మాస్కు తప్పనిసరి.. లేకుంటే నో ఎంట్రీ

4 Sep, 2020 19:16 IST|Sakshi

ఈనెల 7 నుంచి అసెంబ్లీ, కౌన్సిల్‌ సమావేశాలు

అసెంబ్లీకి వచ్చే ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి

స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: శాసనసభ,మండలి సమావేశాలు ఈ నెల 7న ప్రారంభమవుతాయని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ కమిటీ హాల్‌లో మీడియాతో మాట్లాడుతూ శాసనసభకు వచ్చే సభ్యులందరూ జాగ్రత్త చర్యలు పాటించాలని సూచించారు. కరోనాను ప్రభుత్వం కట్టడి చేయడం వల్లన మరణాల సంఖ్య తగ్గిందని ఆయన పేర్కొన్నారు. అసెంబ్లీ హాజరయ్యే సభ్యులు, సిబ్బంది, మీడియా, పోలీసులు తప్పనిసరిగా కరోనా టెస్టులు చేయించుకుని సభకు హాజరుకావాలన్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో కోవిడ్‌ టెస్టులు ప్రారంభించామని తెలిపారు. జిల్లాల్లో ఉన్న ఎమ్మెల్యేల వద్దకు వైద్య సిబ్బంది వచ్చి టెస్టులు నిర్వహిస్తారని వెల్లడించారు. మంత్రులు, ఎమ్మెల్యేల పీఏలు కూడా టెస్టులు చేయించుకోవాలని శ్రీనివాసరెడ్డి తెలిపారు. (చదవండి: ‘టిఫిన్‌’ తినేదెట్లా?)

అసెంబ్లీ లాబీ హాల్‌లోకి ఎమ్మెల్యేల పీఏలకు అనుమతిలేదని పేర్కొన్నారు. అసెంబ్లీకి వచ్చే ప్రతిఒక్కరికి మాస్కులు తప్పనిసరి అని, లేకుంటే అనుమతి లేదని స్పష్టం చేశారు. ప్రజా ప్రతినిధులకు కరోనా కిట్‌లు అందజేస్తున్నామని తెలిపారు. ఆక్సీమీటర్‌లో 90 కంటే తక్కువగా ఉంటే జాగ్రత్త వహించాలని సూచించారు. లాబీ పాస్‌లు రద్దు చేశామని తెలిపారు. ఈ శాసనసభ సమావేశాలకు మీడియా పాయింట్‌ ఉండదన్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో సీనియర్ వైద్య బృందం, అసెంబ్లీ- మండలిలో ఒక్కో అంబులెన్స్ అందుబాటులో ఉంచుతామన్నారు. సభా సమయం వృధా కాకుండా సమావేశాలు జరుపుకోవడానికి సభ్యులందరూ సహకరించాలని కోరారు. పార్లమెంట్‌ తరహాలో, కోవిడ్‌ నిబంధనలకు లోబడి సమావేశాలు జరుపుతామని స్పీకర్‌ శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. (చదవండి: రోజు పది మందే చనిపోతున్నారా?: హైకోర్టు)

మరిన్ని వార్తలు