నా జీవితమంతా సంఘర్షణే: నిఖిలేశ్వర్‌

19 Sep, 2021 15:31 IST|Sakshi

మూఢ భక్తి, సంకుచిత జాతీయవాదం దేశానికి ప్రమాదకరం

తెలంగాణ, ఏపీల్లో సగం మంది రచయితలు పాలకులకు అమ్ముడుపోయారు

ప్రజాక్షేమం కోరే రచయితలకు అగ్ని పరీక్షే

కార్మిక, రైతాంగ సంక్షేమం దిశగా రచనలు జరగాలి

‘సాక్షి’ ఇంటర్వ్యూలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత నిఖిలేశ్వర్‌ 

ఢిల్లీలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్న రచయిత 

సాక్షి, న్యూఢిల్లీ: ఆరు దశాబ్దాల సాహిత్య చరిత్రలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్న ప్రసిద్ధ కవి, రచయిత, అనువాదకుడు నిఖిలేశ్వర్‌. సమాజంలో ఉన్న జాడ్యాలకు షాక్‌ ట్రీట్‌మెంట్‌ ఇచ్చేలా దిగంబర సాహిత్యానికి అంకురార్పణ చేసిన ఆయన.. విప్లవ రచయితల సంఘం వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు. యువత సంకుచిత భావాలను పక్కనపెట్టినప్పుడే పురోగతి సాధ్యమని చెప్పే ఆయన.. 83 ఏళ్ల వయసులోనూ చురుగ్గా, వినూత్నంగా ఆలోచిస్తుంటారు. తాను రాసిన అగ్నిశ్వాస కవితా సంపుటి (2015–2017)కిగాను శనివారం ఢిల్లీలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి’ప్రతినిధితో ప్రత్యేకంగా ముచ్చటించారు. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న పరిణామాలు, ఆధునిక రచనలపై అభిప్రాయాలను, తన అనుభవాలను పంచుకున్నారు. వివరాలు ఆయన మాటల్లోనే..
 
మూఢ భక్తి, సంకుచిత జాతీయవాదం ప్రమాదకరం 
ఇప్పుడున్నది రచయితలకు పరీక్షా సమయం. జాతీయతను, దేశభక్తిని ప్రతీవ్యక్తి కోరుకుంటారు. కానీ ప్రజాస్వామిక, లౌకిక విధానాలతో, విలువలతో బ్రతుకుతున్న ఈ దేశంలో.. ప్రస్తుతం కనిపిస్తున్న మూఢ భక్తి, సంకుచిత జాతీయవాదం ప్రమాదకరంగా పరిణమించాయి. పాలకులు అసహనంతో ఉన్నారు. తప్పిదాలను, పొరపాట్లను ఎత్తిచూపితే సహించడం లేదు. అణచిపెట్టి జైలుపాలు చేస్తున్నారు. భీమా కోరేగావ్‌ మొదలు వరవరరావును జైలులో పెట్టడం దాకా అనేక ఘటనలు దీనికి ఉదాహరణగా నిలుస్తున్నాయి. నేడు స్వేచ్ఛ, స్వాతంత్య్రం, ప్రజల క్షేమం కోరే రచయితలు నిజంగా అగ్నిపరీక్ష ఎదుర్కొంటున్నట్టే. 

విప్లవమార్గం, ఉద్యమం దెబ్బతిన్నాయి 
గత 20 ఏళ్లలో ప్రధానంగా అస్తిత్వ పోరాటాల పరిణామం చోటు చేసుకుంది. ప్రతీవారు తమ ఉనికి కోసం, గుర్తింపు కోసం రచనలు చేయాలన్న ఆలోచన పెరిగింది. గుర్తింపుకోసం జరిగిన పోరాటంలో విప్లవ గ్రూపులుగానీ, కమ్యూనిస్టులుగానీ స్త్రీవాదులను, దళితులను పట్టించుకోలేదనే కారణంతో స్త్రీవాదం, దళితవాదం, మైనార్టీవాదం ఏర్పడ్డాయి. ఆయా వర్గాల్లో కొత్త రచయితలు రావడం మంచి పరిణామమే అయినా.. కేవలం వారి వర్గాలపైనే రచనలను కేంద్రీకరించడం వల్ల ప్రధానమైన విప్లవమార్గం, ఉద్యమం దెబ్బతిన్నాయి. దేశంలో ఈ అస్తిత్వ పోరాటాలు, వ్యక్తిత్వవాదుల సంఖ్య పెరిగింది. 
 
కార్మిక, రైతాంగ సంక్షేమం దిశగా రచనలు జరగాలి 
ఆరు దశాబ్దాల సామాజిక జీవిత అనుభవంతో గమనిస్తే.. తర్వాత తెలుగు సాహిత్యం ఇప్పటికీ సజీవంగా ఉందని కనిపిస్తోంది. చాలామంది సీనియర్‌ కవులు మంచి రచనలు చేస్తున్నారు. అయితే.. ఆధునిక తెలుగు సాహిత్యాన్ని వ్యక్తివాద, సంకుచితదృష్టి నుంచి, మతవాదం నుంచి, కులతత్వం నుంచి రక్షించాల్సిన అవసరం ఉంది. సువిశాల దృష్టితో కార్మిక, రైతాంగ సంక్షేమం దిశగా రచనలు చేయాల్సి ఉంది. 
 
