటూ.. సీఎం కేసీఆర్‌ కొంతకాలంగా తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్‌కు ప్రధాని స్వయంగా ఫోన్‌ చేయడం ఆసక్తిగా మారింది. అంతేగాకుండా.. ‘తెలంగాణ సీఎం కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు. మీరెప్పుడూ ఆయురారోగ్యాలతో వర్థిల్లాలని ప్రార్థిస్తున్నాను’అని ప్రధాని ట్వీట్‌ చేశారు.

రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతికూడా..
రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సైతం సీఎం కేíసీఆర్‌కు ఫోన్‌ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ట్విట్టర్‌ ద్వారా కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ప్రజాసేవకు అంకితమై ముందుకుసాగుతున్న మీ జీవితంలో సుఖశాంతులు నిండాలి. భగవంతుడు మీకు దీర్ఘాయువు, ఆరోగ్యం ఇవ్వాలి..’’అని ట్వీట్‌ చేశారు. సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణ, గవర్నర్‌ తమిళిసై కూడా శుభాకాంక్షలు తెలిపారు.

కేటీఆర్, హరీశ్, కవిత..
‘‘కలల స్వాప్నికుడు, అసాధ్యాన్ని సుసాధ్యం చేయగల నేర్పరి. ధైర్యానికి మారుపేరు, మార్పుకు ఆద్యుడు.. నా తండ్రి, నాయకుడు అని నేను గర్వంగా చెప్పుకునే మీరు దీర్ఘాయుష్షు, దేవుడి దీవెనలతో వర్థిల్లాలి..’’అని మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. సీఎం పుట్టినరోజు సందర్భంగా దుండిగల్‌ మున్సిపాలిటీ పరిధిలోని బహదూర్‌పల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో కుత్బుల్లాపూర్‌ నియో జకవర్గానికి చెందిన 300 మంది దివ్యాంగులకు ‘గిఫ్ట్‌ ఏ స్మైల్‌’కింద మూడు చక్రాల వాహనాలను మంత్రి కేటీఆర్‌ అందజేశారు.

‘హ్యాపీ బర్త్‌డే డాడీ. ప్రతిరోజూ మీ నుంచి ఏదో కొత్త విషయాన్ని నేర్చుకుంటా. మీరు ఓ వ్యవస్థ’’అని ఎమ్మెల్సీ కవిత ట్వీట్‌ చేశారు.

‘మీరు కారణజన్ములు. మీ జన్మదినం తెలంగా ణకు పుట్టినరోజు. తెలంగాణ తల్లి రుణం తీర్చుకున్న ఈ ముద్దుబిడ్డ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలి. మా ప్రియతమ నేతకు పుట్టినరోజు శుభాకాంక్షలు..’అని మంత్రి హరీశ్‌రావు ట్వీట్‌ చేశారు.

ఢిల్లీలోని తుగ్లక్‌రోడ్‌లో ఉన్న కేసీఆర్‌ నివాసంలో టీఆర్‌ఎస్‌ ఎంపీ సురేశ్‌రెడ్డి కేక్‌ కట్‌ చేసి వేడుకలు నిర్వహించారు.

వైఎస్‌ జగన్, ఇతర రాష్ట్రాల సీఎంలు..
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కేసీఆర్‌కు ట్విట్టర్‌ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భగవంతుడు ఆయనకు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని ఆకాంక్షించారు. తమిళనాడు సీఎం స్టాలిన్‌ కేసీఆర్‌కు ఫోన్‌ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అంతేగాకుండా.. ‘‘రాష్ట్రాల హక్కులు, ప్రాంతీయ స్వయం ప్రతిపత్తి కోసం నిరంతరంగా పోరాడుతున్న నాయకుడు కేసీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. రాజ్యాంగం ప్రసాదించిన సహకార సమాఖ్య వ్యవస్థ, రాష్ట్రాల గౌరవాన్ని పరిరక్షించేందుకు అందరం కలిసి పనిచేద్దాం’’అని ట్వీట్‌ కూడా చేశారు. కేరళ సీఎం పినరై విజయన్‌ ట్విట్టర్‌ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.

కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, నితిన్‌ గడ్కరీ, హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, వైఎస్సార్సీపీ నేతలు విజయసా యిరెడ్డి, రోజా, టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేశ్, సినీనటులు చిరంజీవి, నాగార్జున, మహేశ్‌బాబు, నితిన్, మాజీ గవర్నర్‌ నరసింహన్, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్, హైదరాబాద్‌లోని యూఎస్‌ కాన్సుల్‌ జనరల్‌ జోయల్‌ రైఫ్‌మన్, బ్రిటిష్‌ డిప్యూటీ హైకమిషనర్‌ ఆండ్రూ ఫ్లెమింగ్‌ తదితరులు కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. కాగా తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ కేసీఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు.

బీజేపీ నేతల శుభాకాంక్షలు.. రేవంత్‌ వివాదాస్పద ట్వీట్‌
సీఎం కేసీఆర్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్, ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. అయితే టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి మాత్రం ఊసరవెల్లి ఫొటోకు జన్మదిన శుభాకాంక్షలు అంటూ ట్వీట్‌ చేయడం వివాదాస్పదంగా మారింది.

ట్వీట్‌ చేసిన అస్సాం సీఎం
సీఎం కేసీఆర్‌కు అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ట్విట్టర్‌ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ‘కామాఖ్య తల్లి, శ్రీమంత శంకరదేవ మహా పురుషుడు మీకు ఆయురారోగ్యాలు ఇచ్చి దీ వించాలి’ అని ట్వీట్‌ చేశారు. ఇటీవల రా హు ల్‌గాంధీపై హిమంత చేసిన వివాదాస్పద వ్యా ఖ్యలను సీఎం కేసీఆర్‌ తీవ్రంగా తప్పుబట్టి క్షమాపణ చెపాల్పని కోరడం, ఇద్దరి మధ్య మా టల యుద్ధం జరిగిన నేపథ్యంలో హిమంత ట్వీట్‌ ప్రాధాన్యత సంతరించుకుంది.  

మరిన్ని వార్తలు