ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన ఖరారు.. కొత్త తేదీ ఇదే..

22 Jan, 2023 04:19 IST|Sakshi

వచ్చే నెల 13న రాష్ట్రానికి మోదీ!

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన

పరేడ్‌ గ్రౌండ్స్‌లో బహిరంగ సభ

పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు

ఈ నెల 19నే జరగాల్సిన పర్యటన.. పలు కారణాలతో వాయిదా....

ఈ కార్యక్రమాలనే రీషెడ్యూల్‌ చేసినట్టుగా సమాచారం

మోదీ సభ కోసం ఏర్పాట్లు మొదలుపెట్టిన రాష్ట్ర బీజేపీ!

సాక్షి, హైదరాబాద్‌: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వచ్చే నెల (ఫిబ్రవరి) 13న రాష్ట్రానికి రానున్నారు. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ ఆధునీకరణ పనులతో పాటు వివిధ అభివృద్ధి కార్యక్రమా లకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడంతోపాటు పరే డ్‌గ్రౌండ్స్‌లో నిర్వహించే బహిరంగసభలో ప్రసంగించనున్నారు. ఈ పర్యటనకు సంబంధించి ప్రధానమంత్రి కార్యాల యం (పీఎంవో) నుంచి కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి జి.కిషన్‌రెడ్డి కార్యాలయానికి సమాచారం అందినట్టు తెలిసింది.

19నాటి పర్యటన వాయిదాతో..
వాస్తవానికి ప్రధాని మోదీ ఈ నెల 19నే రాష్ట్రంలో పర్యటించి.. వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను, సికింద్రాబాద్‌ స్టేషన్‌ ఆధునీకరణ, ఇతర అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించాల్సి ఉంది. కానీ పలు కారణాల వల్ల ఆ పర్యటన వాయిదా పడింది. దీంతో ప్రధాని మోదీ తెలుగు రాష్ట్రాల ప్రజలకు సంక్రాంతి పండుగ కానుకగా ఈ నెల 15న ఢిల్లీ నుంచి వర్చువల్‌గా వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించారు. ఈ క్రమంలో తిరిగి రాష్ట్ర పర్యటనను పీఎం కార్యాలయం ఖరారు చేసినట్టు సమాచారం. దీనికి సంబంధించి ఇంకా దక్షిణ మధ్య రైల్వేకు అధికారికంగా సమాచారం అందలేదని తెలిసింది.

సభ ప్రయత్నాల్లో బీజేపీ!
పరేడ్‌ గ్రౌండ్స్‌లో ప్రధాని మోదీ సభపై సమాచారం అందిన రాష్ట్ర బీజేపీ నేతలు ఏర్పాట్లలో పడినట్టు తెలిసింది. హైదరాబాద్, పొరుగున ఉన్న జిల్లాలతోపాటు రాష్ట్రం నలుమూలల నుంచి జన సమీకరణతో మోదీ సభను విజయవంతం చేయాలని వారు భావిస్తున్నారు. ఇక ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్‌ లో రాష్ట్రానికి వివిధ రూపాల్లో కేటాయింపులు పెంచుతారని.. వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు కేంద్రం ఇస్తున్న నిధులను మోదీ తన ప్రసంగంలో ప్రస్తావించే అవకాశం ఉందని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. కేంద్రం సరిగా నిధులు ఇవ్వడం లేదంటూ సీఎం కేసీఆర్,     మిగతా 8వ పేజీలో u
మంత్రులు, బీఆర్‌ఎస్‌ నేతలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టే అవకాశం ఉందని అంటున్నారు. 

మోదీ పాల్గొనే కార్యక్రమాలివీ!
ఇంతకుముందే ఖరారైన పర్యటన ప్రకారం ప్రధాని మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయాల్సి ఉంది. అందులో వందేభారత్‌ రైలును ఇప్పటికే ప్రారంభించినందున.. మిగతా కార్యక్రమాల షెడ్యూల్‌ సిద్ధమవుతున్నట్టు తెలిసింది. మొత్తంగా రూ.7,076 కోట్ల విలువైన ప్రాజెక్టులకు పచ్చజెండా ఊపనున్నట్టు సమాచారం.

– రూ.1,410 కోట్లతో సికింద్రాబాద్‌– మహబూబ్‌నగర్‌ మధ్య నిర్మించిన డబుల్‌ లైన్‌ జాతికి అంకితం
– ఐఐటీ హైదరాబాద్‌లో రూ. 2,597 కోట్లతో చేపట్టిన వివిధ నిర్మాణాలను (అడ్మిన్‌బ్లాక్, అకడమిక్‌ బిల్డింగ్స్, హాస్టళ్లు, క్వార్టర్స్, టెక్నాలజీ రిసెర్చ్‌ పార్కు, టెక్నాలజీ ఇన్నోవేషన్‌ పార్కు, రిసెర్చ్‌ సెంటర్‌ కాంప్లెక్స్, కన్వెన్షన్‌ సెంటర్, నాలెడ్జ్‌ సెంటర్, గెస్ట్‌హౌస్, లెక్చర్‌ హాల్‌ కాంప్లెక్స్, క్యాంపస్‌ స్కూల్, లేబోరేటరీ, హెల్త్‌కేర్‌ ఫెసిలిటీ) జాతికి అంకితం.
– రూ.699 కోట్లతో సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ (ఆధునీకరణ) అభివృద్ధి పనులకు భూమిపూజ.
– రూ.521 కోట్ల వ్యయంతో కాజీపేటలో నిర్మించనున్న రైల్వే పీరియాడికల్‌ ఓవర్‌ హాలింగ్‌ వర్క్‌షాప్‌కు శంకుస్థాపన
– రూ.1,336 కోట్లతో చేపట్టిన మహబూబ్‌నగర్‌–చించోలి 2/4 లేన్ల రహదారి విస్తరణ పనులకు శంకుస్థాపన
– రూ.513 కోట్ల వ్యయంతో నిజాంపేట–నారాయణఖేడ్‌–బీదర్‌ సెక్షన్‌ జాతీయ రహదారి విస్తరణ పనులకు భూమిపూజ
– తెలంగాణకు మరిన్ని ఎంఎంటీఎస్‌ రైళ్లు, శంషాబాద్‌ (ఉందానగర్‌) వరకు ఎంఎంటీఎస్‌ సేవలు, మేడ్చల్‌ వరకు ఎంఎంటీఎస్‌ సేవల పొడిగింపు, రైళ్ల సంఖ్య పెంపు, కాచిగూడ నుంచి విశాఖపట్నం ట్రైన్‌ మహబూబ్‌నగర్‌ వరకు పొడిగింపు వంటి ప్రకటనలు వచ్చే అవకాశం ఉంది.  


చదవండి: లభించని ఆ ముగ్గురి ఆచూకీ.. డ్రోన్ల సాయంతో సెర్చ్‌ ఆపరేషన్‌

మరిన్ని వార్తలు