సగంమంది అమ్ముడుపోయారు 
రచయితల్లో కెరీర్‌పై దృష్టిపెట్టేవారు, డబ్బు కోసం రచనలు చేసేవారు ఎక్కువయ్యారు. నిబద్ధతతో ప్రజా ఉద్యమాలకు, ప్రజలకు గొంతుకగా మారడానికి తక్కువ మందే మిగిలారు. పైగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కొన్నేళ్లుగా చిత్రమైన పరిణామం చోటుచేసుకుంది. రెండు రాష్ట్రాల్లోనూ సగంమంది రచయితలు పాలకవర్గాలకు అమ్ముడుపోయారు. వారి బాకాలుగా మారిపోయారు. బుద్ధిజీవులు, మేధావులు సైతం తమ బాధ్యత మరిచిపోతున్నారు. పదవులకు, అవార్డులకు ఎగబడటం వల్లే ఈ పరిణామం ఏర్పడింది. సాహిత్యంలో ఒక విభజన రేఖ వచ్చేసింది.
 

ఆ సాహిత్యాన్ని అపార్ధం చేసుకున్నారు 
దిగంబర కవుల పేరిట వచ్చిన మూడు సంపుటాలకు ప్రశంసలు, విమర్శలు రెండూ పొందాం. యువతరం, అభ్యుదయభావాలు ఉన్నవారు.. ఇది సమాజంలో ఒక షాక్‌ ట్రీట్‌మెంట్‌గా ఉందని, తిరుగుబాటు లక్ష్యాన్ని పొందుతుందని ప్రశంసలు ఇచ్చారు. కానీ ఇందులో అశ్లీల పదజాలాన్ని, బూతులు వాడారంటూ సాహితీవేత్తలు అపార్థం చేసుకొన్నారు. వారి విమర్శలను ఈ విషయంపైనే కేంద్రీకరించుకున్నారు. అంతేతప్ప దిగంబర కవుల నిజాయతీని, ధర్మాగ్రహాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఈ భిన్నాభిప్రాయాల వల్ల విమర్శలు ఎదుర్కొన్నాం.
  
జీవితమంతా సంఘర్షణే.. 
నా జీవితమంతా సంఘర్షణే. చిన్నతనంలోనే నాన్న చనిపోవడంతో మా అమ్మ నగరానికి తీసుకొచ్చి పెంచి పోషించారు. అక్కడి నుంచే నా జీవిత పోరాటం మొదలైంది. హైస్కూల్‌ దశ దాకా అన్వేషణ, వెతుకులాట, దిశాహీనమైన పరిస్థితులను చూశాను. హైస్కూల్‌ దశ దాటుతుండగా సాహిత్యం, నిరంతర పఠనం నన్ను కాపాడాయి. కుంభం యాదవరెడ్డి పేరుతో రచనలు మొదలుపెట్టాను. కళాశాలలో చేరినప్పుడు తీసుకున్న ఫిలాసఫీ, పొలిటికల్‌ సైన్స్, ఇంగ్లిష్‌ లిటరేచర్‌ సబ్జెక్టులు నా జీవితానికి సాహిత్యపరంగా, అవగాహనపరంగా ఊతమిచ్చాయి. రెండు, మూడు ఉద్యోగాలు మారడం, ప్రేమ వివాహం చేసుకోవడం మరో సంఘర్షణగా మిగిలాయి. గత ఆరు దశాబ్దాల్లో ఎన్నో తీపి, చేదు అనుభవాలు పొందాను. సాహిత్య పఠనం, నిరంతర అధ్యయనం నన్ను రక్షించాయి. నాకు సాహిత్య అకాడమీ అవార్డు వస్తుందని గత పదేళ్లుగా ప్రతి ఏటా నా మిత్రులు భావిస్తూ వచ్చారు. కానీ నేను ఏనాడూ అవార్డుల కోసం ఆశపడలేదు. ఇప్పుడు అవార్డు వచ్చినందుకు ఆనందంగానే ఉంది.  


ఆ కారణంగానే ‘విరసం’నుంచి బయటికి వచ్చాం 

దిగంబర కవులుగా 1965, 1967, 1968 సంవత్సరాల్లో మూడు సంపుటాలు వెలువరించాం. అందులోని దిగంబర కవులు నాటి యువతరానికి, వారి ధర్మాగ్రహానికి ప్రాతినిధ్యం వహించారు. ఆ మూడు సంపుటాల్లోనూ తాత్వికమైన, సిద్ధాంతపరమైన పరిణామాన్ని ఎదుర్కొన్నాం. ఈ పరిణామ క్రమంలో యువతరంలో సినిమా రంగం, రాజకీయ రంగాల పట్ల భ్రమలు తొలగిపోయాయి. నిరాశ, నిస్పృహలు, నిరుద్యోగం వల్ల ఆగ్రహం పెరిగింది. 1968–70 సమయంలో అంతర్జాతీయంగా ఉద్యమాలు వచ్చాయి. సహజంగానే నాటి యువ రచయితలు, మిగతావారు రచనలపరంగా, ప్రజలపరంగా మార్పు రావాలని కోరుకున్నారు.

విప్లవమే మార్గమని యువత భావిస్తున్న సమయంలో.. నక్సల్బరీ ఉద్యమం, శ్రీకాకుళం గిరిజన తిరుగుబాటు వంటివి ఆశాకిరణంగా కనిపించాయి. యువతరం ఆ వైపు మొగ్గింది. ఆ క్రమంలోనే విప్లవ రచయితల సంఘం ఏర్పడింది. కానీ 1970–75 మధ్య విప్లవానికి ఏ పంథా అవసరం, ప్రజలు ఎలా పాల్గొంటారు, రచయితలు స్వతంత్రంగా రాయగలిగి ప్రజలకు చైతన్య స్ఫూర్తిని ఇవ్వాలే తప్ప పార్టీకి తోకగా మారవద్దన్న ఆలోచన మొదలైంది. దీనితో విరసంలో చీలిక వచ్చి.. 1975లో బయటికి వచ్చేశాం.  

మరిన్ని వార్తలు