TS: 12న రాష్ట్రానికి రానున్న ప్రధాని.. కాక పుట్టించనున్న మోదీ సభ

5 Nov, 2022 02:57 IST|Sakshi

రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని జాతికి అంకితం చేయనున్న ప్రధాని 

రామగుండంలో బహిరంగ సభకు బీజేపీ ఏర్పాట్లు 

సాక్షి, హైదరాబాద్‌: ప్రధాని మోదీ ఈనెల 12న రాష్ట్ర పర్యటనకు వచ్చే అవకాశముంది. రాష్ట్రంలో ఇప్పటికే వేడెక్కిన రాజకీయాలను మోదీ పర్యటన మరింత కాక పుట్టించే అవకాశముంది. కేంద్రం, బీజేపీపై వస్తున్న ఆరోపణలను మోదీ గట్టిగా తిప్పికొడతారని బీజేపీ ముఖ్యనేతలు అభిప్రాయపడు తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 12న రెండు తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మోదీ వస్తుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న అనంతరం ఆయన తెలంగాణకు రానున్నట్లు సమాచారం. ఈ పర్యటన షెడ్యూల్‌పై ఒకట్రెండు రోజుల్లో స్పష్టతరానుంది. రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీని మోదీ జాతికి అంకితం చేయడంతోపాటు పలు జాతీయ రహదారులకు శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత రామగుండంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించే బహిరంగసభలో మోదీ ప్రసంగించనున్నారు.

కొంతకాలంగా బీజేపీ, టీఆర్‌ఎస్‌ మధ్య వ్యవహారం ఉప్పునిప్పుగా సాగుతుండగా, మునుగోడు వేడి దీనిని మరింత పెంచింది. తాజాగా తమ నలుగురు ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభపెట్టి తమ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం జరుగుతోందని టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే.  

రాజకీయవర్గాల్లో ఆసక్తి 
నలుగురు ఎమ్మెల్యేలకు ప్రలోభాల అంశానికి సంబంధించిన ఆడియో, వీడియో టేప్‌లు జాతీయ మీడియాలో విస్తృతంగా ప్రసారం కావడంతో దేశవ్యాప్తంగా ఈ అంశం చర్చనీయాంశమైంది. మునుగోడు పోలింగ్‌ ముగిశాక కేసీఆర్‌ ప్రగతిభవన్‌లో ఈ ఉదంతానికి సంబంధించిన వీడియో టేపులను విడుదల చేయడంతో మరోసారి జాతీయస్థాయిలో ఇది చర్చకు దారితీసింది.

ఈ నేపథ్యంలో రాష్ట్రానికి రానున్న మోదీ.. కేసీఆర్‌ ఆరోపణలపై గట్టి సమాధానం ఇస్తారని బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. విపక్షాలు అధికారంలో రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి ప్రభుత్వాలను బీజేపీ కూల్చే ప్రయత్నం చేస్తోందన్న ఆరోపణలను కూడా మోదీ దీటుగా తిప్పికొడతారని చెబుతున్నాయి. ఈలోగా మునుగోడు ఫలితం కూడా రానున్నందున 12న జరగబోయే పరిణామాలు రాజకీయవర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

మూతపడిన రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని 2017లో ఆధునీకరించి మోదీ ఆన్‌లైన్‌లో గజ్వేల్‌ నుంచి శంకుస్థాపన చేశారు. కొంతకాలం క్రితమే ఈ ఫ్యాక్టరీ ఉత్పత్తి కూడా ప్రారంభించగా, దీనిని 12న మోదీ జాతికి అంకితం చేయనున్నారు. ఈ సందర్భంగా నిర్వహిస్తున్న సభను రాష్ట్ర బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీనిని విజయవంతానికి రాష్ట్ర నాయకత్వం సన్నాహాలు మొదలుపెట్టింది.    

మరిన్ని వార్తలు