బన్సీలాల్‌పేట్‌ కోనేరు బావిపై మోదీ ప్రశంసలు

28 Mar, 2022 15:26 IST|Sakshi
పునరుద్ధరణ పనులు కొనసాగుతున్న పురాతన బావి ఇదే..

వాననీటి సంరక్షణ పట్ల ప్రధాని అభినందనలు

ఆగస్టు 15 నాటికి పూర్తిస్థాయిలో పునరుద్ధరణ 

సాక్షి, హైదరాబాద్‌/బన్సీలాల్‌పేట: సికింద్రాబాద్‌ బన్సీలాల్‌పేట్‌లోని పురాతన బావి పునరుద్ధరణపై ప్రధాని నరేంద్రమోదీ హర్షం వ్యక్తం చేశారు. నిజాం కాలం నాటి ఈ బావికి పూర్వవైభవాన్ని తెచ్చారని ఆయన కొనియాడారు. నీటిసంరక్షణ, భూగర్భ జలాలను కాపాడుకొనేందుకు స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులు చేస్తున్న కృషిని ప్రధాని అభినందించారు. ఆదివారం మన్‌ కీ బాత్‌లో బన్సీలాల్‌పేట్‌లోని బావి గురించి ఆయన ప్రస్తావించారు. చెత్తా చెదారం, మట్టితో నిండిన ఈ  బావిని వాననీటి సంరక్షణ కేంద్రంగా అభివృద్ధి చేయడం  సంతోషదాయకమన్నారు.  

ఇవీ ప్రత్యేకతలు.. 
► సుమారు 1830 కాలానికి చెందిన బన్సీలాల్‌పేట్‌ బావి అద్భుతమైన శిల్పకళా సంపదను కలిగి ఉంది. బావి ప్రవేశ ద్వారం ఆర్చ్‌లాగా ఉంటుంది. చుట్టూ ఏర్పాటు చేసిన రాతి కట్టడం, సింహాలు, పాములు, గుర్రాల బొమ్మలు అలనాటి కళాత్మకతను సమున్నతంగా ఆవిష్కరిస్తాయి. 35 మీటర్ల వెడల్పు 53 అడుగుల లోతు ఉన్న ఈ  బావి చాలా కాలం వరకు ఉనికిని చాటుకుంది. 

► 40  ఏళ్ల  క్రితం దీనిని  పూర్తిగా మూసివేశారు. మట్టి, చెత్తా చెదారంతో నిండిపోయింది. వాహనాలకు పార్కింగ్‌ అడ్డాగా మారింది. వాననీటి సంరక్షణ  కోసం ఉద్యమాన్ని చేపట్టిన ‘ది రెయిన్‌ వాటర్‌ ప్రాజెక్టు’ సంస్థ జీహెచ్‌ఎంసీ సహకారంతో బావి పునరుద్ధరణకు నడుం కట్టింది. చెత్తా చెదారం తొలగించారు. సుమారు 2 వేల టన్నుల మట్టిని సైతం తొలగించి బావికి పూర్వ ఆకృతిని తెచ్చారు. ప్రస్తుతం ఈ బావి నీటితో తళతళలాడుతోంది.  

► దీని చుట్టూ ఏర్పాటు చేసిన రాతి కట్టడాలు, కళాకృతులను  పూర్తిస్థాయిలో పునరుద్ధరించి ఆగస్టు నాటికి ఈ ప్రాంగణాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయనున్నట్లు ‘ది రెయిన్‌ వాటర్‌ ప్రాజెక్టు’ వ్యవస్థాపకులు కల్పన రమేష్‌ లోకనాథన్‌  తెలిపారు. ఇప్పటి వరకు  పూడికతీత కోసం రూ.30 లక్షల వరకు ఖర్చు చేశారు. అద్భుతమైన ఆర్కిటెక్చర్‌తో బావిని కళాత్మకంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. (క్లిక్‌: నల్సార్‌ సాహసోపేతమైన నిర్ణయం)

పాతబావులకు పూర్వవైభవం... 
ఇప్పటి వరకు నగరంలో గచ్చిబౌలి, కొండాపూర్, నార్సింగి. కోకాపేట్, బన్సీలాల్‌పేట్‌ బావులను పునరుద్ధరించారు. బాపూఘాట్‌ బావి పునరుద్ధరణకు ప్రణాళికలను సిద్ధం చేశారు. నిజాం కాలం నాటి సిటీ కాలేజీ చుట్టూ ఒకప్పుడు 87 బావులు ఉండేవని వాటిలో చాలా వరకు శిథిలమయ్యాయని కల్పన తెలిపారు. ఆ ప్రాంతంలో ఉన్న రెండు బావులను మాత్రం పునరుద్ధరించేందుకు అవకాశం ఉంది. విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బందితో కలిసి ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. ఈ బావికి పూర్వవైభవంపై ప్రధాని అభినందించడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. (క్లిక్‌: హైదరాబాద్‌లో ఈ ఏరియాలో అద్దె ఇళ్లకు ఫుల్‌ డిమాండ్‌)

మరిన్ని వార్తలు